Friday, April 26, 2024

తెలంగాణ పోలీసుల తీరుపై ఢిల్లీ కాప్స్‌ సీరియస్.. అది క‌రెక్ట్ కాద‌ని లేఖ‌..

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం నుండి నాలుగు రోజుల క్రితం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సీరియ‌స్ అవుతున్నారు. ఈ విష‌యం మీద తెలంగాణ పోలీసుల‌కు లేఖ రాయనున్న‌ట్టు తెలుస్తోంది. తమ నాయకుడి నివాసం నుంచి నలుగురు వ్యక్తులు కిడ్నాప్ అయినట్లు నాలుగు రోజుల క్రితం ఢిల్లీ సౌత్ అవెన్యూ పోలీసులకు జితేందర్ రెడ్డి పీఏ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు అనుమానిత వ్యక్తులు కిడ్నాప్ కి పాల్పడ్డారంటూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాఖలైన కేసుకి సంబంధించి ఆ నలుగురిని తామే అదుపులోకి తీసుకున్నామని తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసులకు తెలిపారు. అయితే నిబంధనలు పాటించకుండా, ముందస్తు సమాచారం.. అధికారిక సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడంపై ఢిల్లీ పోలీసుల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు అనుసరించిన తీరు సరైంది కాదంటూ లేఖ రాయనున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నడం సంచలనం రేపింది. హత్యకు కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న యాదయ్య, విశ్వనాథ్, నాగరాజును పేట్ బషీరాబాద్ లో అరెస్ట్ చేయగా.. కేసులో సూత్రధారులుగా భావిస్తున్న ముగ్గురిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఢిల్లీలో బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసంలోని సర్వెంట్ క్వార్టర్స్ లో రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజును అదుపులోకి తీసుకున్నారు. వీరు అమరేందర్ రాజు అనే వ్యక్తితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ.15 కోట్లతో సుపారీ ఒప్పందం చేసుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నిందితుల్లో ఒకరైన రాఘవేంద్రరాజు తన స్టేట్ మెంట్ లో మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ గౌడ్ 2017 నుంచి తనను చంపించేందుకు ప్రయత్నం చేశారని పోలీసుల‌కు తెలిపాడు. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని ఆరోపించాడు. తనపై శ్రీనివాస్ గౌడ్ 30 కేసులు పెట్టించారని, అందులో 10 కేసులు ఒకే రోజు పెట్టించారని తెలిపాడు. వాటిలో ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా ఉన్నాయని తెలిపాడు. తన బార్ ను మూసేయించి ఇబ్బందులకు గురిచేశాడని, రూ.6 కోట్ల మేర ఆర్థికంగా నష్టపరిచాడని వెల్లడించాడు. వేధింపులు తట్టుకోలేకనే శ్రీనివాస్ గౌడ్ ను చంపాలనుకున్నానని తెలిపాడు. తనకు శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణభయం ఉందని రాఘవేంద్రరాజు అన్నాడు.

అంతేకాకుండా ఈ కేసులో నిందితుడు ర‌విని పోలీసులు జితేందర్ రెడ్డికి చెందిన నివాసంలో అరెస్ట్ చేయ‌డంతో.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌లో జితేంద‌ర్ రెడ్డితో పాటు బీజేపీకి చెందిన మ‌హిళా నేత డీకే అరుణ‌ల‌ పాత్రపైనా ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర తెలిపారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల్సి ఉంద‌ని జితేందర్ రెడ్డి అన్నారు. సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాల‌ని.. ఒక‌వేళ టీఆర్ఎస్ స‌ర్కారుకు సీబీఐపై న‌మ్మ‌కం లేక‌పోతే న్యాయ విచార‌ణ అయినా జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement