Wednesday, May 1, 2024

BJP Star Celebrities – పేలని తారలు! దీవాళి వేళ దేకని పైకమాండ్ ..

వాళ్లు ఇవ్వలేదా.. వీళ్లు ఇంట్రెస్ట్​ చూపలేదా​
దీపాల పండుగ వేళ పొలిటికల్ టపాసుల మోత
యూత్ తారాజువ్వల కేరింత
ఆకాశంలో వెలుగు పూల వర్షం
అమావాస్య తెరలో స్టారులన్నీ గాయబ్
పార్టీ టిక్కెట్ల కోసం గంపెడాశతో బారులు తీరినా..
ఖాతరు చేయని బీజేపీ
సినీ జగత్ జంత్రీల చేతిలో కమలం రేకులు
దీనంగా నేలపై టప టప
బీజేపీ దెబ్బకు స్టార్ల టిక్కెట్​ ఆశలు గల్లంతు

సినీ జగత్తులో ఏక ఛత్రాధిపత్యం చెలాయించి.. జనం అభిమానాన్ని కొల్లగొట్టి.. అహం బ్రహ్మాస్మీ అని తాండవించిన సినీ తారలు ఈ ఎన్నికల్లో మసక బారారు. దీపావళి బాణాసంచా మోతలో వీరి ఇమేజీ పొగచూరింది. ప్రధాన రాజకీయ పార్టీ బీజేపీపై గంపెడాశతో ఎన్నికల్లో పోటీకి టిక్కెట్ల కోసం ఎదురు చూసిన తెలంగాణ సినీ స్టార్లు మిణుకు మిణుకుమంటూ ఆరిపోయాయి. తమ రాజకీయ భవిత, దశ, దిశ లేక వలవల విలవిల అనుకుంటూ తమలో తామే కుమిలి పోయే స్థితి ఏర్పడింది ఒకరా ఇద్దరా.. అగ్ర కథానాయికా, నాయకులుగా వెలుగొందిన అయిదుగురు స్టారాధి స్టారులకు, అందమైన భామలకూ ఈ ఎన్నికల్లో నిరాశ తప్పలేదు. ఫైర్ బ్రాండ్ విజయశాంతి నుంచి.. శివరంజని జయసుధ, నాలుగు స్తంభాలాట నరేష్, గుంటూరు నెరజాణ మాధవీలత, రాజకీయ అస్త్ర శస్త్రాల ధారి రేష్మా రాథోడ్, తనకు అడ్డుచెప్పని రాజకీయ పార్టీల జీవిత భాగస్వామి జీవిత రాజశేఖర్​కూ బీజేపీ తూచ్ చెప్పింది. ఊరింతలు, తాయిలాలు కట్.. కట్.. అని గట్టిగానే ప్యాకప్ ప్రకటించింది. ఇక నేను పోటీ చేయను బాబో అంటూ మొరపెట్టుకున్న బాబూ మోహన్​కు మాత్రం బతిమాలి, బామాలి అందోల్ టిక్కెట్​ను సమర్పించటం విశేషం. అయితే.. ఇక్కడో చిన్న లాజిక్కును తెరపైకి తెస్తున్నారు. వీళ్లకు ఇష్టం లేకనా? పార్టీకి ఇంట్రెస్ట్​ చూపకనా అన్నది మాత్రం రాంగోపాల్​వర్మ సినిమాలో సస్పెన్స్​లా మారింది. ఇక.. తెలంగాణ గడ్డపై కాషాయ కండువలో.. చిరునవ్వులు చిందించి. ఆఖరి క్షణంలో, అనూహ్య దెబ్బతో.. మౌనమే నీ బాష ఓ మూగ మనసా పాటను ఆలపిస్తున్న రాజకీయ నేపథ్యంలో సినీ తారల స్థితి, గతులు.. ఆసక్తికర విశేషాలు చదివి తెలుసుకుందాం.

అస్థిర శాంతి.. అశాంతి!
హీరోయిన్ దిగ్గజం..రాజకీయ రౌద్రం.. ఫైర్ బ్రాండ్ అస్థిరత్వమే రాజకీయ అనిశ్చితికి కారణమా? ఏమో కావచ్చు. సినీ ప్రపంచంలో తిరుగులేని పట్ట మహిషీ.. విజయ శాంతి..1998లోనే భారతీయ జనతాపార్టీలో చేరి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. అదే సమయంలో సోనియా గాంధీపై కడప ఎంపీ స్థానంలో పోటీకి సై అని దేశ వ్యాప్తంగా సంచలన చరిత్ర సృష్టించారు. కానీ సోనియా గాంధీ కడపను కాదని బరేలీలో పోటీ చేయటానికి సిద్ధపడటంతో.. విజయశాంతి పోటీ నుంచి తప్పుకున్నారు. పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక భావంతో రాజకీయ అడుగులు వేశారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత తరపున స్టార్ క్యాంపెయినర్గా పని చేశారు. అదే విధంగా బీజేపీ అభ్యర్థి క్రికెటర్ శ్రీశాంత్కూ స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు నిర్వహించారు

తెలంగాణ సాధన పోరులో..
తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ సాధనకు నడుము కట్టారు. 2009లో తెలంగాణ తల్లి పార్టీని స్థాపించారు. కానీ ప్రజాబలం అంతంతే . ఇక చేసేది లేక భారత రాష్ర్ట సమితిలో తెలంగాణ తల్లిని విలీనం చేశారు. మెదక్ ఎంపీ స్థానంలో విజయం సాధించారు. భారత రాష్ర్ట సమితి పోకడలను వ్యతిరేకించి.. 2009 జూన్లో కేసీఆర్కు సంఘీభావం తెలిపారు. 2011లో కేసీఆర్తో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయినా…2014లో తెలంగాణ ఆవిర్భావం తరువాత తన సేవలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదు.

బీజేపీ కోటకు పయనం..
కేసీఆర్ తనను నమ్మించి మోసం చేశారనే భావంతో 2014లో ఆమె కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే పోటీ చేసినా.. జనం అక్కున చేర్చుకోలేదు. 2018 ఎన్నికల్లో తెలంగాణ ప్రచార కమిటీలో కీలక పాత్ర పోషించారు. 2019లో ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడో ఉగ్రవాది, నియంత అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. అంతలోనే 2020లో అమిత్షా సమక్షంలో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీలో నోరు జారలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తప్పని సరిగా పార్టీ టిక్కెట్లు వస్తుందని ఆశించారు. నాలుగు జాబితాల్లోనూ ఆమె పేరు లేదు. ఇక ఆమె భవిష్యత్తు ఏమిటి? మళ్ళీ పార్టీ మారుతారా? వేరే జండాను భుజానికి ఎత్తుకుంటారా? ప్చ్.. చెప్పలేం.

- Advertisement -

శివరంజనీ పాప సంకీర్తన..
మరో అందాల తార జయసుధ రాజకీయ కథ .. పార్టీల గడప దాటుడే.. దాటుడు. క్రైస్తవ నమక్కస్థురాలినని స్వయంగా.. బాహటంగా అంగీకరించే జయసుధ బీజేపీ టిక్కెట్టును అదీ షరతులతో ఆశించటం విశేషం. 2009లో దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పుణ్యమాని సింకిద్రబాద్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ పాగా వేశారు. ఆయన మరణానంతరం పార్టీని మారలేదు. 2014లో తెలంగాణ ఆవిర్భావంతో .. ఆమెకు రాజకీయ మనుగడ అర్థం కాలేదు. 2016లో తెలుగుదేశంలో చేరారు. అక్కడా ప్రాధాన్యం లభించలేదు. మరో సారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేందుకు వైసీపీలో చేరారు. అక్కడ నోచాన్స్. ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోద్బలంతో బీజేపీలో చేరారు. తనకు తప్పని సరిగా సీటు ఇస్తేనే పార్టీలో చేరుతానని షరతు విధించారు. కానీ ఆమె షరతు గాలికి కొట్టుకు పోయింది. క్రైస్తవ వనితకు పార్టీ టిక్కెట్టు ఇవ్వటానికి బీజేపీ అధిష్టానం తలూపలేదు. మరి ఈ స్థితిలో.. జయసుధ రాజకీయ కెరీర్ను వదిలి… క్రైస్తవ మహా సభలకు వెళ్తారా? లేక వేరే పార్టీలో చేరుతారా? ఏమి జరగనుందో వేచి చూడాల్సిందే.

హీరో నరేష్ నాలుగు స్థంభాలాట..
టాలీవుడ్లో సినీ పెద్ద . మా అసోసియేషన్లో దడదడ..బిడబిడ నేత నరేష్ నిజానికి ఆది నుంచీ బీజేపీ అనుచరుడే. ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడిగా.. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా.. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హిందూపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక తెలంగాణాలోనూ కార్యశీలిగా వ్యవహరించారు. కృష్ణాగోదావరి నదుల అనుసంధానం కోరుతూ.. సీ విద్యాసాగర్తో కలిసి ఇచ్చంపల్లి నుంచి వరంగల్ వరకూ 125 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక రాయలసీమ అభివృద్ధి కోసం ఆందోళనల్లో పాల్లొన్నారు. ఇంతటి అకుంఠిత దీక్ష కార్యకర్తకూ బీజేపీ టిక్కెట్టు ఇవ్వలేదు. ఇందుకు నరేష్ జీవనశైలిలో సహజీవన వివాదాలే కారణమా? ఏమో కావచ్చు.

పసుపు లేటి మాధవీ లత…
సినీ ప్రపంచంలో నచ్చావులే చిత్రంతో.. అందరికీ నచ్చిన కర్ణాటక సుందరి పసుపులేటి మాధవీలత తెలుగమ్మాయే. పదేళ్ళు టాలీవుడ్లో మెరిసిన మాధవీ లత.. 2018లో బీజేపీతో అల్లుకుపోయగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సినీ రికార్డింగ్ డాన్సుల హీరోలు, హీరోయిన్లకు వేదిక.. సినిమాపై మక్కువతో వెండితెరకు అతుక్కుపోయే గుంటూరు జనం గుండెలపై హీరోయిన్ మాధవీలత చరిష్మా పని చేయలేదు. అప్పటి నుంచి హైదరాబాద్లోనే బీజేపీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థుల కొరతనే ప్రచారంతో.. తనకు తప్ననిసరిగా సీటు కాయమని మాధవీలత గంపెడాశ పెట్టుకున్నారు. కానీ..కాషాయ జెండ కరుణించలేదు.

వాగ్గేవీ రేష్మా రాథోడ్…
ఈరోజుల్లో.. తెలంగాణ యువతే లక్ష్యంగా.. 2018లో బీజేపీలో చేరిన సినీ హీరోయిన్ రేష్మా రాథోడ్.. బయ్యారం ఉక్కు పరిశ్రమే ద్యేయంగా… తన వాగ్దాటితో యువతను ఆకర్షించిన రేష్మా చరిష్మా..రాజకీయ భవితవ్యానికి దోహదం చేయలేదు. తెలంగాణ ఎన్నికల్లో తనకు బీజేపీ టిక్కెట్ లభిస్తుందని ఆశించినా.. పార్టీ అధిష్టానం అవకాశం ఇవ్వలేదు.

జీవనాంకుశంలో అటూ ఇటూ..
తెలుగులో తడబడే.. సినీ హీరో రాజశేఖర్ సతీమణి జీవిత.. రాజకీయ పరంపర ఎవరికీ అర్థం కాదు. ఏ క్షణం ఎక్కడుంటారో? రాజకీయాల్లోనా… టాలీవుడ్ రాజకీయాల్లోనా ప్స్ ఎవరికీ తెలీదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఆవిర్భావం, ఉప ఎన్నికల్లో సీట్లన్నింటిలోనూ విజయం సాధించటంతో.. రాజశేఖర్, జీవిత వైసీపీలో చేరారు. విజయవాడలో జగన్ నాయకత్వంలో జరిగిన దీక్షలో పాల్గొన్నారు. అదే సమయంలో హాజరైన వైఎస్ఆర్ అభిమానులతో మాట్లడుతూ.. మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారంటే.. మా ఆయన రాజశేఖర్ ఫ్యాన్సే కథా అని ప్రశ్నించారు. అంతే రాజశేఖర్ దంపతులను వైసీపీ మరుచటి రోజే వెలివేసింది. ఇక ఎన్నో వివాదాలు? కేసీఆర్ను తిట్టిన తిట్టు తిట్టకుండా.. తిట్టి చరిత్ర సృష్టించారు. పాపం ఇటీవలే బీజేపీలో చేరారు. టిక్కెట్ ఆశించారు. కానీ బీజేపీ ఊ.. అనలేదు. ఊహూ.. అంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement