Monday, February 26, 2024

Nalgonda: ఏమి సాధించారని దశాబ్ది ఉత్సవాలు… కేసీఆర్ ను నిలదీసిన పొంగులేటి

నల్గొండ : ఏమి సాధించారని దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వ సొమ్ము తో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. బుధవారం హైదరాబాదు నుంచి ఖమ్మం వెళ్తూ టేకుమట్ల సమీపంలో పొంగులేటి అనుచరులు పెద్దిరెడ్డి రాజా, శనగాని రాంబాబు, మోదుగు నాగిరెడ్డి, నెరేళ్ల మధు, బాషాపంగు భాస్కర్,సాజిద్ ఖాన్ స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… దోచుకున్న సొమ్ము ఎక్కడ ఖర్చు చేస్తే తగ్గిపోతుందోనని ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ.5లక్షల కోట్ల అప్పు చేసి, ఇంకా అప్పుల పాలు చేసేందుకు ప్రభుత్వ సొమ్ముతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. చెరువులలో నాలుగు గంపల మట్టి తీసి 26 వేల చెరువుల పునరుద్ధరణ చేసిన అని గొప్పలు చెప్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఆ చెరువులను నిర్మించిన పార్టీలను ఎంత సన్మానించాలని అన్నారు.

చౌకబారు ఎత్తుగడలతో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటూ నమ్మబలికె ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ సారి యావత్ తెలంగాణ ప్రజానీకం మోసపోవడానికి సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడే కేసీఆర్ కు ప్రజలు, ఉద్యమకారులు గుర్తొస్తారని, గడిచిన 9 ఏండ్లలో గుర్తుకురాని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు గుర్తొచ్చిందా అని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా రూ.5లక్షలను రూ. 3లక్షలు చేశారని, తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని కలలు కన్న తెలంగాణ బిడ్డలు కోర్కెలు కలలుగానే మిగిలిపోయాయన్నారు. మాయమాటలతో మభ్యపెడుతూ తెలంగాణ ప్రజల కష్టసుఖాలను వదిలేసి కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తాపత్రయ పడుతున్నారన్నారు. మభ్యమాటలతో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటూ కలలు కంటున్న కల్వకుంట్ల కుటుంబానికి కలలు కలలుగానే మిగిల్చి కష్టపడి పనిచేసి తెలంగాణ బిడ్డలకు, వారి ఆత్మగౌరవం నిలిపేందుకు తమ టీం తరుపున కృషి చేస్తామన్నారు. కలలు కన్న తెలంగాణ సాదించుకోవలన్నా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తిరిగి ప్రజలకు అండగా ఉండాలన్న సూచనలతో త్వరలో మంచి నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement