Monday, April 29, 2024

Big Story | మద్యం దరఖాస్తులపై గంపెడాశలు.. 2వేల కోట్ల టార్గెట్ చేరేనా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మద్యం దుకాణాల దరఖాస్తులు పోటెత్తుతున్నప్పటికీ ఆబ్కారీ శాఖలో ఆందోళన నెలకొంటోంది. మద్యం దరఖాస్తుల రూపేణా రూ. 2వేల కోట్ల లక్ష్యం చేరుతామా లేదా అనే సంశయం వారిని నిరాశకు గురిచేస్తోంది. 2021లో మద్యం దుకాణాలకు 68వేల దరఖాస్తులురాగా, 2620 మద్యం దుకాణాలకు ఈ నెల 4నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. అయితే గురువారం రాత్రివరకు 48వేల దరఖాస్తులే వచ్చాయని అంటున్నారు. 2021లో 68వేల దరఖాస్తులతో రూ. 1357కోట్లురాగా, ఈ దఫా ఇప్పటికే 50వేల 300ల దరఖాస్తులతో రూ. 10వేల 600 కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. అయితే మరో 10వేల కోట్ల లక్ష్యం చేరేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దఫా ఈఎండీ తొలిదశ చెల్లింపులకు కూడా మినహాయింపునిచ్చారు. దీంతో వ్యాపారుల్లో ఆసక్తి నెలకొన్నది. చివరిరోజు మరో ఆరేడువేల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

2016-17లో 48,401 దరఖాస్తుల రాకతో దరఖాస్తు రుసుము రూపంలో ఖజానాకు రూ. 968కోట్ల 2 లక్షల రాబడి సమకూరింది. 2017-18లో ఇది రూ. 411కోట్లే కావడం గమనార్హం. ఈ నెల 21న కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీలు నిరక్వహించనుండగా, డిసెంబర్‌ 1నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి. అయితే లాటరీలో దుకాణం వచ్చిన వ్యాపారులు వార్షిక ఫీజులో మొదటి వాయిదాను డిసెంబర్‌లోగా చెల్లించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో వీటిరూపంలో మరో రూ. 16600కోట్లు సర్కార్‌కు ఆదాయం రానుంది.

ఈ ఏడాది దరఖాస్తులకు కొంత పోటీ తగ్గడంతో తక్కువ దరఖాస్తులు వస్తున్న జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. సిండికేట్లు ఏర్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు నిఘా ఏర్పాటు చేసి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. నిర్మల్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ప్రత్యేక బృందాలు దరఖాస్తులను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యాయి.

- Advertisement -

వ్యాపారులకు ఊరట కల్గించేలా టెండర్‌తోపాటే సమర్పించే దరావత్తు మొత్తాన్ని (ఈఎండి) రూ. 5 లక్షలనుంచి రూ. 2లక్షలకు తగ్గించడంతోపాటు, లైసెన్సు రుసుములకు గతంలోఉన్న 6 వాయిదాలను 8 వాయిదాలకు పెంచుతూ వ్యాపారులనుంచి పెద్ద మొత్తంలో స్పందన వచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ. లక్ష ఉన్న తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుమును రూ. 2 లక్షలకు పెంచగా, ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులైనా సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. గతంలో నాలుగు స్లాబులను 2011 జనాభా ఆధారంగా 6 స్లాబులకు పెంచడంతోపాటు, గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాలకు దుకాణాల పనివేళలు ఉదయం 10నుంచి రాత్రి 11 గంటలవరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించింది.

లైసెన్సుల జారీనాటికి ఎవరూ రాకుండా మిగిలిపోయిన మద్యం దుకాణాలను టీఎస్‌బిసిఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీబీసిఎల్‌నుంచి మద్యం కొనుగోళ్లపై వ్యాపారుల టర్నోవర్‌ టాక్స్‌ను 8శాతంగా నిర్ణయించిన ప్రభుత్వం, లైసెన్సు ఫీజుకంటే ఏడాదిలో 7రెట్లు మించిన అమ్మకాలపై 14.5 శాతం అదనపు ప్రివిలేజ్‌ ఫీజును వసూలు చేయనున్నారు. వ్యాపారులకు మద్యం విక్రయాలపై లాభం మార్జిన్‌లను కూడా ప్రకటించారు. ఆర్డినరీ మద్యంపై 27శాతం, మీడియం మద్యంపై 20శాతం, ప్రీమియం, విదేశీ మద్యం, బీర్లపై 20శాతం లాభం మార్జిన్‌ను పాలసీలోనే ప్రకటించారు.

ఈసారి మద్యం దుకాణాలకు మహిళా వ్యాపారులు సైతం పోటీ పడ్డారు. అయితే అమ్మకాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా కన్నేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సూర్యాపేటనల్గొండ జిల్లాల్లో సరిహద్దు జిల్లాల వ్యాపారులు దృష్టిపెట్టి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన మద్యం వ్యాపారులు స్థానిక వ్యాపారులతో కలిసి టెండర్లు దాఖలు చేస్తున్నారు. ఇక గ్రేటర్‌, మేడ్చెల్‌ జిల్లాల్లో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, డిల్లిd, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లకు చెందిన వ్యాపారులు పోటీ పడుతున్నారు.

దరఖాస్తులకు నేటితో గడువు తీరనుంది. వాటన్నింటినీ శుక్రవారంనాడు పరిశీలించి గౌడ్‌లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం చొప్పున దుకాణాలను ముందుగా కేటాయించనున్నారు. ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్‌ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీలు తీయనున్నారు. అన్ని జిల్లాల్లో 21న కలెక్టర్లు, డిప్యుటీ కమిషనర్లు, ఈఎస్‌లు, సీఐల నేతృత్వంలో భారీ బందోబస్తు నడుమ లాటరీలను తీయనున్నారు లక్కీ డ్రాలలో వచ్చినవారికి 22నుంచి ప్రొవిజనల్‌ లైసెన్సులను జారీ చేయనున్నారు. నవంబర్‌ 30లోపు పూర్తిస్థాయి లైసెన్సులను జారీ చేసి డిసెంబర్‌ 1నుంచి మద్యం దుకాణాలను ఈ కొత్త యాజమాన్యాలు నిర్వహించేలా ప్రభుత్వం షెడ్యూల్‌ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement