Wednesday, May 1, 2024

పారదర్శకమైన సేవల కోసమే ధరణి పోర్టల్‌.. భూమితో రైతుకు ఎమోషనల్‌ బాండింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భూ క్రయవిక్రయ వ్యవహారాల్లో ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు రైతులకు తొలగాలన్న ఉద్దేశంతోనే ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రెవెన్యూశాఖ పద్దుపై చర్చ సందర్భంగా ప్రసంగించారు. పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పారు. రెవెన్యూ శాఖ ద్వారా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ, కళ్యాణ లక్ష్మీ , డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌, మీ సేవ ద్వారా 72 రకాల సేవలు అందిస్తున్నామన్నారు. గతంలో భూ క్రయవిక్రయాలు తెలంగాణ పల్లెల్లో తెల్ల కాగితాల మీద సాదాబైనమా మీద జరిగేదని..ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ఆ్లనన్‌ ప్రక్రియ చేపట్టి క్రమబద్దీకరించారని చెప్పారు. ఇప్పటి వరకు 13 లక్షల సాదాబైనామాలను ప్రభుత్వం క్లియర్‌ చేసిందని తెలిపారు.

భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారం లభించిందన్నారు. 2కోట్ల 48 లక్షల భూమి రికార్డుల ప్రక్షాళన జరిగిందని, కొత్త పాస్‌బుక్‌లు కూడా అందించినట్లు తెలిపారు. 1కోటి 52వేల ఎకరాల అప్లికేషన్లు పరిష్కరించామని, 66 లక్షల మంది రైతులకు కొత్త ధరణి పాస్‌ బుక్‌ లు వచ్చాయని తెలిపారు. ఆ వివరాల ఆధారంగానే రైతుబంధు అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో భూమి రిజిస్ట్రేషన్‌ కోసం ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండేవని, ధరణి రాకతో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత భూమి క్రయవిక్రయాల్లో మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయిన 15 నిమిషాల్లోనే ఈ పాస్‌బుక్‌ ఇస్తున్నామని తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్‌ కోసం తహసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన మంత్రి స్వీయ అనుభవాన్ని సభకు వివరించారు. గతంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిగా ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని,నేడు అట్లాంటి ఇబ్బందులు లేవని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 18 లక్షల రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు జరిగితే 11 వేల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌ కు వరదలు వస్తే 8వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ లేఖ రాస్తే…కేంద్రం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదన్నారు. మంత్రి కేటీఆర్‌ కృషితో రాష్ట్రానికి వేలాది పరిశ్రమలు వస్తున్నాయని,త ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగిందన్నారు. రాష్ట్రంలో నోటరీ రిజిస్ట్రేషన్‌ పరిశీలనలో ఉన్నాయని, 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయి,17 కార్యాలయాల నిర్మాణం ఆన్‌ గోయింగ్‌ లో ఉన్నాయని చెప్పారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు మరింత మెరుగు పరుస్తామని తెలిపారు. ఫ్రీడమ్‌ ఫైటర్స్‌,ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ ల్యాండ్‌ సమస్యల విషయాలను వెంటనే సుమోటోగా స్వీకరించి పరిష్కరిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement