Wednesday, May 1, 2024

Big Story: సరికొత్త ఒరవడితో ఖమ్మం ప్రభుత్వ బడులు

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, అభ్యసనను ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది పాఠశాల వాతావరణం. అందులో ఉన్న వసతులు, పాఠశాల భవనాలు, తరగతి గదులు ఆకర్షణీయంగా ఉంటే విద్యార్థులు ఇష్టపడుతారు. ఇలా సౌకర్యాలు వారిలో చదువుపై ఆసక్తిని పెంచుతాయి. అన్ని వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి వాటిని విద్యార్థులు, సిబ్బంది వినియోగించుకోగలిగితే మెరుగైన ప్రమాణాలు ఉత్పన్నమవుతాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక కృషికి ఫలితం ఆవిష్కృతమవుతుంది. విద్యార్థుల అవసరాలన్నింటినీ తీర్చినప్పుడు విద్యావ్యవస్థను మరింత బలోపేతమై దేశ ప్రగతికి వెన్నెముకగా నిలుస్తుందని భావించి మంత్రి అజయ్ ఖమ్మం నగరంలో ప్రభుత్వ బడుల అభివృద్ధికి చొరవ చూపారు.

ఇప్పటికీ ‘మన ఊరు-మన బడి’ పట్టణాల్లో ‘మన బస్తీ-మన బడి’ కి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం పల్లెల్లో మూడు విడుతలుగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేసి మౌలిక వసతులు కల్పించనున్నది. పాఠశాలలకు మహర్దశ తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినది. ఇందులో ప్రధానంగా ప్రతి పాఠశాలలోనూ 12 అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనున్నది. ఖమ్మం జిల్లాలో విద్యార్థుల నమోదు ఆధారంగా మొదటి విడతలో జిల్లాలో 426 పాఠశాలలను ఎంపిక చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల్లో భాగంగా నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, అన్ని పాఠశాలలకు తాగునీటి సరఫరా, ఫర్నిచర్‌, పాఠశాలలకు రంగులు, పాఠశాల భవనాలకు మరమ్మతులు, చాక్‌బోర్డులు, ప్రహరీలు, వంటగది షెడ్లు, శిథిలావస్థకు చేరిన గదుల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. పాఠశాలల్లోని తరగతి గదుల పెచ్చులూడటం, కిటికీలు, డోర్లు, ఫ్లోరింగ్‌ తదితర మరమ్మతు పనులకు “మన ఊరు-మన బడి” ద్వారా ప్రభుత్వం నిధులను కేటాయించనున్న ది. ఇందులో భాగంగా ప్రతి తరగతీ గది, ప్రధానోపాధ్యాయుడి కార్యాలయం, తదితర గదుల పరిస్థితి పూర్తిగా తెలిసేలా ఒక్కో గదికి సంబంధించిన 8 ఫొటోలను ఎస్‌ఐఎస్‌ యాప్‌లో అధికారులు అప్‌లోడ్‌ చేశారు. బడిగోడను స్వీయ అభ్యసన బోర్డులుగా తీర్చిదిద్దనున్నారు. అందమైన చిత్తరులు, ఆకట్టుకొనే కళాఖండాలతో అందంగా ముస్తాబు చేయనున్నారు. బిల్డింగ్‌ యాజ్‌ లెర్నింగ్‌ ఎయిడ్‌ (బాల) కాన్సెప్ట్‌తో స్కూళ్లకు సర్వాంగసుందరంగా రంగులు అద్దనున్నారు. ఇదంతా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకంలో భాగంగా చేపట్టనున్న పెయింటింగ్‌ విశేషాలు. ఫ్లోర్‌ మొదలుకొని గోడలు, కిటికీలు, తలుపులు, పైకప్పు, ఫర్నీచర్‌, కారిడార్లు, ప్రహరీలు, మెట్లు, ప్లాట్‌ఫాం, ఆటస్థలాన్నింటినీ కళాఖండాలతో నింపేయనున్నారు.

చాలీచాలని గదులు, అరకొర సౌకర్యాలతో సతమతమైన ఖమ్మంలోని రోటరీనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దశ తిరిగింది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కృషికి తోడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ దత్తతతో నేడు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా పనిచేస్తుండడంతో పేద, మధ్య తరగతి వర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్చేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ఈ పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. గతంలో ఈ పాఠశాలలో 210 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 265 మంది ఉన్నారు. 6 నుంచి 10 తరగతుల వరకు ఆంగ్ల, తెలుగు మాధ్యమాలతో నడుస్తున్నది. ప్రస్తుతం ఈ పాఠశాలకు రోటరీనగర్‌, గోపాలపురం, శ్రీనగర్‌కాలనీ, ఎల్‌బీనగర్‌, టేకులపల్లి, వైఎస్‌ఆర్‌ నగర్‌ తదితర సుదూర ప్రాంత కాలనీల నుంచి విద్యార్థులు వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో మెరుగైన వసతులను గమనించి తమ పిల్లలను చేర్పించారు. ఇక్కడ విద్యాబోధన తాము ఆశించిన దానికన్నా సంతృప్తికరంగా ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తరగతి గదుల్లో ఉన్న వాల్‌ పెయింటింగ్స్‌ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సబ్జెక్టులోని పాఠ్యాంశాలు, తెలంగాణ నాయకుల చిత్రపటాలను గోడలపై వేయడం ద్వారా తెలంగాణ చరిత్ర తెలుసుకోవడంతోపాటు బొమ్మలతో బోధన సులువుగా ఉంటోంది.

మంత్రి అజయ్‌ ఈ పాఠశాలకు పువ్వాడ ఫౌండేషన్‌ ద్వారా ఏటా నోట్‌ పుస్తకాలు అందజేస్తున్నారు. ఇవి పేద విద్యార్థులకు చాలా ఉపయోగపడుతున్నాయి. పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండడంతోపాటు పచ్చని మొక్కలు అక్కడి విద్యార్థులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ చొరవతో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.36 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో వాల్‌ పెయింటింగ్స్‌తో కూడిన నాలుగు తరగతి గదులను నిర్మించింది. ఒకప్పుడు వర్షం పడితే నీళ్లతో నిండి చెరువును తలపించేలా ఉండే ఈ పాఠశాల ఇప్పుడు ఎత్తులో నిర్మించడంతో ఆకర్షణీయంగా కన్పిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement