Friday, May 3, 2024

17వేల అడుగుల ఎత్తులో యోగాస‌నాలు – వైర‌ల్ గా వీడియో

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని భార‌త్ తో పాటు అనేక దేశాల్లో నేడు సామూహిక యోగాస‌నాల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే ITBP సిబ్బంది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లతో పాటు భార‌త్-చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణులలో యోగా ఆస‌నాలు వేశారు. ఉత్తరాన లడఖ్ నుండి తూర్పున ఉన్న సిక్కిం వరకు, 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ITBP జవాన్లు యోగా ఆసనాలను ప్రదర్శించారు. ఆక్సిజ‌న్ కూడా స‌రిగా ల‌భించ‌ని చోట యోగాస‌నాలు వేయ‌డం గ‌మ‌నార్హం. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లడఖ్‌లో పలువురు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది 17,000 అడుగుల ఎత్తులో యోగా చేశారు.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ITBP సిబ్బంది కూడా యోగా సెషన్‌ను నిర్వహించారు.

ఇక్క‌డ జ‌వాన్లు వ‌రుసుగా 16,500 అడుగులు, 16,000 అడుగుల ఎత్తులో యోగా చేశారు. అలాగే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)కి చెందిన హిమ్‌వీర్లు సిక్కింలో మంచు కురిసిన పరిస్థితుల్లోనూ 17,000 అడుగుల ఎత్తులో యోగా సాధన చేశారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐటీబీపీ ఓ పాటను కూడా విడుద‌ల చేసింది. గౌహతిలోని లచిత్ ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నదికి ఎదురుగా ITBPకి చెందిన 33వ‌ బెటాలియన్ కూడా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా యోగాస‌నాలు వేశారు. లోహిత్‌పూర్‌లోని ATS ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కొన వద్ద ఉన్న హిమ్‌వీర్లు గుర్రాలతో యోగా సాధన చేశారు. కాగా.. 2015 నుంచి ప్ర‌తీ యేటా జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచంలోని ప‌లు ప్రాంతాల్లో సామూహికంగా యోగా సాధ‌న చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement