Wednesday, May 1, 2024

TS | ప్ర‌బ‌లుతున్న డెంగ్యూ జ్వ‌రాలు.. తెలంగాణ‌లో 3వేల కేసులు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విష జ్వరాలతోపాటు డెంగ్యూ ప్రమాదకరస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అయితే చాలా మంది అది సాధారణ విషజ్వరంగానే భావిస్తూ సాధారణ చికిత్సతో సరిపెడుతుండడంతో నాలుగైదు రోజుల తర్వాత జ్వరం తీవ్రత పెరిగి రోగి తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. రోజుల తరబడి తీవ్ర జ్వరంతో ఆసుపత్రులకు వెళుతుండడంతో డెంగ్యూగా నిర్దారిస్తున్న వైద్యులు రోగిని కాపాడేందుకుతీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో మూడు రోజులకు మించి విడవని జ్వరం ఉంటే సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దని రెనోవా ఆసుపత్రుల వైరాలజీ విభాగం వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో డెంగీ జ్వరం వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3వేల డెంగ్యూ కేసులు నమోదు కాగా అందులో సగానికి పైగా అంటే 1600 కేసుల దాకా ఒక్క హైదరాబాద్‌లో నమోదైనవే. ఆగస్టు నెల నుంచి రాష్ట్రంలో డెంగ్యూ ఉధృతి కొనసాగుతోంది. అంతకుముందుతో పోల్చుకుంటే ఒక్క ఆగస్టులో నెలలోనే డెంగ్యూ కేసులు పదిరెట్ల మేర అధికంగా పెరిగాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

డెంగీ దోమకాటు ద్వారా వ్యాపించే వైరల్‌ జ్వరం. డెంగీకి కారణమయ్యే ఈడిస్‌ ఈజిప్టు దోమ కుట్టిన నాలుగు నుంచి ఏడు రోజుల తరువాత డెంగీ లక్షణాలు కనిపిస్తుంటాయి. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్టిన దోమ మరొకరిని కుట్టినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. డెంగీకి కారణమయ్యే ఆడ ఈడిస్‌ ఈజిప్టు దోమ పగటిపూటనే కుడుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతుండటం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటు-ంది. ఈ కాలంలోనే డెంగ్యూ వేగంగా వ్యాప్తి చెందుతుంది.

- Advertisement -

ఇవీ డెంగ్యూ వ్యాధి లక్షణాలు…
హఠాత్తుగా జ్వరం రావడం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనకాల నుంచి నొప్పి , కళ్లు ఉబ్బి, ఎర్రబారడం, ఒళ్లు, కీళ్ల నొప్పులు, వాంతులు, వికారం, ఆకలి మందగించడం, శరీరంపై దద్దుర్లు ఉంటే డెెంగీ జ్వరంగా భావించాలి. ఈ లక్షణాలు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. చికిత్స తర్వాత జ్వరం తగ్గినా… డెంగ్యూ ఇన్ఫెక్షన్‌ చాలా మందిలో పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్‌ పునరావృతం అయ్యే వారిలో వ్యాధి ప్రభావం కాడా తీవ్రంగా ఉండొచ్చు. ఎందుకంటే డెంగ్యూ సోకినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య బాగా తగ్గిపోతుంది.

ప్లేట్‌లెట్స్‌ 50వేల కన్నా తక్కువకు పడిపోయి రోగి స్పృహలో లేకుంటే వెంటనే ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి ఉంటుంది. ప్లేట్‌లెట్స్‌ 50వేల కన్నా తక్కువకు పడిపోతే శరీరంలో రక్తస్రావం జరగడం, మెదడు పనితీరు మందగించి రోగి కోమాలోకి పోయే ప్రమాదం ఉంటుంది. డెంగ్యూ వ్యాధి ఎక్కువగా స్రీలు, పిల్లలు, పెద్ద వయసు వారికీ ప్రమాదం. గర్భిణులలో కొన్ని సార్లు గర్భస్రావం కూడా సంభవిస్తుంది. మధుమేహం, గుండె, కిడ్నీ వ్యాధులతో భాదపడుతున్న వారికీ మరింత ఇబ్బంది కలిగిస్తుంది.

పరిసరాల పరిశుభ్రతతోనే డెంగ్యూ వ్యాప్తికి చెక్ : డాక్ట‌ర్‌ పీ. నితిన్‌రెడ్డి, కన్సల్టెంట్‌ జనరల్‌ ఫిజిషన్‌
డెంగ్యూను నివారించడానికి ఎలాంటి టీ-కాలు లేవు. కాబట్టి దోమ కాటు-కు గురి కాకుండా ఉండటమే మార్గం. మూడు రోజులపైబడి జ్వరం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి, డెంగ్యూ నిర్ధారణా పరీక్షలు చేయించుకోవాలి. ప్రధానంగా ఇంటి సమీపంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి ట్యాంకుకు మూత వేయాలి. నీటి నిల్వ ఉంచుకునే కుండీలను కనీసం వారానికి ఒకసారి శుభ్రం చేసి ఆరనివ్వాలి. ఇంట్లో దోమలు తిరుగుతున్నట్లు- అనిపిస్తే వెంటనే దోమ తెరలను అమర్చుకోవాలి. వాటిని తరిమికొట్టే కొన్ని నివారణ మందులు వాడాలి. శరీరంలోని అన్ని భాగాలకు రక్షణ కలిగే విధంగా దుస్తులు ధరించాలి. పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు- దుస్తులు వేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement