Sunday, May 5, 2024

తిరుపతి ఉపఎన్నిక: దొంగ ఓట్ల డ్రామా.. అధికార పార్టీదా? ప్రతిపక్షాలదా?

ఒకపక్క తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుంటే మరోపక్క దొంగ ఓట్లు అంటూ ప్రతిపక్షాలు నానా హడావిడి చేశాయి. బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి చేసిన ఒక్క ట్వీట్‌ అధికార పార్టీ వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందనే చెప్పాలి. మరోపక్క టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ స్వయంగా దొంగ ఓటర్లను పట్టుకుని అధికారులకు అప్పగించారు. ఈ పరిణామాలతో వైసీపీ నేతలు వరుసబెట్టి ప్రెస్ మీట్లు నిర్వహించి దొంగ ఓట్ల వార్తలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తిరుపతి పుణ్యక్షేత్రం కాబట్టి బస్సుల్లో ఎంతో మంది వస్తారని, వాళ్లను దొంగఓట్లు వేయడానికి వచ్చినవాళ్లుగా ఎలా పరిగణిస్తారని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తిరుపతిలో వైసీపీ గెలుపు ఖాయమని ప్రతిపక్షాలకు కూడా తెలుసు అని, అందుకే డిపాజిట్లు కాపాడుకునేందుకు దొంగఓట్లు వేయించేందుకు బీజేపీ, టీడీపీ ప్రయత్నించాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. దొంగఓట్లు వేయించాల్సిన ఖర్మ తమకు పట్టలేదని స్పష్టం చేశారు.

YouTube video

అటు డీజీపీ గౌతమ్ సవాంగ్ తిరుపతి ఉపఎన్నిక సరళి గురించి మాట్లాడుతూ.. దొంగఓట్లు ఎక్కడా పడకుండా తాము చర్యలు తీసుకున్నామని, సుమారు 250 వాహనాలను తిరుపతి రాకుండా వెనక్కి పంపామని ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో అధికార పక్షం వైసీపీ డిఫెన్సులో పడిందని సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు రచ్చ మొదలుపెట్టాయి. సదరు వాహనాల్లో వచ్చేది నిజంగా ప్రయాణికులే అయితే ఆ వాహనాలను పోలీసులు వెనక్కి పంపాల్సిన అవసరం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదేమైనా తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారం ఏ పార్టీకి కలిసివస్తుందో మరికొన్నిరోజుల్లో తేలిపోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement