Sunday, April 28, 2024

Omicron: రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు.. కేంద్రం మార్గదర్శకాలు ఇవే

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 250పైగా కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ పై రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.

దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని సూచించారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలని కోరారు. రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రాలకు కేంద్రం చేసిన పలు సూచనలు..

పండగల వేళ ఒమిక్రాన్‌ వ్యాప్తిని అరికట్టేలా రాత్రి కర్ఫ్యూలను అమలు చేయాలని కేంద్రం తెలిపింది. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని సూచించింది. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా పరిగణించి.. అక్కడ తగిన నిబంధనలు అమలు చేయాలని పేర్కొంది. బాధితుల నమూనాలకు ఆలస్యం చేయకుండా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలని కోరింది. అన్ని జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్న కేంద్రం.. పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టిపెట్టాలని తెలిపింది.

ఇక, ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, అంబులెన్స్‌, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించింది. మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలని తెలిపింది.

- Advertisement -

ఇక, వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని, జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్‌ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆదేశించింది.  రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement