Sunday, May 5, 2024

Big Story | బస్సుయాత్రకు కాంగ్రెస్‌ సన్నద్ధం.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించేలా ప్లాన్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లుతున్న కాంగ్రెస్‌.. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. పార్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే డిక్లరేషన్లు, గ్యారంటీ పథకాల పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించిన హస్తం పార్టీ.. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వంటనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈ నెల 14 లేదా 15 వ తేదీల్లో ఉత్తర తెలంగాణ నుంచి బస్సుయాత్రను ప్రారంభించాలని భావిస్తున్నారు.

అంతే కాకుండా ఈ నెల 18,19,20 తేదీల్లో నూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో ఉంటారని తెలుస్తోంది. బస్సుయాత్రలో పాల్గొంటూనే.. అవసరమైతే హైదరాబాద్‌లో రోడ్డు షో నిర్వహించనున్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నెల 14 లోపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా వెలువడితేనే ఈ బస్సుయాత్ర ప్రారంభం అవుతుందని, లేదంటే ఒకటి, రెండు రోజులు వాయిదా పడే అవకాశ కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 10వ తేదీ తర్వాత లేదా అంత కంటే ఒక రోజు ముందు ఎన్నికల షెడ్యుల్‌ వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ పథకాలు.. ప్రభుత్వ వైఫల్యాల ప్రచారం..
కాగా, రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు సంబంధించి బస్సుయాత్ర రూట్‌ మ్యాప్‌, షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు పీసీసీ కసరత్తు చేస్తోంది. బస్సుయాత్రతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహించి.. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొనేటట్లు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ యువ డిక్లరేషన్‌, వ్యవసాయ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌, చేయూత పెన్షన్‌తో పాటు ఆరు గ్యారంటీ పథకాలను విడుదల చేసింది. వాటిని విస్తృత స్థాయిలో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి వద్దకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

- Advertisement -

ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రధానంగా కరపత్రాలు, పెద్ద పెద్ద ప్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వీలనంత తర్వగా రాష్ట్ర మేనిఫెస్టో రూపకల్పన పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌బాబు.. అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకుంటూ, ప్రజలు ఏమి ఆశిస్తున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. వీటన్నింటిని క్రోడీకరించి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా మేనిఫెస్టో తయారు చేసే దిశలో కాంగ్రెస్‌ పార్టీ ముందుకెళ్లుతోంది.

ప్రతీ నియోజక వర్గంలో కార్నర్‌ మీటింగ్‌..
బస్సుయాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాలను చుట్టి వచ్చేటట్లు ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు. ప్రతి రోజు ఐదు నుంచి ఆరు అసెంబ్లిd నియోజక వర్గాల్లో యాత్రలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతి చోట కార్నర్‌ సమావేశాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతోంది. నియోజక వర్గాలపై పూర్తిస్థాయిలో పట్టుండే ప్రదేశాలను ఎంపిక చేసే బాధ్యతలను ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. నియోజక వర్గాల వారీగా ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లను ఆకర్షించే విధంగా నాయకుల ప్రసంగాలు ఉండేటట్లు జాగ్రత్త వహిస్తున్నారు.

కరీంనగర్‌ వేదికగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల..?
కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటీ వరకు రైతు, యూత్‌, చేయూత, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లతో పాటు ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా ఎన్నికల మేనిఫెస్టోతో పాటు ఓబీసీ, మహిళా, మైనార్టీ డిక్లరేషన్లను ప్రకటించాల్సి ఉంది. ఓబీసీ డిక్లరేషన్‌ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో, మహిళా డిక్లరేషన్‌ ప్రియాంక గాంధీ, మైనార్టీ డిక్లరేషన్‌ మరొక సీనియర్‌ నేతతో ప్రకటించాలని భావిస్తున్నారు. బస్సుయాత్రలో భాగంగా మూడు సభలు నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. అయితే కీలకమైన ఎన్నికల మేనిఫెస్టోను మాత్రం కరీంనగర్‌ వేదికగా భారీ సభను నిర్వహించి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో ప్రారంభించాలనే అభిప్రాయంతో ఉన్నారు. వరంగల్‌ వేదికగా రైతు డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ ప్రకటించినప్పుడు విస్తృత ప్రచారం వచ్చిందని, ఇప్పుడు కరీంనగర్‌ వేదికగా మేనిఫెస్టో విడుదల చేస్తే.. ఉత్తర తెలంగాణలో పార్టీకి మరింత బలం పెరుగుతుందని భావనలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement