Friday, May 17, 2024

జనవరి-మార్చిలో పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. గతేడాదితో పోలిస్తే 9శాతం అధికం

జనవరి-మార్చి మధ్య కాలంలో ఇళ్ల అమ్మకాలు 9 శాతం పెరిగినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. ఈ మధ్య కాలంలో 78,627 యూనిట్లు అమ్ముడుపోయినట్టు తెలిపింది. గత నాలుగేళ్లతో పోల్చుకుంటే.. జనవరి నుంచి మార్చి మధ్య జరిగిన అమ్మకాల్లో ఇదే అత్యధికమని వివరించింది. దేశ వ్యాప్తంగా ప్రధానమైన 8 నగరాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్టు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వివరించింది. గత వారం అన్‌రాక్‌, ప్రాప్‌టైగర్‌ అనే రెండు కన్సల్టెంట్‌ సంస్థలు ఇళ్ల అమ్మకాలకు సంబంధించిన డేటాను విడుదల చేశాయి. అన్‌రాక్‌ ప్రకారం.. ప్రధానమైన ఏడు నగరాల్లో.. జనవరి-మార్చి మధ్య 99,550 యూనిట్లు, ప్రాప్‌టైగర్‌ ప్రకారం.. 8 ప్రధాన నగరాల్లో 70,623 యూనిట్లు అమ్ముడు పోయినట్టు ప్రకటించాయి. 2022 తొలి క్వార్టర్‌లో 8 ప్రధాన నగరాల్లో 78,627 కొత్త ఇళ్లు అమ్ముడుపోయినట్టు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే.. 9 శాతం వృద్ధి సాధించినట్టు వివరించింది. కరోనా మహమ్మారి తరువాత.. సగటున వరుసగా మూడో త్రైమాసిక గణాంకాలను మించిపోయింది.

అత్యధికంగా ఢిల్లిలో 15వేలు

దేశ వ్యాప్తంగా నెలకొన్న డిమాండ్‌లో స్థిరమైన రికవరీని సూచిస్తుంది. ఢిల్లిd-ఎన్‌సీఆర్‌లో 15,019 యూనిట్లు, బెంగళూరులో 13,663 యూనిట్లు అమ్ముడు పోయాయి. గతేడాదితో పోలిస్తే.. ఢిల్లిdలో రెట్టింపు అమ్మకాలు జరగ్గా.. బెంగళూరులో 34 శాతం వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్‌లో 35 శాతం పెరిగి.. 4,105 యూనిట్లు అమ్ముడు పోయాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం కేవలం 1 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. 6,993 యూనిట్లు మాత్రమే విక్రయించినట్టు తెలిపింది. కోల్‌కతాలో కూడా కేవలం 1 శాతం వృద్ధి నమోదైంది. ఇక్కడ 3,619 యూనిట్లు అమ్ముడు పోయాయి. ముంబైలో 21,546 యూనిట్లు అమ్ముడు పోయాయి. గతేడాదితో పోలిస్తే.. 9శాతం అధికం. పుణలో 10,305 కొత్త ఇళ్లు అమ్ముడు పోయాయి. గతేడాది క్యు1తో పోలిస్తే.. 25 శాతం తక్కువగా నమోదైంది. చెన్నైలోనూ 17 శాతం క్షీణత కనిపించింది. ఇక్కడ 3,376 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బైజల్‌ తెలిపారు. తక్కువ వడ్డీ రేట్లు, సరసమైన ధరలకు లభించడం, వేతన వృద్ధి, తగ్గుతున్న కరోనా మహమ్మారి ప్రభావం వంటి పరిస్థితులు ఇళ్ల కొనుగోలు వైపు ప్రజలు అడుగులు వేసేలా చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement