Wednesday, December 11, 2024

Twitter | ఇది లిక్కర్​ గ్యారంటీ సర్కారు.. కర్నాటక ప్రభుత్వంపై బొమ్మై ఆగ్రహం!

కర్నాటకలోని కాంగ్రెస్​ ప్రభుత్వం తీరు ఏమాత్రం బాగాలేదని, కరువులో నీరు ఇవ్వడానికి బదులుగా మద్యం ఏరులై పారిస్తోందని మండిపడ్డారు మాజీ సీఎం బసవరాజ్​ బోమ్మై. తాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం అన్ని గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉంచేందుకు సన్నాహాలు చేస్తోందని, ఇది ‘మద్యం హామీ ప్రభుత్వం’ అని సెటైర్లు వేశారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత కరువులో నీరు అందించడంలో విఫలమైందన్నారు మాజీ సీఎం బస్వరాజు బోమ్మై. అయితే మద్యం అందుబాటులో ఉంచేందుకు కాంగ్రెస్​ సర్కారు సన్నాహాలు చేస్తోందని మండిపడ్డారు మాజీ సీఎం బొమ్మై. ట్విట్టర్​ X పై వరుస పోస్ట్ లలో బొమ్మై ఇలా రాసుకొచ్చారు.

‘‘పంచాయతీ స్థాయిలో కొత్త వైన్ షాపులను తెరవాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ నైతిక దివాళా కోరుతనాన్ని చూపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం గ్యారెంటీ పేరుతో ఒక్కో మహిళకు రూ.2వేలు ఇస్తూనే మరోవైపు వైన్ షాపుల ద్వారా వారి భర్తల నుంచి ఆ సొమ్మును లాక్కోవడానికి ప్రభుత్వం కొత్త మార్గాన్ని కనుగొంది.’’

‘‘మహిళలకు ఇచ్చే డబ్బును వారి భర్తల ద్వారా పొందే మనీ రిటర్న్ పాలసీలా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉంది.’’

- Advertisement -

‘‘అక్రమ వ్యాపారాన్ని తనిఖీ చేయడంలో సంబంధిత శాఖ విఫలమైతే, ఆ శాఖను కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి?” అని బొమ్మై ప్రశ్నించారు.

‘‘మద్యం కొనడానికి డబ్బు కోసం భార్యాభర్తల మధ్య గొడవకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రూ.2000 హామీ పథకం వల్ల ఇంటి పెద్ద ఎవరు అన్న విషయంపై కోడలు, అత్తమామల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొత్త వైన్‌షాపుల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తే.. హామీ పథకంలో పొందుతున్న మహిళా లబ్ధిదారులు వారికి గుణపాఠం చెబుతారు”అని బొమ్మై ట్విట్టర్​లో వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement