Wednesday, May 1, 2024

Exclusive – పోదాం ప… ఓటేద్దాం

3,17,17,389 ఓట‌ర్లు
1,58,71,493 మ‌గాళ్లు..
1,58,43,499 ఆడాళ్లు
2557 ట్రాన్స్‌జెండ‌ర్లు
వీరిలో 45శాతం నిరుపేదలు. 35 శాతం మధ్యతరగతి. 10 శాతం విద్యాధికులు. ఇంకో 10 శాతం సంపన్న వ‌ర్గ‌పు ఓటర్లున్నారు.

ప్రభుత్వ దశ, దిశను నిర్దేశించే శక్తి ఇక్కడి ప్రజలదే. ప్రజల కోసం, ప్రజలతో ప్రజలే తమ ఆలనా పాలనను నిర్ణయించే అధికారం.. నూటికి నూరుశాతం.. భారత ప్రజలదే. ప్రపంచంలో చక్రవర్తులు పోయారు. నియంతల శక్తి నీరుగారింది. కేవలం కొన్ని దేశాల మినహా.. అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ.. ఇలా అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. కానీ, ఇంకా భారత్‌లో ఆ పరిణితి క‌నిపించ‌డం లేదు. తమ నిర్ణయాన్ని తాము ప్రకటించే భావస్వేచ్ఛ, నిర్ణయాధికార స్వేచ్ఛ .. మంచి, చెడును బేరీజు వేసి.. తమ ఉజ్వల భవితను తీర్చిదిద్దుకునే ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ మ‌న‌దే. అధికారం చేతిలో ఉన్నా.. చూపుడు వేలుతో.. అది నీ కుర్చీ అని న్యాయ నిర్ణేతగా తీర్పును ఇచ్చే గొప్ప శక్తి ఓటు మాత్ర‌మే ఉంది. కానీ, ఓటు హ‌క్కు ఉన్న చాలామందిలో నిర్ల‌క్ష్యం క‌నిపిస్తోంది. మ‌నం మార‌కుండా స‌మాజం మారాల‌ని అనుకోవ‌డం చాలా పెద్ద పొర‌పాటు… ఆ చాన్స్ మ‌న చేతిలో ఉన్న‌ప్పుడు ఎందుకు వ‌దులుకోవాలి. సత్తాను ప్రదర్శించే అవ‌కాశాన్ని వినియోగించుకుందాం.. సిటీ, ప‌ట్నం అనే తేడా లేకుండా పోదాం ప‌!.. ఓటేద్దాం!

అధికార దాహం ఎన్నో ఎత్తులు, జిత్తులతో ఓటర్లను ఏమార్చేస్తుంటే.. కళ్ల ముందే జరిగే సామూహిక అత్యా,చారంతో ప్రజాస్వామ్యం కుమిలిపోతోంది. పొగిలి పొగిలి కన్నీళ్లు పెడుతోంది. అప్పట్లో చదువు లేదు. జమీందార్లు, పెత్తదార్ల స్వామ్యంలో పేద బిక్కి కల్లు దుకాణాల్లో నిద్ద‌రోతే.. మధ్యతరగతి మంచాలపై పడుకుని ఇళ్ల గడప దాటలేదు. అధికారం కోరుకునే వర్గాలే ఓటు హక్కును వినియోగించుకున్నాయి. బలమున్న చోట ఓట్ల లూటీలు జ‌రిగాయి. ఇప్పుడ‌యితే అంద‌రిలో రాజకీయ చైతన్యం వ‌చ్చింది. గడచిన 40 ఏళ్లల్లో కుల స్వామ్యం కదం తొక్కుతోంది. మత సామ్య చిచ్చు ఓట్లను భస్మీపటలం చేస్తోంది. ఇక ధనస్వామ్యం అధికార పగ్గాల కోసం ఉర్రూతలూగుతోంది. అప్పట్లో పట్వారీలు ఓట్లాటలో రాజకీయ మంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తే.. ఈ ఆధునిక కాలంలో కార్పొరేట్ శక్తులే అధికార‌ నిర్ణేతలుగా మారాయంటే అతిశయోక్తి కాదు. మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే.. మనం ఏం చేయాలి,? ఏం చేయకూడదు?

సమాధానం లేని ప్రశ్నలు
మా నీళ్లు మావి. మా కష్టాలు, సుఖాలు మావి. మా హక్కులు మావి. మా ప్రభుత్వం మాది, మా పాలన మాది.. నడుమ మీరెవరు? అని నినదించి, పోరాడి, బలిదానంతో జనం సాధించుకున్న తెలంగాణలో.. మూడోసారి ఎన్నికలు తారా స్థాయికి చేరుకున్నాయి. అధికారం కోసం రాజకీయ పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో రగిలిపోతున్నాయి, ఒకరిది సంక్షేమం, అభివృద్ధి మంత్రం, మరొకరిది కులం, మతం తంత్రం, ఇంకొకరిది అవినీతి, అక్రమాల అస్త్రాలతో పోరాటం.. వీరితోపాటు ప్రతి రాజకీయ పార్టీలో తిరుగుబాటు సైనికుల రణభేరీ. వీటిలో ఏ పార్టీకి తలూపాలి?. ఏ అభ్యర్థికి ఓటెయ్యాలి? ఇదీ సగటు ఓటరును వేధిస్తున్న సమాధానం లేని ప్రశ్న.

ఎన్నాళ్లీ దొంగాట?
అధికార మిచ్చే ప్రజల మదిని కొల్లగొట్టటంలో రాజకీయ పార్టీల అస్త్ర‌, శస్త్రాలకు తిరుగులేదు. ఓటు కోసం గుడిసె ముందు వంగి వంగి దండం పెట్టే బడాబాబులు.. తమ శిబిరాల్లో సూటు కేసులతో తిష్ట వేయటం ఒక ఎత్తు. కూలీ నాలీ జనాన్ని నోట్లతో.. వ్యానుల్లో కుక్కి ప్రచారాల‌కు తమ జనబలాన్ని నిరూపించటం మరో ఎత్తుగడ. ఇలా వచ్చినోళ్లను మందు, బిర్యానీ వంటి విందుల‌తో ప్రచారకాలంలో బందీలు చేయటం తిరుగులేని ఎత్తుగడ. కానీ, పోలింగ్‌కు ఇంకా స‌రిగ్గా మూడు రోజుల ముందే ఇంటికి నోట్ల పంపిణీ, పోటీలో ఉండి, గెలుస్తామనే ధీమాలోని అన్ని పార్టీలు నోట్లు పంచితే.. భర్త ఒకరికి, భార్య మరొకరికి ఓటు వేసే స్థితి ఎన్నాళ్లు? అసలు ఓటు అమ్ముకోటం భావ్యమా? ఇదే భవిష్యత్తును దెబ్బ తీస్తోంది. ఊళ్లో సమస్యలు ఊళ్లోనే పేరుకుపోతున్నాయి. ఊళ్లో తాగునీరు లేక పోయినా, రోడ్డు లేకపోయినా, ఆసుపత్రిలో డాక్టర్లు లేకపోయినా, ఉన్నా మందులు ఇవ్వక పోయినా, రేషన్ బియ్యం గోల్మాల్ జరిగినా ప్రశ్నించే అధికారం లేనట్టే. అంతేకాకుండా పార్టీల లీడ‌ర్లు చివ‌రికి కులం, మతంతో మధ్య తరగతి జనం బుర్రలను తొలి చేయటంలో పోటీ ప‌డుతున్నారు. వారికి కానీ మ‌నం లొంగిపోతే వారి ఎత్తుగ‌డ‌లు స‌క్సెస్ అయిన‌ట్టే.. అందుకే ఆలోచించాలి.. మ‌నం ఎవ‌రికి ఓటెయ్యాలి. మ‌న‌కు మంచి ఎవ‌రు చేస్తున్నార‌నేది గ్ర‌హించాలి.

జనం మదిలో.. అసలు కథేందీ?
తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే.. 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,58,71,493 మంది మ‌గాళ్లు.. 1,58,43,499 మంది ఆడాళ్లున్నారు. 2557 మంది ట్రాన్స్‌జెండ‌ర్లు ఉన్నారు. వీరిలో 45శాతం నిరుపేదలు. 35 శాతం మధ్యతరగతి. 10 శాతం విద్యాధికులు. ఇంకో 10 శాతం సంపన్న వ‌ర్గ‌పు ఓటర్లున్నారు. వీరిలో ఓటేసేది 60 నుంచి 75 శాతం లోపు ఓటర్లే. అంటే.. 2018 ఎన్నికల్లో పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. 2,80,64, 680 మంది ఓటర్లలో 73.74 శాతం మంది పోలింగ్ స్టేషన్ల్లలో క్యూకట్టి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్లలో 73,74,129 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఓటు వినియోగించుకున్న వాళ్లల్లో ఆడాళ్లు, వృద్ధులు నిరుపేదలే ఎక్కువ మంది ఉన్నారు. కారణం సంక్షేమ పథకాల ఫలితం. ఈ సారి ఓటు వేయక పోతే మళ్లీ పెన్షన్లు రాదేమోననే భయం, ఇళ్లు ఇవ్వరేమో అన్న భయం. ప్రతిపక్ష పార్టీలను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు సుమారు 59 లక్షలు, బీజేపీకి 15 లక్షలు, ఎంఐఎంకి 6 లక్షలు, ఇతర పార్టీలన్నింటికీ 22 లక్షల మంది ఓటేశారు.

- Advertisement -

సాప్ట్ బాబులకు ఏమైందస‌లు?
ఓటు హక్కుకు దూరమైన వారిలో.. ఓటు హక్కు వినియోగించుకోవటానికి అసలు ఇష్టం లేని వారిలో విద్యాధికులు, ప్రైవేటు ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా ప్రజాస్వామ్యం గురించి తెలీనోళ్లు కాదు. ఓటు హక్కుతో పాలకులను తీర్చిదద్దే అవకాశం ఉన్నోళ్లే. పోలింగ్ రోజున అన్ని సంస్థలు సెలవు ప్రకటిస్తే… ఈ విద్యాధికుల్లో అత్యధికులు కాలక్షేప బఠాణీలకు, పల్లీలకు లొంగే ధీరులే అవుతున్నారు. ఎన్నికలకు మూడు రోజుల ముందే బాటిల్స్ సమకూర్చుకుని, టీవీల్లో బిగ్ బాస్, మ‌సాలా సాంగ్స్, నెట్‌ఫ్లిక్స్‌, ఫ్రైమ్ వీడియోలో సీక్వెల్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా చేయటానికి సెలవును వాడేయటం అలవాటు చేసుకోబట్టే పోలింగ్ తగ్గిపోతోంద‌న్నది అస‌లు వాస్త‌వం.

ఊరికి వెళ్లినా ఓటు వేయ‌ట్లేదు..
హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ బాబుల‌ ఆలోచనా ధొరణి మరీ మారిపోయింది. రోజూ పనిలో ఇన్‌పుట్‌, అవుట్ పుట్ ఒత్తిడి.. ఇక‌.. శని, ఆదివారాలు వీక్లీ ఎండ్ పేరిట‌ హంగామాలతో ఎంజాయ్ చేయటం కామ‌న్ అయిపోయింది. కానీ, పోలింగ్ రోజును మరీ ప్రత్యేకంగా భావించి… ఇంట్లో ఎంజాయ్ చేయటం కూడా మరీ విడ్డూరం. వాస్తవానికి హైదరాబాద్ సిటీలో 10 లక్షల మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుంటే.. వీరిలో 3 లక్షల మంది దాకా ఓట‌ర్లున్న‌ట్టు అంచ‌నా. వీరిలో లక్ష ఓట్లు తెలంగాణలోని తమ సొంతూళ్లల్లో ఓట్లు ఉంటే.. దొరికిందే చాన్స్‌గా భావించి, మరో రెండు రోజులు సెలవు పెట్టి ఓ 20 వేల మంది ఊళ్లకు వెళ్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే వెళ్లిన వాళ్లంతా ఓటు వేస్తున్నారా? అంటే ఏమో.. చెప్ప‌లేం అన్న‌ట్టు త‌యారైంది ప‌రిస్థితి. ఇలా ఎంత కాలం? చదువుకున్న మారాజులు ఓటును వృథా చేస్తారు? కానీ, ఇంట్లో కరెంటు పోతే.. టీవి ఆగిపోతే ఆఫీసర్లను తిట్టిన తిట్టు తిట్టకుండా ఇంగ్లిష్‌లో ఫ‌.. అంటూ తిట్టిపోస్తారు. ఇక ట్రాఫిక్ ఆగిపోతే.. త్వరగా ఆఫీసుకు వెళ్లలేక పోతున్నామనో, ఇంటికి చేరలేక పోతున్నామోనని అల్లాడిపోతుంటారు. చుట్టు పక్కల పేదోళ్ల బస్తీల్లో దోమల మోత, మురుగు కంపు, అనారోగ్యం వీరికి తెలీదు. ఇదంతా పాలకుల నిర్లక్ష్యం అనుకోరు. అందుకే ఓటంటే ఈ బడా బాబులకు పట్టింపు ఉండదు.

యువత మేలుకోవాలే..
యువతే దేశ భావి నిర్మాతలు. ఇంట్లో సమస్య నీదే. చదువు, ఆరోగ్యం, ఉపాధి లేని కుటుంబం అధోగతి పాలు, సంక్షేమం అంటే అవసరమే. కానీ ఉచిత పథకాలే ఊరింతలు. మనో నిర్ణయాన్ని బందీ చేసే కుయుక్తుల్ని అడ్డుకోవాల్సిందే. యువత పోరాటం లేనిదే తెలంగాణ ఆవిష్కరణ జరగలేదు. రాష్ట్రంలో 1.60 కోట్ల మంది 18 నుంచి 39 ఏళ్లలోపు యువజనం ఉన్నారు. వీళ్లల్లో 13.44 లక్షల మంది 18 ఏళ్ల యువతరం ఓటర్లున్నారు. యువశక్తికి గుర్తించే రాజకీయ పార్టీలు గేలం వేస్తున్నాయి. కులం, మతం, ధనం.. ఇవే కాదు.. బలహీనతలనూ సొమ్ము చేసుకునే కుతంత్రాలు పన్పుతున్నాయి. హీరో ఇమేజీ, దేశభక్తి, క్రికెట్టుతో అభిమానాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ర్యాలీకి వెళ్తే బైక్ సవారీ, బీర్ల సందడితో లొంగదీసుకుంటున్నాయి. కానీ.. ఒక్కసారి ఆలోచించండి. కాలేజీలో ఫీజు కట్టటానికి అమ్మానాన్న పడుతున్న బాధను గుర్తించండి. అప్బుల గోస గుర్తించండి. బస్తీలో జనం గోస తెలుసుకోండి. సర్కారు బడుల స్థితి ఏంటీ? ఆసుపత్రిలో డాక్టర్లు ఉన్నారా? లేరా? మందులు ఉన్నాయా? లేవా? ఎన్నాళ్లు ఆర్ఎంపీల ముందు సాగిల పడాలి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి కన్నుమూసిన దోస్తుల‌ కథ యాది చేసుకోండి? జనం బాధలంటే.. మనమూ జనమే.. జనంలో మనం పడే బాధలకు స్పందించండి. ఏ పార్టీతో మంచి ప్రభుత్వం వస్తుందో. కాస్త ఆలోచించండి. ఓటు వేయటానికి ముందుకు రండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement