Friday, May 17, 2024

TS: సర్కారు బడికి ఫుల్ డిమాండ్‌.. అడ్మిషన్లకు క్యూ క‌డుతున్న పేరెంట్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల భారం, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలవైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రైవేట్‌లో రూ.వేలకు వేలు ఫీజులు కట్టలేక సర్కారు బడిబాట పడుతున్నారు. సర్కారు బడుల్లోనూ గతం కంటే నాణ్యమైన విద్య, మౌలిక వసతులతు మెరుగవ్వడంతో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. దీంతో సర్కారు బడుల్లో అడ్మిషన్లు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కో తరగతిలో సామర్థ్యానికి మించి అడ్మిషన్లు నమోదవుతున్నాయి. వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఉదయాన్నే బడిబాట పడుతున్నారు.

లేటుగా వస్తే ఎక్కడ తమ పిల్లలకు స్కూళ్లో సీటు లభించదోనని ఆందోళన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రైవేట్‌ స్కూళ్లల్లో మనం చూసి ఉంటాం. కానీ ప్రస్తుతం అడ్మిషన్ల కోసం క్యూ కట్టే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లోనూ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఫుల్‌ అయిన బడులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రతి జిల్లాలో దాదాపు అడ్మిషన్ల కోసం డిమాండ్‌ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు 7 వరకు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ 200 పాఠశాలల్లోనూ అత్యధికంగా అడ్మిషన్లు నమోదైన టాప్‌ 20 పాఠశాలల వివరాలను సేకరించే పనిలో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉన్నారు.

అదేవిధంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్‌ మీడియాల్లో ఏ తరగతిలో ఎంత మంది ఈ విద్యా సంవత్సరంలో చేరారు? తరగతులవారిగా, స్కూళ్ల వారీగా, మీడియంలవారిగా అడ్మిషన్ల వివరాలను సేకరిస్తున్నారు. అయితే గతేడాదిలో కరోనా కారణంగా ప్రైవేట్‌ బడుల్లో ఫీజులు కట్టలేక చాలా మంది తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించారు. ఎన్నడూ లేనంతగా ఆ ఏడాదిలో దాదాపు 3 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరారు. అయితే ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వ బడుల్లో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నావారు సుమారు 1.40లక్షల మంది ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో ఈనెల 30 వరకు ఉండడంతో అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు దాటొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సౌకర్యాలు బాగుండటంతోనే…
రాష్ట్రంలోని సిద్ధిపేట ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాల, హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌, బోరబండ, భోలక్‌పూర్‌, లాలాపేట్‌, ఫిలింనగర్‌, సీతాఫల్‌మండి, మడ్‌ఫోర్ట్‌, నల్లగుట్ట తదితర పాఠశాల్లో అడ్మిషన్లు ఎక్కువగా అవుతున్నాయి. బోరబండ హైస్కూళ్లో 2వేలకుకు పైగా విద్యార్థులు ఉండగా ఈసారి భారీగా పెరగనున్నట్లు ఉపాధ్యాయులు చెప్తున్నారు. సిద్ధిపేట ఇందిరానగర్‌ పాఠశాలలో ఒకప్పుడు 300 మంది ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 2వేల మందికి చేరుకున్నారు. ఫిలింనగర్‌ హైస్కూళ్లో 2వేలకు మించుతారని టీచర్లు

- Advertisement -

అంచనా వేస్తున్నారు. ఇంగ్లీష్‌ మీడియం, డిజిటల్‌ బోధన చెప్తుండటంతో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. పలు కంపెనీలు, ఎన్‌జీవోలు సీఎస్‌ఆర్‌ కింద ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలను పెంచుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలకు చేర్పించేందుకు పేరెంట్స్‌ క్యూ కడుతున్నారు. ఫైరవీలు, రిఫెరెన్స్‌లతో సీట్లు పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్మిషన్లు ఫుల్‌ అవుతున్న స్కూళ్ల్లలో ఒక్కో తరగతికి మూడు, నాలుగు సెక్షన్లు ఉంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement