Thursday, April 25, 2024

Big Story | రైతులకు గుడ్​ న్యూస్​.. రుణమాఫీకి పూర్తిస్థాయిలో బడ్జెట్‌ కేటాయింపులు

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: ఎన్నికల హామీల అమలులో భాగంగా రైతాంగానికి వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం తీపికబురు అందించనుంది. రైతు రుణమాఫీకి పూర్తిస్థాయిలో బడ్జెట్‌లో నిధులను కేటాయించి వారిని రుణవిముక్తులను చేయాలని సంకల్పించినట్లు తెలిసింది. తద్వారా 47లక్షల మందికి స్వాంతన చేకూరనుంది. రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేసిన సర్కార్‌ మార్గదర్శకాలను రూపొందిస్తోంది. రూ.37వేల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా రూ.38వేలనుంచి రూ. లక్షలోపు రుణాలకు చెందిన రైతుల లెక్కలు సేకరించింది. 2021-22 వరకు రైతురుణ మాఫీకి నిధులను కేటాయించుకుంటూ వచ్చిన సర్కార్‌ ప్రస్తుత ఏడాదిలో నిధులేమి కారణంగా కేటాయింపులు చేయలేదు.

వచ్చే ఏడు బడ్జెట్‌లో రైతుల అభ్యున్నతే ప్రధాన్యతాంశంగా సీఎం కేసీఆర్‌ ఈ మేరకు రుణమాఫీకి, పావలా వడ్డీకి, ఇతర వ్యవసాయ పథకాలకు భారీగా కేఉటాయింపులు చేయనుందని తెలిసింది. గడచిన రెండేళ్లపాటు కరోనా లాక్‌డౌన్‌, అకాల వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఏడాది రైతులకు వానాకాలం ప్రారంభానికి ముందుగానే రైతుబంధు పంట పెట్టుబడి, రుణవిముక్తి పథకాల నిధులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు పద్దులకు సంబంధించి ఆర్థిక శాఖ నిధులను బడ్జెట్‌లో పొందుపర్చి విడుదల చేసేలా కార్యాచరణ మొదలుపెట్టింది. సాధ్యమైనంత త్వరగా లబ్దిదారులకు రుణమాఫీ చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.

- Advertisement -

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు లక్షలోపు పంట రుణాలన్నింటినీ రద్దుచేసి రైతులకు ఉపశమనాన్ని కల్పించే చర్యలను వేగవంతం చేయమాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఆర్ధిక ఏడాది ఏప్రిల్‌ 1నుంచి వీలైనంత త్వరగా రుణ విముక్తి కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం సంకల్పించింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి అవకతవకలు లేకుండా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో జాబితాలను వడపోసి లబ్ధిదారుల లెక్కలను తేల్చారు.

2014 ఏప్రిల్‌ 1నుంచి 2018 డిసెంబర్‌ 11 వరకు కటాఫ్‌గా నిర్ణయించిన ప్రభుత్వం బ్యాంకర్ల నివేదిక మేరకు 47.4 లక్షలమంది రైతులను గుర్తించింది. ఇందుకు రూ. 24,738కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. కాగా, ఒకే కుటుంబంలో ఒకరిద్దరు ఉన్న లెక్కలను తీసి ఇందులోనుంచి రూ. 3881కోట్లను తగ్గించింది. రుణమాఫిని నాలుగు విడతల్లో తొలి ఏడాది 2020లో రూ. 25వేల వరకు, రెండో విడత 2021లో రూ. 50వేల వరకు, మూడో విడత 2022లో రూ. 75వేల వరకు, నాల్గో విడత 2023లో రూ. లక్ష వరకు ప్రక్రియకు నిర్ణయించింది.

అయితే అనేక కారణాలతో రూ. 37వేల వరకు రుణాలకు రూ. 763 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆ తర్వాత కొంత జాప్యం చేసింది. ఇంకా రూ. 20,857 కోట్లు మొత్తం రుణమాఫీకి అవసరం కానున్నాయి. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ యాంత్రీకరణ, పావలా వడ్డీ పథకానికి భారీ ప్రాధాన్యతతో నిధుల కేటాయింపులకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిచ్చింది. పంట రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు 7శాతం వడ్డీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 3శాతం చొప్పున 6శాతం వడ్డీ చెల్లించాలి. కానీ కేంద్ర సహకార లేమితో ఇదీ అమలు కావడం లేదు. ఇక మిగిలిన 1 శాతం కూడా తామే చెల్లిస్తామని వెల్లడించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఈ మేరకు నిధుల ప్రస్తావన చేయనుంది. వ్యవసాయ యాంత్రీకరణకు, ఇతర ప్రోత్సాహకాలకు రూ. 1000కోట్లు కేటాయించాలని భావిస్తోంది. ఇవి కాకుండా రైతుబంధు, రైతుబీమా, ప్రత్యే ఆహారమండళ్లకు భారీగా కేటాయింపులు ఉండనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement