Wednesday, May 8, 2024

వైద్యం కోసం వెళితే గెటవుట్.. ప్రభుత్వ వైద్యశాలలో ఎంపీపీకి అవమానం

ములుగు జిల్లా వాజేడు మండల ఎంపిపి శ్యామల శారదకు వాజేడు ప్రభుత్వ వైద్యశాలలో అవమానం ఎదురైంది. గత కొద్ది రోజులుగా జ్వరం రావడంతో అనారోగ్యానికి గురైన ఎంపీపీ శ్యామల శారద శుక్రవారం ఉదయం వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. అక్కడి వైద్యాధికారి సౌర్య.. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్యూలో నిలబడి ఒక రోగికి వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా పక్కనే ఉన్న కుర్చీలో ఎంపీపీ శ్యామల శారద కూర్చుండగా ఆగ్రహానికి గురైన వైద్యాధికారి సౌర్య.. ఎంపీపీ శ్యామల శారద బయటికి వెళ్లాలని సూచించారు. ఆరోగ్యం బాగోలేక వైద్య పరీక్షల నిమిత్తం వచ్చానని ఎంపిపిని చెప్పినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ”ఎంపీపీ అయితే ఏంటి ముందు బయటికి వెళ్ళండి గెటవుట్” అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. దీంతో అవమానానికి గురైన ఎంపిపి శ్యామల శారద అసహనం వ్యక్తం చేస్తూ తోటి ప్రజాప్రతినిధురాలైన వాజేడు జెడ్పిటిసి తల్లిడి పుష్పలతకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

జడ్పిటిసి వైద్యశాలకు వెళ్లి వైద్యాధికారి సౌర్య పై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను గౌరవించడం తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు అయితే బయటికి వెళ్ళమంటే తప్పేముందని వైద్యాధికారి మొండిగా సమాధానం ఇవ్వడంతో.. మహిళా ప్రజాప్రతినిధులు అవమానానికి గురయ్యారు. వైద్యాధికారి తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన వాజేడు మండల ఎంపీపీకే ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది అంటే సామాన్య రోగుల పరిస్థితి ఏంటి? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రోగుల పట్ల ఆప్యాయత అనురాగాలతో మెలగాల్సిన ప్రభుత్వ వైద్య అధికారులు నిర్లక్ష్యం సమాధానంతో వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వ్యవహార శైలితో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉత్తమ సేవలు అభాసుపాలు కాక తప్పడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి నిర్లక్ష్యపు వైద్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: కన్నడ పవర్ స్టార్ ‏కు గుండెపోటు.. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యంపై ఆందోళన

Advertisement

తాజా వార్తలు

Advertisement