Sunday, May 5, 2024

Good News: మళ్లీ విధుల్లోకి ఫీల్డ్‌ అసిస్టెంట్లు.. గతంలో పనిచేసిన చోటే బాధ్యతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పథకంలోని ఫీల్డు అసిస్టెంట్లను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో 28 నెలలుగా ఫీల్డు అసిస్టెంట్ల సుదీర్ఘ ఎదురుచూపులు ఫలించాయి. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు బుధవారం నుంచే ఫీల్డు అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డిఆర్‌డివోలకు పంచాయితీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. గతంలో పనిచేసిన చోటే 7,305 మంది ఫీల్డు అసిస్టెంట్లు విధులు నిర్వర్తించనున్నారు.

ఫీల్డు అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమను మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం పట్ల ఫీల్డు అసిస్టెంట్లు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనేక చోట్ల ఫీల్డు అసెస్టెంట్లు సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2007 ఫిబ్రవరిలో 7,561 మంది ఫీల్డు అసిస్టెంట్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. అప్పట్లో రూ.1,200 జీతంతో విధుల్లోకి వచ్చిన వారికి కొద్ది నెలల్లోనే రూ.10 వేల జీతాలు ఇచ్చింది. ఉపాధి హామీ కూలీల మాస్టర్‌ రోల్స్‌ రాయడం, వారి పనులను పర్యవేక్షించడం వంటి పనులు చేశారు. తర్వాత జాజ్‌ కార్డులు ఉన్నవాళ్లతో సాధ్యమైనంత ఎక్కువమందిని ఉపాధి పనులకు వచ్చే విధంగా చూడాలని, విధుల్లో తప్పునిసరిగా ఉండాలని అధికారులు ఆదేశించారు.

ఆ సమయంలోనే తమకు జీతాలు ఎస్టీఓల నుంచి ఇవ్వాలని, పర్మినెంట్‌ చేయాలనే డిమాండ్లతో ఫీల్డు అసిస్టెంట్లు అందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం 2021, మార్చి 18న ఫీల్డు అసిస్టెంట్లను తాత్కాలికంగా పక్కన పెట్టింది. అప్పటి నుంచి 28 నెలలుగా ఫీల్డు అసిస్టెంట్లు మంత్రి ఎర్రబెల్లిని కలిసి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి మంత్రి ఎర్రబెల్లి తీసుకెళ్ళారు. అయితే ఫీల్డు అసిస్టెంట్లు తమ ప్రభుత్వ నిబంధనల మేరకే పని చేస్తామని, అనవసర ఆందోళనలు చేయబోమని లిఖితపూర్వకంగా మంత్రి ఎర్రబెల్లికి విన్నవించారు. ఎట్టికేలకు వారిని విధుల్లోకి తిరిగి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ నిర్ణయంతో ఫీల్డు అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement