Saturday, May 4, 2024

Election Josh – అసెంబ్లీ సీటు య‌మ హాటు – త్రిముఖ వ్యూహం .. టిక్కెట్ గాలం

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో తెలంగాణ రాజకీయాలు రోజుకో రకంగా మలుపులు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షమన్న తేడాల్లేకుండా అన్ని పార్టీలకూ సెగ తగులుతోంది. త్రిముఖ వ్యూహంలో అవకాశాలు అనేకం.. అన్న కోణంలో తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి ఆలోచనలను మార్చుకుంటున్న నాయకులు గోడదూకు డుకు సిద్ధపడుతున్నారు. అవకాశాలు సన్నగిల్లుతున్న కొన్ని నియోజకవర్గాల్లో నిత్యం అదే పనిగా సంప్రదింపులు, సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు కూడా ఈ విషయంలో మినహాయింపు లేకుండా పోతోంది. మొన్నటి వరకూ రాజకీయ శత్రువును అధికారం నుంచి దింపడమే తమ లక్ష్యమని ప్రకటించిన కాంగ్రెస్‌, భాజపాలు ప్రస్తుతం టిక్కెట్ల కేటాయింపు చదరంగంలో చిక్కుకున్నాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో:

సొంత పార్టీ నేతల నుంచే అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదురవుతుందడంతో అగ్రనేతలంతా అయోమయంలో పడుతున్నారు. టిక్కెట్లిస్తామంటే.. పార్టీ ఏదైనా గోడ దూకుడుకు నేతలు సై అంటున్నారు. అధిష్టానం తప్పిదాలు తమను నిరాశ, నిస్పృహల్లోకి నెడుతున్నాయని బాహాటంగానే ప్రకటిస్తున్న భాజపా నేతలు క్రమక్రమంగా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల సందిగ్ధం నుంచి నేటికీ భయటపడని సిట్టింగులు సైతం దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో సామాజిక కోణం.. టిక్కెట్ల కోసం కొత్త లొల్లికి దారితీస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర కులాలకు చెందిన నాయకులు తమతమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజా పరిణామాలతో కమలం గ్రాఫ్‌ కొంత పడిపోయినా పోటీకి ఆశావహుల్లో క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. గెలిచినా, ఓడినా తామూ పోటీ చేస్తామని అధిష్టానం వద్దకు అనేకమంది నేతలు క్యూ కడుతున్నారు. పార్లమెంట్‌ స్థానాల్లోనూ పోటీకి ఇదే తరహా రాజకీయం జరుగుతోంది. అయితే, అసెంబ్లి.. లేదంటే పార్లమెంట్‌.. ఆశావహుల ప్రధానమైన డిమాండ్‌ ఇది.

అధినేతలో ధీమా.. ఆశావహుల్లో ఆందోళన!
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది ఎస్టీ, 18 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వీరిలో 45శాతం మంది ఎమ్మెల్యేలను మార్చాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు- తెలుస్తోంది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడంతోపాటు-, రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని కొంతమందికి ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు- ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌ వద్ద ఉన్న జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో.. తెలియక మెజారిటీ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లు -టెన్షన్‌ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో కొన్ని పుకార్లు పార్టీ నేతలను, సిట్టింగులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచే కేసీఆర్‌ టికెట్ల కోత మొదలు పెడతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీగా మార్పులు చోటు-చేసుకుంటాయని అంతా అనుకుంటున్నారు. సీఎం సొంత జిల్లాలోనూ పలువురి పేర్లు ఆ జాబితాలో ఉన్నట్టు- సమాచారం అందుతోంది. మొత్తంగా ఆ లిస్టులో బహుజన నేతలే అధికంగా ఉన్నారని, 6 నుంచి 7 మందికి నో టికెట్‌.. అన్న వార్తలు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఊపందుకున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో 36 మంది ఉన్నారు. వీరిలో ఆరేడు మందిని ఈ సారి తప్పిస్తారని తెలుస్తోంది. కొందరిపై అవినీతి ఆరోపణలు ఉండటం ప్రధాన కారణమని సమాచారం. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఆరోగ్యం సహకరించక పోవడంతో వారి స్థానాల్లో కొత్త వారిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో కేసీఆర్‌ ఉన్నట్టు- పార్టీ వర్గాలే వెల్లడిస్తున్నాయి.

ఉమ్మడి వరంగల్‌ నుంచే ప్రక్షాళన?
పార్టీ అధినేత కేసీఆర్‌ చేతిలో ఉన్న జాబితాలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నట్టు- తెలుస్తోంది. అక్కడి నుంచి అత్యధిక మందికి ఈసారి టికెట్లు- దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలోని ఎస్టీ ఎమ్మెల్యేలపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వారికి తిరిగి టికెట్లు- కట్టబెడితే ఓటమి ఖాయమని సీఎం సర్వేలో తేలినట్టు- పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పది మంది బీసీ ఎమ్మెల్యేలను మార్చాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు- తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఈసారి వారిని పక్కన పెట్టి, ఎమ్మెల్సీ పదవులు ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఇద్దరు బీసీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో వారిని కొనసాగించడమా? లేక కొత్త వారికి అవకాశం ఇవ్వడమా? అనే అంశంపై కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు.

కాంగ్రెస్‌ ముందరి కాళ్ళకు ‘సామాజిక’ బంధం
ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి బీసీ నేతలు తమకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని తాము కోరుకుంటు-న్న సీట్ల జాబితాను నేతలు పార్టీ నాయకత్వానికి అందించారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో మూడు నుండి ఐదు అసెంబ్లీ సీట్లు- ఇవ్వాలని కోరుతున్నారు. తాము ఆశిస్తున్న సీట్ల జాబితాను కూడ పార్టీ అధినాయకత్వానికి సమర్పించారు. మాజీ పీసీసీ చీఫ్‌ నేతృత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు తాజాగా సమావేశమయ్యారు. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయనున్నట్టు-గా రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని పార్టీలోని ఆ సామాజిక వర్గం నేతలు గుర్తు చేస్తున్నారు. కనీసం 35 నుండి 50 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీసీ నేతలు కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టు-దలతో కాంగ్రెస్‌ నాయకత్వం ఉంది. ఈ దిశగా ఆ పార్టీ నాయకత్వం వ్యూహారచన చేస్తుంది. ఈ తరుణంలో బీసీ నేతలకు పార్టీ టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఆ సామాజికవర్గాలకు చెందిన ఓటర్లు గెలుపు ఓటములను ప్రభావితం చెెసే ప్రమాదం పొంచి ఉంది.

- Advertisement -

టిక్కెట్ల అయోమయంలో బీజేపీ కేడర్‌
బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఈటల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలను ప్రభావితం చేసేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ విధానం తరతరాలుగా పార్టీలో ఉన్న అనేక మందికి గిట్టడం లేదు. బీజేపీలోకి తీసుకురావడం తర్వాత.. ముందు మాకు ప్రాధాన్యత తగ్గితే పార్టీ నుంచి వెళ్ళిపోతాం.. అన్న హెచ్చరికలు సొంతపార్టీ నేతల నుంచే వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించడంలో ఈటల కీలక భూమిక పోషిస్తారని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో ఈటల రాజేందర్‌కు కీలకమైన వ్యక్తిగా చూస్తూ ఆయనపైనే బీజేపీ ఎన్నో ఆశలు పెట్టు-కుంది. పార్టీని బలోపేతం చేయడానికి దోహదం చేస్తాడని, కీలక నాయకులను బీజేపీలోకి తీసుకువస్తాడని భావించింది. అయితే ఈటల రాజేందర్‌ మాత్రం బీజేపీ ఆశించిన మేరకు ఏమీ చేయలేకపోయారరని తాజాగా ఆరోపణలు వినవస్తున్నాయి.

అసలు బీజేపీలో ఏం జరుగుతోంది అన్నది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇతర పార్టీల్లో ఉన్న కీలక నాయకులను బీజేపీలోకి తీసుకురావడానికి ఈటల రాజేందర్‌ అనేకమంది నాయకులతో చర్చలు జరిపారు. అసలు విషయం ఏమిటంటే పార్టీలో చేరేందుకు సంప్రదిస్తున్న వారంతా టిక్కెట్లు ఆశిస్తున్నారు. అందుకు ఏ నాయకుడూ స్పష్టమైన హామీ ఇవ్వలేని పరిస్థితి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టు-కుని, పార్టీ మారాలని భావిస్తున్న ఆశావహులు టికెట్‌ హామీ ఇస్తేనే వారు బీజేపీ బాట పట్టే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. అంతేకాదు బీజేపీలో టికెట్ల విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయంగా ఉంటు-ంది. ఇక ఈ సమయంలో టికెట్లు- హామీ ఇవ్వడం ఖచ్చితంగా సాధ్యం కాదని తేలిపోయింది. ఈ పరిస్థితులు పార్టీని దెబ్బతీసేందుకు ప్రధాన కారణమవుతున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement