Wednesday, February 28, 2024

చెడ్డీ గ్యాంగ్ ముఠా ‘ఫొటో’లను రిలీజ్ చేసిన పోలీసులు

చెడ్డీ గ్యాంగ్ ఏపీలో ప్ర‌జ‌ల‌తో పాటు పోలీసుల‌ను హ‌డ‌లెత్తిస్తోంది ఈ దొంగ‌ల ముఠా. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతూ చెడ్డీ గ్యాంగ్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఈ మేర‌కు పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల ఫొటోల‌ను విడుద‌ల చేశారు. వీరు ఎక్క‌డ క‌నిపించినా త‌మ‌కి స‌మాచారం అందించాల‌ని పోలీసులు తెలిపారు. రాత్రి స‌మ‌యాల్లో ఎవరైనా మీ ఇంటి తలుపులు తడితే తెరవద్దని పోలీసులు హెచ్చరిక‌లు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాలవారు అనుమానాస్పద స్థితిలో తారసపడితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. అనుమానితులు, అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తతో వ్యవహరించాల‌ని తెలిపారు. ఏ ఒక్కరూ నష్టపోకూడదని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. స్టేషన్ల వారీగా దొంగల ముఠా సమాచారం ఇచ్చి వారి కదలికలు ఏ విధంగా ఉంటాయో..? వారి నుండి ఏ రక్షణ పొందాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సచివాలయ పోలీసుల ద్వారా అవగాహన కల్పించటంతో పాటు ప్రధాన కూడళ్లల్లో ఆటోల ద్వారా మైక్ లో ప్రచారం చేస్తున్నారు.

కాగా రీసెంట్ గా విజయవాడ పోలీస్ కమీషనర్ గా బాద్య‌త‌లు స్వీక‌రించిన కాంతి రాణా టాటా చెడ్డీ గ్యాంగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ క్రమంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జక్కంపూడి సీవీఅర్ ఫ్లై ఓవర్ సమీపంలో చెడ్డీ గ్యాంగ్ సభ్యులు దోపిడీకి పాల్పడిన ఇంటిని కాంతి రాణా టాటా స్వయంగా పరిశీలించ‌డం విశేషం. దొంగతనం జరిగిన తీరుతెన్నులను తెలుసుకోవడంతో పాటు బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరాలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నేరస్థులను గుర్తించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ఇతర రాష్ట్ర క్రైమ్ పోలీసుల సహాయ సహకారాలను తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, భ‌యాందోళ‌న‌ల‌కి గురి కావొద్ద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement