Monday, April 29, 2024

Who is Congress Chief : అక్టోబర్​ 17న ఎన్నిక, 19న కౌంటింగ్.. ఏఐసీసీ భేటీలో నిర్ణయం!

కాంగ్రెస్​ నుంచి సీనియర్లు​ ఒక్కొక్కరు జారుకుంటున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంతో నేతలు దృష్టి సారించారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆదివారం నిర్ణయించింది. దీనికి అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన తుది షెడ్యూల్‌పై చర్చించేందుకు ఇవ్వాల (ఆదివారం) కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరుగుతోంది.

పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వర్చువల్ మీటింగ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ మీటింగ్​కి మరింత ఇంపార్టెన్స్​ దక్కింది.

అయితే.. అధ్యక్షుడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ విముఖత చూపడంతో ఇప్పుడు ఆ పదవికి ఎన్నిక అనేది కాంగ్రెస్‌కు సవాలుగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల అథారిటీ సన్నాహాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేనందున ఆయనను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని కొంతమంది లీడర్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7వ తేదీనుంచి కన్యాకుమారి నుంచి ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తోంది. 148 రోజుల పాటు సాగే పాదయాత్ర చివరికి కాశ్మీర్‌లో ముగుస్తుంది.

ఐదు నెలలపాటు ఈ యాత్ర కొనసాగనుంది. దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం, 12 కంటే ఎక్కువ రాష్ట్రాలను కవర్ చేయడానికి ఈ యాత్రను ప్లాన్​ చేశారు. ఈ యాత్ర ప్రతిరోజూ 25 కిలోమీటర్లు ఉండేలా పార్టీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక.. ఈ యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. దీనికి పాదయాత్రలు, ర్యాలీలు, బహిరంగ సభలు ఉంటాయని కొంతమంది పార్టీ లీడర్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement