Friday, June 14, 2024

శ్రీరామ నవమి విశిష్టత ఏంటి ?

శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే..
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!

నేడు శ్రీరామ నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. చిత్ర శుద్ధ నవమి రోజున కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఈరోజున రాముడిని భక్తితో పూజిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈరోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీ రాముడి జన్మదినమైన ఛైత్రశుద్ధ నవమిని హిందువులు అత్యంత వేడుకగా జరుపుకుంటారు. రాముడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని భక్తుల నమ్మకం. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి రోజున అంగరంగ వైభవంగా సీతాముల కళ్యాణం జరుపుతారు. ఈ రోజు పానకం, వడపప్పు పంచిపెడతారు.

పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి చెందినవారు. దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం ఆయన జననం జరిగిందని కొంతమంది చెబుతారు. ఆ సమయంలో సూర్యుడు అత్యంత ప్రకాశంవతంగా కనిపించడాని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ రాముడు పితృవాక్యపరిపాలకుడు. తన తండ్రి మాటను జవదాటేవాడే కాదు. తండ్రిచ్చిన మాటకు కట్టుబడి సతీమేతంగా, సోదరుడి లక్ష్మణుడితో కలిసి 14 ఏళ్ల వనవాసం చేశాడు. రామ బాణానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఇది ఎంతో శక్తివంతమైంది. ఒక్కసారి సంధిస్తే అది రాజ్యంలోని మొత్తం సైన్యాన్ని సమూలంగా సంహరించగలదు.

సీతమ్మను అపహరించిన రావణుడిని యుద్ధంలో సంహరించిన పిమ్మట తిరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడవుతాడు శ్రీరాముడు. అనంతరం 11 వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించడానికి నమ్ముతారు. సంపూర్ణ శాంతి, శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు. శ్రీ రామ నవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఆ రోజే జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు. రామ నవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. 

 హిందువులకు ఆరాధ్యదైవం శ్రీరాముడు. దేశములో రాముడి గుడి లేని వీధి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. శ్రీరామ నవమి వస్తుందంటే చాలు ఊరువాడా సందడే సందడి. శ్రీరామ నవమి రోజున వేకువజామునే నిద్ర లేచి శుచిగా స్నానమాచరిస్తారు దేవుడు మందిరం శుభ్రం చేసుకున్నాక దీపారాధన చేస్తారు. అలానే శ్రీ రామునికి పండ్లు, తులసి ఆకులని, పూలని, ప్రసాదాన్ని అర్పిస్తారు. నవమి రోజున దేశంలో రామాలయం ఉన్న ప్రాంతాల్లోనే కాదు.. ఊరువాడా కూడా రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. వడపప్పు, పానకం రాములవారి కల్యాణానికి ప్రసాదం గా పెట్టి అందరికీ నైవేద్యంగా పంచిపెడతారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కొరలు చాచిన నేపథ్యంలో ఇంట్లో ఉండే పండుగ చేసుకోవడమే శ్రేయస్కరం.

- Advertisement -

శ్రీరామనవమి సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలంలో ఈ నెల 20న ఎదుర్కోలు ఉత్సవం, 21న సీతారాముల కల్యాణం, 22న మహాపట్టాభిషేకానికి భక్తులకు దర్శనాలు రద్దు చేస్తూ దేవస్థానం ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకలన్నీ ఆలయంలోని నిత్య కల్యాణ మండప ప్రాంగణంలో వైదిక కమిటీ సభ్యులు, ఉద్యోగుల సమక్షంలో నిర్వహిస్తున్నామని ఈవో వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న గుడిలో భక్తులకు దర్శనాలు రద్దు చేశారు. కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement