Thursday, April 25, 2024

జ‌వాద్ తో జాగ్ర‌త్త .. అవ‌స‌ర‌మైతే టోల్ ఫ్రీ నెంబ‌ర్ కి ఫోన్ చేయాల‌న్న క‌లెక్ట‌ర్ ..

ఏపీ భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి.. నెమ్మ‌దిగా వ‌ర‌ద ఉథృతి త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో మ‌రో తుఫాను రానుంది. ఈ తుఫాన్ కి జ‌వాద్ గా పేరు పెట్టారు. ప్ర‌స్తుతం విశాఖ తీరానికి 960కిలోమీటర్లు దూరంలో, ఒడిషాలోని గోపాలపూర్ కు 1020, పరదీప్ కు 1080 కిలోమీటర్లు దూరంలో ఈ వాయుగుండం కేందీకృతమైవుంది. రేప‌టి ఉదయానికి ఉత్తర కోస్తా -ఒడిశా తీరాలకు సమీపించునున్న తుపాను తీరం తాకే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించింది. జ‌వాద్ ప్ర‌భావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాతో పాటు యానాంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… ఎలాంటి అవసరమున్నా కలెక్టరేట్ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున సూచించారు.

కాగా నేటి సాయంత్రం నుంచే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు తీరంవెంబడి గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలున్నాయి. ఈ గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదంతో పాటు వర్షపునీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదముంది కాబట్టి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. జవాద్ తుఫాను ప్రభావం ఎక్కువగా వుండే ఈ రెండురోజులు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడ‌ద‌ని తెలిపారు. జవాద్ తుఫాను ప్రభావం ఎక్కువగా వుండే అవకాశమున్న విశాఖ జిల్లాకు ఇప్పటికే 50 మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. అలాగే నేవీ, కోస్ట్ గార్డ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. నేడు, రేపు విశాఖపట్నంలో పర్యాటక ప్రదేశాల్లో సందర్శకులకు అనుమతి నిలిపివేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement