Thursday, May 2, 2024

Exclusive – కాంగ్రెస్ లో టిక్కెట్స్ మార‌థాన్ … అభ్యర్ధిత్వాన్ని ప‌రిశీలించండంటూ నేత‌లు మొర

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అసెంబ్లి ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండగానే.. ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కాంగ్రెస్‌ నాయకులు గాంధీభవన్‌కు ఇప్పటి నుంచే క్యూ కడుతున్నారు. తమ అభ్యర్థిత్వాలను పరిశీలించి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలని పెద్దలను కలిసి వినతులు, విజ్ఞప్తులు చేసుకుని దండాలు పెట్టుకుంటున్నారు. పార్టీకి చేస్తున్న సేవలతో కూడిన బయోడేటాలను పట్టుకుని గాంధీభవన్‌ చుట్టు నిత్యం చెక్కర్లు కొడుతున్నారు. సర్వేల ప్రకారమే టికెట్లు కేటాయిస్తామని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే పలుమార్లు చెప్పినా.. ఆశావ హలు అవేమి పట్టించుకోకుండానే బయోడేటాలు పట్టుకుని పార్టీ పెద్దల చుట్టు తిరుగుతున్నారు. తమ వ్యక్తిగత బయోడేటాతో పాటు ఏళ్లతరబడి పార్టీకి చేసిన సేవలు, స్వచ్ఛంద కార్యక్రమాలకు సంబంధించిన జాబితా లను పార్టీ పెద్దలకు అందజేస్తున్నారు. పార్టీ కోసం చేసిన కార్యక్రమాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, పేపర్‌ కటింగ్స్‌ను కూడా తమ బయోడేటాకు జతపరుస్తున్నారు. ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్‌, వ్యా పారాలు, ఆర్థిక మూలాలతో పాటు టికెట్‌ ఇస్తే ప్రత్యర్థి పార్టీ కంటే ఎక్కు వగానే ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా పార్టీ నాయకులకు సంకే తాలు ఇస్తున్నారు. ప్రత్యర్థి బలం, బలహీనతలు కూడా వివరిస్తున్నారు.

గాంధీభవన్‌లో సమావేశాలు జరిగితే చాలు..
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో టికెట్లు దక్కించుకని బరిలో ఉండాలని చాలామంది నాయకులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా కొందరు ఆశావాహులు టికెట్ల వేటలో పడ్డారు. కొందరు నాయకులు గాంధీభవన్‌ చుట్టు తిరుగు తుండగా.. మరి కొందరు లీడర్లు మాత్రం తమ బయోడేటాలను పట్టు కుని వారి గాడ్‌ఫాదర్ల ఇళ్ల చుట్టు చక్కర్లు కొడుతున్నారు. గాంధీభవన్‌లో సమావేశాలు జరిగితే చాలు.. జిల్లాలు, నియోజక వర్గాలకు చెందిన నాయకులు వందల సంఖ్యలో వాలిపోతున్నారు. నియోజక వర్గాలకు చెందిన నాయకులు, పీసీసీ, ఏఐసీసీ నాయకులతో పాటు కొందరు సీనియర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే నుంచి పీసీసీ కార్యవర్గ సభ్యుడి వరకు అంద రిని కలుస్తున్నారు. ఐదారు రోజుల క్రితంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ గాంధీభవన్‌ రావడంతో ఆశావాహుల తాకిడి విపరీతంగా పెరిగింది. కేసీ వేణుగోపాల్‌ దృష్టిలో పడేందుకు కొందరు తమ ప్రయ త్నాలు చేసుకున్నారని గాంధీభవన్‌ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.

పార్టీలో మేం మొదటి నుంచి పని చేస్తున్నాం..
అయితే పార్టీలో మొదటి నుంచి పని చేసుకుంటూ.. డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్న వారిలోనూ వందల సంఖ్యలో ఉన్నారు. పార్టీ కోసం పని చేసుకుంటూ వెళ్లితే ఎప్పుడో ఒకసారి అదృష్టం తట్టకపోతదా..? అనుకునే వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. వచ్చే అసెంబ్లిd ఎన్నికల్లో కచ్చితంగా టికెట్‌ తెచ్చుకుని బరిలో నిలవాలని భావిస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఇటీవల పార్టీలోకి కొత్తవారు వస్తుండ టంతో.. పాత వారిలో టికెట్‌ వస్తుందా..? రాదా అనే టెన్షన్‌ పెరుగుతోంది. భవిష్యత్‌లో మరిన్ని చేరికలుంటాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని మెజార్టీ అసెంబ్లిd నియోజక వర్గాల్లో సొంత పార్టీ నాయ కుల మధ్యనే తీవ్ర అసంతృప్తి పెరుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది. కొత్తవారికి ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందని, మొదటి నుంచి పని చేసిన వారికి గుర్తింపు ఇస్తే కేడర్‌ కూడా కలిసికట్టుగా పని చేస్తుందనే వాదనలను కూడా పీసీసీ నాయకత్వం వద్ద వినిపిస్తున్నారు. మరి కొందరు మాత్రం టికెట్‌ రేసులో ఉంటే.. టికెట్‌ రాకున్న పార్టీ అధికారంలోకి వచ్చాక నామినెటెడ్‌ పదవిపైనా హామీ పొందడానికి అవకాశం ఉంటుందనే వారు కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోంది.

ఐదు నుంచి పది మంది వరకు పోటీ..
30 నుంచి 40 నియోజక వర్గాలు మినహాస్తే.. మిగతా వాటిలో ఒక్కో నియోజక వర్గం నుంచి ఐదు నుంచి 10 మంది వరకు ఆశావాహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. సీనియారిటీ, సర్వేతోపాటు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని టికెట్లు ఇస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికి ఒక్కో నియోజక వర్గం నుంచి పదుల సంఖ్యలో నాయకులు వచ్చి ఏఐసీసీ, పీసీసీతో ఇతర సీనియర్లకు దరఖాస్తులు ఇస్తున్నారని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. దరఖాస్తులన్నింటికి తీసుకుంటున్నామని, పార్టీ అధిష్టానం అన్ని కోణాల నుంచి ఆలోచన చేయడంతో పాటు సర్వేలను క్రోడీకరించి ఫైనల్‌ నిర్ణయం తీసుకుంటుం దని పీసీసీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. మెరుగైన ఫలితం ఎవరైతే ఇస్తారో.. వారికి పార్టీ టికెట్‌ ఇచ్చే ఆలోచన చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మరో నాయకుడు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement