Sunday, May 5, 2024

ప్రభుత్వ ఆస్తులు పెంచి శాశ్వత నిర్మాణాలను చేపట్టిన ఒకే ఒక్క‌డు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: జాతిపిత మహాత్ముడు ప్రభోదించిన అహింసాయుత ఉద్యమ బాటలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రసాదించిన హక్కుల మేరకు ఒక్క రక్తపుబొట్టు నేలచిందకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రాష్ట్ర విభజన నాటికి ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, అప్పులఊబిలో కూరుకుపోయిన తెలంగాణ ప్రాంతాన్ని తొలి ఐదేళ్ళు తిరిగేసరికి బంగారు తెలంగాణగా మార్చారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రతి గ్రామానికి సాగు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. తాజాగా కాలం చెల్లిన సచివాలయ భవనా స్థానంలో తెలంగాణాకే మణిమకుటంలా రాష్ట్ర చారిత్రిక వైభవాన్ని చాటిచెప్పేలా నూతన సచివాలయాన్ని రికార్డ్‌ సమయంలో నిర్మించి ఆదివారం ప్రారంభించారు. దీనిపై కూడా విపక్షాలు రాజకీయ రాద్ధాంతం మొదలెట్టాయి. అత్యద్భుత నిర్మాణాల ద్వారా కేసీఆర్‌ తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. పాలన, సంక్షేమాలకంటే చరిత్రలో గొప్ప నాయకుడిగా, పాలకుడిగా చిరస్థాయిగా నిలవాలన్న ఆకాంక్షకు కేసీఆర్‌ పరిమితమయ్యారంటూ పేర్కొంటున్నాయి. అయితే ప్రజాస్వామ్యవాదులు విపక్షాల విమర్శల్ని తీవ్రంగా తప్పు బడుతున్నారు.

కేసీఆర్‌ ప్రయత్నంతో తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ప్రాతిపదికన సంపద సమకూరుతోందని స్పష్టం చేస్తున్నారు. అత్యద్భుత నిర్మాణశైలిలో రూపొందించిన సచివాలయ నిర్మాణానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ పేరెట్టడం ద్వారా భారత రాజ్యాంగ వ్యవస్థల పట్ల, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపైన కేసీఆర్‌కున్న విశ్వాసం ప్రస్పుటమౌతోందన్నారు. ఈ భవనం కేసీఆర్‌ సొంతం కాదు. ఆయన కుటుంబ సభ్యులదికాదు. ఇది తెలంగాణ ఆస్తి. ఈ రాష్ట్ర సంపద. ఇందులో తెలంగాణ ప్రజలందరికీ భాగస్వా మ్యముంది. గత 9ఏళ్ళలో కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలన్నీ తెలంగాణ జాతికి వారసత్వంగా సంక్రమించే సంపదలే. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులే. వీటిపై వ్యక్తిగతంగా కేసీఆర్‌కు గాని, ఆయన కుటుంబీకులకు గాని ఎలాంటి హక్కులు దఖలుకావు. భారీ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలతోనే ఆయా రాష్ట్రాల సంపదను ఆర్థిక సంస్థలు లెక్కిస్తాయి. వాటికనుగుణంగానే ఆ రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యా న్ని, తిరిగి చెల్లింపు శక్తిని కూడా అంచనాలేస్తాయి. అందుకు తగ్గట్టుగానే దేశవిదేశాల్లో పెట్టుబడిదార్లు ముందుకొస్తారు. బహుళజాతి సంస్థలు తమ శాఖల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తాయంటూ వీరు స్పష్టం చేసారు.

2014లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల పెంపునకు కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో ప్రభుత్వ భవనాల విస్తీర్ణం కేవలం 60లక్షల చదరుపు అడుగులు మాత్రమే. కాగా అది ఇప్పుడు 2.30కోట్ల చదరపు అడుగులకు పెరిగింది. ప్రభుత్వ ఆస్తుల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందంజంలో ఉంది. కేవలం ఈ ప్రభుత్వాస్తుల విస్తీర్ణం ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి రూ.30 లక్షల కోట్ల విలువైన శాశ్వత సంపద పెరిగింది. కాగా తాజాగా కొత్త సచివాలయ విస్తీర్ణం 8.50లక్షల చదరపు అడుగులు. ఇక రాష్ట్ర విభజన అనంతరం కేవలం పదిజిల్లాలుగా ఉన్న తెలంగాణలో కేసీఆర్‌ జిల్లాల పునర్విభజన చేశారు. 33జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు, పోలీస్‌ కార్యాలయాలతో పాటు 68రకాల ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా స్థాయి కార్యాలయాల్ని ప్రభుత్వం సొంతంగా నిర్మించింది. రాష్ట్ర స్థాయిలో 5.06లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కూడా నెలకొల్పింది. ఐటీ రంగంలో స్టార్టప్‌ల ఏర్పాటు కోసం తొలుత టీహబ్‌ను ఏర్పాటు చేసింది. అనంతరం దీన్ని రెండో దశలో దీన్ని 5.83లక్షల చదరపు అడుగుల కార్యాలయంగా విస్తరించింది. అన్ని జిల్లాల్లో ఐటీ టవర్లను నిర్మించింది. వరంగల్‌లోని హెల్త్‌ సిటీలో 24అంతస్తుల్లో 16.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తోంది. తెలంగాణాలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలలు, ఆస్పత్రుల భవనాల విస్తీర్ణం 32లక్షల చదరపు అడుగులకు చేరింది. అలాగే నగరంలోని అల్వాల్‌, గడ్డిఅన్నారం ఎర్రగడ్డల్లో మూడు టిమ్స్‌ ఆస్పత్రుల్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటి ఒక్కొక్క ఆస్పత్రి విస్తీర్ణం 13.71లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం. మూడు కలసి మొత్తం 41లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రులొస్తున్నాయి.

కాగా ఇప్పటికే 61,544చదరపు అడుగుల విస్తీర్ణంలో బంజార భవన్‌ను, 82,009 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆదివాసీ భవన్‌ను నిర్మించారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 2.88లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వార్టర్స్‌ను ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 119నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంప్‌ కార్యాలయాల్ని నిర్మిస్తోంది. వీటన్నింటి విస్తీర్ణం 4.23లక్షల చదరపు అడుగులు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.లక్ష కోట్లు, మిషన్‌ భగీరథ కోసం రూ.35 వేల కోట్లు కేసీఆర్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు. మొత్తం 33జిల్లాల్లోనూ పారిశ్రామిక హబ్‌లను నెలకొల్పారు. తద్వారా కేసీఆర్‌ ప్రభుత్వం అతిపెద్ద మౌలిక సదుపాయాల్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రభు త్వం ఇంత వేగంగా ఆస్తుల్ని పెంపొందిస్తున్న కారణంగానే దేశ, విదేశాల నుంచి కూడా ఏటా వేల కోట్ల విలువైన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి పోటెత్తుతున్నాయి. గతంలో ప్రభుత్వం నిర్మించిన ప్రగతి భవన్‌ నుంచే కేసీఆర్‌ పాలన చేస్తున్నారు. అది కూడా ఆయన సొంతం కాదు. అది తెలంగాణ ప్రజల ఆస్తి. అలాగే ఇప్పుడు ఆయన సమకూరు స్తున్నవన్నీ తెలంగాణాకు వారసత్వ సంపదలే. గత ప్రభుత్వా లు ప్రభుత్వాస్తుల్ని, స్థలాల్ని అమ్ముకున్నాయి. వాటి ద్వారా నిధుల్ని సమీకరించి రోజువారి పాలనను సాగించాయి. ఈ దశలో ప్రభుత్వ ఆస్తుల్ని పెంచే ప్రయత్నం చేస్తున్న సీఎం ఒక్క కేసీఆర్‌ మాత్రమేనని వీరు విశ్లేషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement