Friday, April 26, 2024

India | జీ20లో భాగంగా ‘స్టార్టప్​–20’భేటీ.. అంకుర సంస్థలు, కార్పొరేట్​ సమన్వయంపై చర్చలు

అంకుర సంస్థలకు మద్దతు, కార్పొరేట్​-పెట్టుబడిదారులు-ఆవిష్కరణ సంస్థలుసహా పర్యావరణ వ్యవస్థలోని ఇతరత్రా కీలక భాగస్వాములతో అంకుర సంస్థల సమన్వయం దిశగా ప్రపంచ నేపథ్య సృష్టికి తగిన వరుస కార్యక్రమాలను నిర్వహించాలని స్టార్టప్20 ప్రారంభ సమావేశం ఆకాంక్షించింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత జి-20 అద్యక్షత సంబంధిత సరికొత్త చర్చల బృందం ‘స్టార్టప్20’ తొలి సమావేశం ఇవ్వాల (శనివారం) ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సహకారాత్మక, ముందుచూపుతో కూడిన ప్రపంచ అంకుర పర్యావరణ వ్యవస్థను సమన్వయీకరించడం స్టార్టప్​20 ప్రధాన లక్ష్యం అని ప్రముఖులు పేర్కొన్నారు.

జి-20 సభ్య దేశాల్లోని అంకుర సంస్థల సామర్థ్య వికాసానికి తోడ్పడే అంశాల్లో ఆచరణాత్మక మార్గనిర్దేశకాల రూపకల్పనకు ఉమ్మడి వేదికను చూపడం ఈ బృందం ప్రధాన ధ్యేయం నిధుల లభ్యతలో అంతరాల గుర్తింపు, ఉపాధి అవకాశాల పెంపుదల, ఎస్‌డీజీ లక్ష్యాల సాధన, వాతావరణ ప్రతిరోధకతతోపాటు సమ్మిళిత పర్యావరణ వ్యవస్థ ఎదుగుదల వంటి అంశాలకు ఇందులో  ప్రాధాన్యం ఉండనుంది. ‘స్టార్టప్20’ బృందం చైర్మన్‌ డాక్టర్ చింతన్ వైష్ణవ్ మొదట మాట్లాడారు. ఆయన తర్వాత తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్, నీతి ఆయోగ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పరమేశ్వరన్ అయ్యర్‌ కీలక ప్రసంగాలు చేశారు.

కాగా, భారత జి-20 షెర్పా అమితాబ్‌ కాంత్‌ స్టార్టప్‌20 చర్చల బృందం గురించి సంక్షిప్తంగా ప్రసంగించారు. ఆ తర్వాత అంకుర సంస్థలు-ప్రపంచ వృద్ధి చోదకాలు అనే అంశంపై కేంద్ర మంత్రి సోమ్‌ప్రకాష్‌ ప్రసంగించారు. అలాగే ‘అమృతకాలంలో ఆవిష్కరణలు-ఇండియా @2047’ అనే అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు చూపే ఆవిష్కరణలు అనే అంశంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ వర్చువల్‌ మాధ్యమం ద్వారా మాట్లాడారు.

- Advertisement -

కార్యక్రమాల అనంతరం పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ సంయుక్త కార్యదర్శి శ్రుతి సిన్హా తుది పలుకులతో సమావేశం ముగిసింది. అంతేకాకుండా.. తెలంగాణ ఆవిష్కరణ-అంకుర సంస్థలతో ప్రతినిధులు మమేకమయ్యే దిశగా టి-హబ్ విహారయాత్ర కూడా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కీలక ప్రసంగం చేశారు. తాజ్ ఫలక్‌నుమాలో షడ్రసోపేత విందుతో తొలిరోజు కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా సుసంపన్న  భారత వారసత్వం-సంస్కృతికి అద్దంపడుతూ ప్రదర్శించిన ‘పేరిణి నాట్యం’ వంటి కళారూపాలు అతిథులను ముగ్ధులను చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement