Friday, April 26, 2024

యూపీలో దారుణం.. కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి.. 30మందికి తీవ్ర అస్వస్థత..

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా పహర్‌పూర్ గ్రామంలో కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి చెందారు. 30మందికి పైగా తీవ్ర అనారోగ్యంతో జిల్లా ఆసుపత్రిలో చేరారు. మంగళవారం అర్ధరాత్రి ఓ కార్యక్రమంలో మద్యం తాగగా తొలుత 12 మంది పరిస్థితి విషమించింది.. వీరిలో ఏడుగురు చనిపోయారు. కాగా, కల్తీ మద్యం విక్రయించిన దుకాణాన్ని పోలీసులు సీజ్ చేశారు. మద్యం తాగి కొంతమంది చనిపోయినట్టు తెలియగానే యజమాని కనిపించకుండా పోయాడు. జిల్లా మేజిస్ట్రేట్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.

మద్యం సేవించి ఒక మహిళతో సహా ఏడుగురు మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం మృతులకి పోస్టుమార్టం నిర్వహించి విచారణ జరుపుతున్నారు. కల్తీ మద్యం సరఫరా చేసిన వారిని పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నారు అని రాయ్‌బరేలీ డీఎం వైభవ్ చెప్పారు. మద్యం సరఫరాదారు రెండు ప్రత్యేక బ్రాండ్ల మద్యాన్ని విక్రయించారని, వాటిలో ఒక బ్రాండ్ ఈ మరణాలకు కారణమని తేలింది. నమూనాలను సేకరించి, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశామని రాయ్‌బరేలీ ఎస్పీ శ్లోక్ కుమార్ తెలిపారు.

దాదాపు 50 మంది ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. వీరంతా మద్యం తాగేందుకు గుమిగూడారు. మద్యం తాగిన తర్వాత ఆమె కళ్లు తిరిగిపడిపోవడంతో పాటు అప్పటికప్పుడే ఆరోగ్య పరిస్థితి విషమించింది అని మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన 55 ఏళ్ల సుఖరాణి దేవి కుమార్తె చెప్పారు. గ్రామం వెలుపల అదే దుకాణంలో మద్యం కొనుగోలు చేశారని.. ఆ తర్వాత చాలామంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని మరో మృతుడి కుమారుడు 22 ఏళ్ల సత్యం తెలిపారు. తమ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ప్రాణాలు కోల్పోయారని, షాపు యజమాని వీరేంద్ర ప్రతాప్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం తాగి భర్తను కోల్పోయిన వర్ష అనే 26 ఏళ్ల మహిళ తన కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక వ్యక్తి ఇప్పుడు లేనందున బాధితులను అరెస్టు చేసి, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement