Tuesday, June 18, 2024

పేదల సొంతింటి కల నెరవేర్చిన కేసీఆర్ : సత్యవతి రాథోడ్

నిరుపేదలకు నిలువనీడ కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి సొంతింటి కలను నెరవేర్చిన మహానుభావుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో తాసిల్దార్ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో 58, 59 ప్రభుత్వ ఉత్తర్వుల నిబంధనలతో ప్రభుత్వ భూమిలోని ఇళ్లకు క్రమబద్ధీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని అర్హులైన నిరుపేదలకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ … పట్టాలు రానివారు ఆందోళన చెందవద్దన్నారు. పన్నుల చెల్లింపులతో అభివృద్ధి వేగవంతంగా ఉంటుందని, రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాలు తప్పనిసరిగా కల్పిస్తామన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ పట్టాలందుతాయని, వలస వచ్చిన వారిని ప్రోత్సహించకూడదన్నారు. త్వరలోనే సమగ్ర సర్వే చేపడతామని, అందరికీ మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

పట్టణం నలు వైపులా జాతీయ రహదారులు వస్తున్నాయని, పట్టణ అభివృద్ధి వేగవంతంగా జరుగుతున్నదని, ప్రభుత్వ అవసరాలకు కూడా ప్రభుత్వ భూమి అవసరం ఉందని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. 350 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసుకున్నామని, త్వరలో మెడికల్ కళాశాల పూర్తిస్థాయిలో రూపుదిద్దుకొని నిరుపేద ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలతో అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్ డీ ఓ కొమరయ్య, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తాసిల్దార్ నాగ భవాని, కౌన్సిలర్లు మార్నేని వెంకన్న, పుష్పలత, శ్రీదేవి, ఫరీదా జిల్లా అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement