Friday, May 3, 2024

ఇంగ్లీష్ ప్ర‌శ్నా ప‌త్రం లీక్ – 24జిల్లాల్లో ప‌రీక్ష ర‌ద్దు

12వ త‌ర‌గ‌తి బోర్డు ఇంగ్లీష్ ప్ర‌శ్నా ప‌త్రం లీక్ అయింది. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. దీంతో అధికారులు రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 12వ తరగతి ఇంగ్లీషుకు ఉత్తరప్రదేశ్ బోర్డు పరీక్షను రద్దు చేశారు. రాష్ట్రంలోని ఆగ్రా, మధుర, అలీగఢ్, గోరఖ్‌పూర్ సహా 24 జిల్లాల్లో పరీక్షను రద్దు చేసినట్లు యూపీ మాధ్యమిక శిక్షా పరిషత్ డైరెక్టర్ వినయ్ కుమార్ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన 51 జిల్లాల్లో నిర్ణీత సమయానికి పరీక్ష జరుగుతుంద‌ని చెప్పారు. ప్రశ్నా పత్రం బహిర్గతం కావడంపై సందేహాలు ఉన్నందున ఇంగ్లీష్ పరీక్షను రద్దు చేస్తున్నాం. 24 జిల్లాలలో అదే ప్ర‌శ్నాప‌త్రం పంపిణీ చేశారు. అందువ‌ల్ల అక్కడ పరీక్షను రద్దు చేశారు. ఈ ప‌రీక్ష రెండో షిప్ట్ లో జ‌ర‌గాల్సి ఉంది. మిగిలిన జిల్లాలో యథావిధిగా పరీక్ష జరుగుతుంది” అని ప్రకటన విడుద‌ల చేశారు. బల్లియా జిల్లాలో పేపర్ లీక్ అయిందని ఆ ప్రకటన పేర్కొంది. దీంతో ఈ ప్ర‌శ్నాప‌త్రం చేరిన జిల్లాలో తప్పా.. మిగిలిన అన్ని జిల్లాల్లో షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. పరీక్ష రద్దయిన 24 జిల్లాల్లో పరీక్ష నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్రకటనలో తెలిపారు. ఈ ప్ర‌శ్నాప‌త్రం మార్కెట్ లో రూ.500 కు ల‌భించిన‌ట్టు తెలుస్తోంది. లీక్ అయిన పేపర్లను 316Ed మరియు 316EiK సిరీస్‌లుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement