Monday, October 7, 2024

GST | జూన్‌ 22న 53వ జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ..

వస్తు సేవల పన్నులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ఢిల్లిలో జరగనుంది. ఈ సమావేశాన్ని ఈనెల 22న నిర్వహించేలా షెడ్యూల్‌ చేశారు. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా వెల్లడించింది.

అయితే, ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చించనున్నారో మాత్రం వెల్లడించలేదు. గతేడాది అక్టోబర్‌ 7న చివరిసారిగా జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆ తర్వాత జరగాల్సిన కౌన్సిల్‌ మీటింగ్‌ను.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా మరోసారి నిర్మలా సీతారామన్‌ బాధ్యతలు చేపట్టారు. దీంతో తదుపరి కౌన్సిల్‌ మీటింగ్‌ను నిర్వహించనున్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ఈ భేటీలో పరిశీలించొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కార్యకలాపాలపై పన్ను విధింపు, తేదీని నిర్ణయించడం వంటి శాసనపరమైన సవరణలు అవసరమయ్యే జీఎస్‌టీ సంబంధిత విషయాలు, ఇన్‌పుట్‌ సర్వీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ (ఐఎస్‌డీ)లపై కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అంతకుముందు జూన్‌ 1, 2024న ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, మే 2024 నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.73 లక్షల కోట్లకు చేరాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు నెల (ఏప్రిల్‌)లో జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి.

- Advertisement -

ఏప్రిల్‌లో స్థూల జిఎస్‌టి వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 2.10 లక్షల కోట్లకు చేరాయి. ఇది ఏడాదికి 12.4 శాతం వృద్దిని కనబరిచింది. దేశీయ లావాదేవీలలో బలమైన పెరుగుదల (15.3 శాతం), దిగుమతులు మందగించడం (4.3 శాతం క్షీణత) కారణంగా వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. రీఫండ్‌లను లెక్కించిన తర్వాత, మే 2024లో నికర జీఎస్‌టీ ఆదాయం రూ. 1.44 లక్షల కోట్లుగా ఉంది.

ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.9 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. కేంద్ర వస్తు సేవల పన్ను (సిజిఎస్‌టి) వసూళ్లు రూ. 32,409 కోట్లు కాగా, రాష్ట్ర వస్తు సేవల పన్ను (ఎస్‌జిఎస్‌టి) రూ. 40,265 కోట్లుగా ఉంది. ఏకీకృత వస్తువులు, సేవల పన్ను (ఐజీఎస్‌టీ), దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ.39,879 కోట్లతో కలిపి రూ.87,781 కోట్లుగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement