Friday, May 10, 2024

Foucs – మ‌ణిపూర్ కు అవి”శ్వాస” ప‌రీక్ష‌….

న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి
మణిపూర్‌ దుర్ఘటనలపై గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలు నిర్వహిస్తున్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల దృష్టి ఇప్పుడు పూర్తిగా పార్లమెంట్‌ వై పు మళ్ళింది. మణిపూర్‌లో జాతుల వైరంపై ప్రధాని మోడి స్వయం గా పార్లమెంట్‌కొచ్చి ప్రకటన చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరుచేయలేదు. పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లుల ఆమోదం కంటే ఇప్పుడీ అంశంపైనే అటు ప్రతిపక్షం ఇటు అధికారపక్షం రెండూ కూడా దృష్టి కేంద్రీ కరించాయి. విపక్షాల అల్లరితో పార్లమెంట్‌లో వాయిదాల పర్వం సాగుతూనే ఉంది. హోమ్‌మంత్రి అమిత్‌షా దీనిపై వివరణిస్తారన్న ప్రభుత్వ ప్రతిపాదనను విపక్షాలు అంగీకరించలేదు. కనీసం పార్లమెంట్‌లో ఈ దుర్ఘటనకు సంబంధించి చర్చకు కూడా సమయం ఇవ్వడంలేదు. ఈ దశలో మోడి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై ఈ నెల 8నుంచి మూడ్రోజుల పాటు చర్చ జరగనుంది. 10వ తేదీన దీనిపై ప్రధాని మోడి ఓ ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌ ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

వాస్తవానికి మొత్తం 543మంది సభ్యులున్న లోక్‌సభలో అధికార ఎన్‌డిఎకు 330మంది సభ్యులున్నారు. విపక్ష కూటమి ఇండియాకు 144మంది సభ్యులు మాత్రమే ఉండగా ఏ పక్షానికి చెందకుండా తటస్తులుగా వ్యవహరిస్తున్న 69మంది ఎమ్‌పిలున్నారు. ఈ అవిశ్వాసంలో నెగ్గడం విపక్షాలకు ఏమాత్రం సాధ్యంకాదు. కానీ దేశమే కాదు.. ప్రపంచం మొత్తం నివ్వెరబోయిన మణిపూర్‌ ఘటనపై దేశ అత్యున్నత చట్టసభల్లో దీనిపై చర్చించాలన్న తమ అభిమతం ఈ అవిశ్వాసంతో తీరుతోంది. ఇందుకోసం స్పీకర్‌ కేటాయించిన మూడ్రోజుల్లో విపక్షాలన్నింటికి చర్చలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. అలాగే ప్రభుత్వానిక్కూడా తన వాదనను వినిపించుకునే వెసులుబాటుంటుంది. దేశవ్యాప్తంగా ఈ సంఘటనపై ఏ పార్టీ ఎటువంటి వైఖరిని అనుసరించిందన్న విషయం తేటలెత్తమౌతుంది. అలాగే మణిపూర్‌ దుర్ఘటనకు సంబంధించి లోతైన విశ్లేషణకు అవకాశం దక్కుతుంది.

మరో ఎనిమిదిమాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మూడ్రోజుల పాటు పార్లమెంట్‌లో జరిగే ఈ చర్చ ప్రధానపార్టీల వాస్తవ స్వరూపాన్ని బట్టబయలు చేస్తుంది. అందుకే ఇప్పుడు జరగబోయే చర్చ పట్ల దేశంలోని 140కోట్ల మంది ప్రజలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. మణిపూర్‌ ఘటనను కొన్నివర్గాలు జాతుల సమస్యగా ప రిగణిస్తున్నాయి. మరికొన్ని అక్కడి ప్రకృతి వనరులపై కార్పొరేట్‌ శక్తుల ఆధిపత్యం కోసం సృష్టించిన సంఘర్షణగా భావిస్తున్నాయి. ఇంకొన్ని వర్గాలైతే ఈ ఘటనకు మతం రంగు పులిమాయి. ఇంకొన్నివర్గాలు దీన్ని భూ పోరాటంగా పేర్కొంటున్నాయి. అయితే ఇంతటి అకృత్యానికి దారితీసిన పరిస్థితులపై ఇప్పటివరకు ప్రభుత్వ నిఘా సంస్థలు కూడా స్పష్టమైన వివరణను ప్రకటించలేదు. ప్రభుత్వం కూడా దీనిపై ఒక్కో సందర్భంలో ఒక్కో రకమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో మణిపూర్‌ ఘటనకు సంబంధించి భారత ప్రజల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్లమెంట్‌లోజరిగే మూడ్రోజుల చర్చలో ఈ గందరగోళానికి తగిన వివరణ లభిస్తుందని దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకే :
మణిపూర్‌ ఘటనపై పార్లమెంట్‌లో చర్చించేందుకు పలు విధాలుగా తాము చేసిన ప్రయత్నానికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కొరవడ్డంతోనే చివరి ప్రయత్నంగా అవిశ్వాస మార్గాన్ని ఎంచుకున్నట్లు విపక్షకూటమి నాయకులు ప్రకటించారు. ప్రభుత్వాన్ని గద్దె దించే సఖ్యాబలం తమకు లోక్‌సభలో లేదన్న విషయాన్ని వారంగీకరిస్తున్నారు. అయితే మణిపూర్‌ సంఘటనకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ మూడ్రోజుల్లో ఎండగట్టి ప్రజల ముందు ఆవిష్కరించడమే తమ ముందున్న లక్ష్యంగా స్పష్టం చేస్తున్నారు. ఈ చర్చతో మణిపూర్‌లో అల్లర్లకు దారితీసిన కారణాలు, అల్లర్ల అణ చివేతలో ప్రభుత్వ వైఫల్యం, ఘటనలకు దారితీసిన వాస్తవ పరిస్థితులు, సరిహద్దు రాష్ట్రాల్లో వ్యవహరించాల్సిన అప్రమత్తతపై ఈ మూడ్రోజుల చర్చల్లో పలు అంశాలు వెలుగుచూస్తాయన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. చర్చ అనంతరం పార్లమెంట్‌లో ప్రధాని బదులిస్తారు. ప్రభుత్వ వైఖరిని ఆవిష్కరిస్తారు. దీన్ని విపక్షాలు సహజంగానే అంగీకరించవు. అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. ఇందులో అవిశ్వాసం వీగిపోతుంది. అయినా మణిపూర్‌తో పాటు పలు అంశాల్లో ప్రభుత్వ వ్యవహార శైలి, వైఫల్యాలు దేశ ప్రజలకు అవగతమౌతాయి. ఇప్పటికే మణిపూర్‌ రాష్ట్రంలో అంతర్యుద్దం సాగుతోంది. తెగల మధ్య వివాదం దాడులు, గృహదహనాలు, లూటీలు, దొమ్మీలు, హత్యల వరకు వెళ్ళింది. ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపుతో యావత్‌ దేశం సిగ్గుపడి తలొంచుకుంది. దీనిపై యూరోపియన్‌ పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగింది. అయినా భారత అత్యున్నత చట్టసభలో చర్చకు కేంద్రం అంగీకరించలేదు.

అవిశ్వాస తీర్మానం.. విధివిధానాలు :
ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రివర్గాన్ని అందుకు అనర్హులుగా తాము భావిస్తున్నట్లు సభలోని ఏ సభ్యుడైన అవిశ్వాసాన్ని ప్రతిపాదించొచ్చు. ప్రజలెన్నుకున్న నియమిత కాలపరిమితిగల ప్రభుత్వంపై అదే సభలోని ఓ సభ్యుడు పెట్టే అవిశ్వాస తీర్మానానికి అదే సభలోని కనీసం 50మంది సభ్యుల మద్దతు అవసరం. అప్పుడు స్పీకర్‌ ఆ తీర్మానాన్ని స్వీకరించాలి. దానిపై చర్చకు అనుమతించాలి. అదికూడా నోటీసిచ్చిన పదిరోజుల్లోగా జరగాలి. వాస్తవానికి భారత రాజ్యాంగంలో విశ్వాస లేదా అవిశ్వాస ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ మంత్రిమండలి ఉమ్మడిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుందని 75వ అధికరణం తెలియజేస్తోంది. దీన్నిబట్టి ప్రధాని, ఆయన మంత్రి మండలికి లోక్‌సభలో మెజార్టీ సభ్యుల మద్దతు అవసరం. ఆ స్థాయిలో మద్దుతులేదని నిరూపించే ప్రయత్నమే అవిశ్వాస తీర్మానం. లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని 198వ నిబంధన ప్రకారం ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించొచ్చు. ఇందుకు సభ్యుడు రాతపూర్వకంగా నోటీసు జారీ చేయాల్సుంటుంది. దాన్ని స్పీకర్‌ సభలో అందరి సమక్షంలో చదవాలి. దీనిపై చర్చకు మద్దతిచ్చే వార్ని లేచి నిలబడాలని స్పీకర్‌ కోరాలి. సభలో కనీసం 50మంది లేచినిలబడి తమ ఆమోదాన్ని తెలపాలి. అంతకులోపు మంది ఎమ్‌పిలు మద్దతిస్తే ఆ నోటీసును సీ ్పకర్‌ తిరస్కరిస్తారు. 50మందికి పైగా మద్దతు ప్రకటిస్తే దానిపై చర్చకు అనుమతిస్తారు. ఈ చర్చలో తొలుత అవిశ్వాస ప్రతిపాదిత ఎమ్‌పి మాట్లాడతారు. అనంతరం తీర్మానానికి మద్దితచ్చిన పార్టీలన్నింటికి స్పీకర్‌ అవకాశం కల్పిస్తారు. వారి ఆరోపణలన్నింటిపై ప్రధాని లేదా ఆయన ప్రతిపాదించిన మంత్రి వర్గ సహచరులెవరైనా సమాదానం చెబుతారు. అనంతరం అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌ మూజువాణి ఓటు లేదా సభ్యుల విభజన ఈ రెండు విధానాల్లో వీలుని బట్టి ఓటింగ్‌ నిర్వహిస్తారు. మణిపూర్‌ ఘటనపై కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌లు వేర్వేరుగా రెండు నోటీసులు జారీ చేశాయి. చర్చ సందర్భంగా ప్రధాని ఖచ్చితంగా సభకు హాజరై మణిపూర్‌పై తమ ప్రభుత్వ వైఖరిని స్వయంగా ప్రకటించాలని ఈ రెండుపార్టీల కు మద్దతిస్తున్న పార్టీలన్నీ గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement