Wednesday, April 17, 2024

TS | కేసీఆర్​ ఉన్నంత కాలం  దళితబంధు ఉంటది.. ప్రతి దళిత కుటుంబం బాగుపడాలన్నదే లక్ష్యం

  • పేదలకు అండగా బీఆర్​ఎస్​ ప్రభుత్వం
  • కరువు నేలగా ఉన్న సిద్దిపేట ఇప్పుడు పచ్చగా ఉంది
  • నాకంటే హరీశ్​రావు ఎంతో డెవలప్​చేసిండు
  • చింతమడకలో చిన్నప్పటి దోస్తుల యాది..
  • తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది ఈ గడ్డనే
  • సొంత గడ్డపై హుషారుగా సాగిన కేసీఆర్​ ప్రసంగం
  • బీఆర్​ఎస్​ శ్రేణుల్లో ఫుల్​ జోష్​

ఉమ్మడి మెదక్​ బ్యూరో, (ప్రభ న్యూస్​): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్‌, తెలంగాణ సీఎం కేసీఆర్​ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్‌, జనగామ, భువనగిరి, రాజన్న సిరిసిల్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో మంగళవారం రాత్రి ప్రజా ఆశీర్వాద సభలో హుషారుగా ప్రసంగించారు.  

‘‘తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా సిద్దిపేట గడ్డ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిద్దిపేటకు భారీగా తరలివచ్చిన ఆత్మీయులైన సిద్దిపేట అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెల్లకు హృదయపూర్వక నమస్కారాలు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఈ మాట అన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు. సిద్దిపేట పేరు విన్నా.. సిద్దిపేట భూమికి వచ్చినా.. సిద్దిపేట నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాదింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చింది. నన్ను నాయకున్ని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని గర్వంగా మనవి చేసుకుంటున్నా. నన్ను ఇంత వాడిని చేసిన నా మతృభూమికి , మీ అందరికీ శిరస్సు వంచి నమస్సులు తెలియజేస్తున్న. నాకు ఇంత ఇచ్చిన ఈ గడ్డకు ఏమిచ్చినా నా రుణం తీర్చుకోలేనిది.

నాకు డిపాజిట్‌ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నడో..

- Advertisement -

నన్ను ప్రతిసారి విజేతగా నిలబెట్టిన ఈ గడ్డ రుణం ఈ జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేనని మనవి చేస్తున్నా. ఈ సభలో నాతో కలిసి పని చేసిన మిత్రులు, సహచరులు వందలాది మంది ఉన్నారు. అనేక జ్ఞాపకాలు, ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారు. కొండంరాజ్‌పల్లి మాదన్న ఎక్కడ ఉన్నడో.. మా నవాబ్‌ సాబ్‌ ఎక్కడ ఉన్నాడో. నాకు డిపాజిట్‌ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నడో. ఇలా అనేక మంది అనేక మంది ప్రతి గ్రామంలో వంద, మూడు వందల పేర్లు పెట్టి పిలిచేంత అభిమానం కలిగిన గడ్డ సిద్దిపేట గడ్డ. ఆనాడు అంత అద్భుతమైన పద్ధతిలో ఈ గడ్డను ముందుకు తీసుకెళ్లేందుకు చాలా తిప్పలు పడ్డాం. ఒక సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటే.. దామోదర్‌రావు, ఎంపీకి రంగనాయక్‌ సాగర్‌ నుంచి హెలికాప్టర్‌ నుంచి చూపించాను. సిద్దిపేటలో మంచినీళ్ల కరువు వస్తే వార్డుకో ట్యాంకు పెట్టి.. మిత్రులను వెంటేసుకొని బయలుదేరాం. సాయంత్రం వరకు ప్రయత్నం చేసి వంద బోర్లు వేస్తే నీళ్లు రాలే. ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే బాధేస్తుంది. మంచినీళ్ల కోసం సిద్దిపేట పడ్డ తిప్పలు. లోయర్‌ మానేరు నుంచి నీళ్లు తెచ్చుకొని జలజాతర చేసుకున్నాం. ఈ రోజు మిషన్‌ భగరీథ తెలంగాణ మొత్తం అమలవుతుందంటే.. సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది. ఇక్కడి అనుభవమే అక్కడిదాకా.. బ్రహ్మాండంగా పని చేసింది’ అన్నారు.

చింతమడక యాది..

చింతమడకలో నా చిన్నప్పుడు, నా పసికూనగా ఉన్న టైమ్​లో, మా అమ్మ ఆరోగ్యం దెబ్బతింటే ఓ ముదిరాజుల తల్లి నాకు చనుబాలు ఇచ్చి సాదింది. నేను పాదయాత్ర చేయని గ్రామము లేదు, వెళ్లని గ్రామం లేదు. ప్రతి చోటుతో నాకు పరిచయం ఉంది. ఊరూరా తిరిగిన పరిస్థితులున్నాయి. ఎలా ఉన్న సిద్దిపేటను ఇప్పుడు ఎట్లా చేసినమో చూడాలి. మీ అందరి దయ, సిద్దిపేట మంచినీళ్ల పథకమే మిషన్​ భగీరథకు స్ఫూర్తిదాయకం.

హరీశ్​రావు మీద ఓ జోకు ఉన్నది..

హరీశ్​రావు మీద మన ఎమ్మెల్యేల్లో, మన మంత్రులలో ఒక జోక్​ ఉన్నది. హరీశ్​రావు అటు తిరుగుతడు, ఇటు తిరుగుతడు.. ఏడ గింతంత పెండ కనబడ్డా అది తీసి తట్టల వేసుకుంటడు.. అని చమత్కరిస్తూనే.. హరీశ్రావు కొంచెం కూడా నిధులు పోనియ్యడని అనుకుంటరు. సిద్దపేటకు గోదావరి జలాలు వచ్చినయ్​. చెక్​ డ్యాములన్నీ మంచిగ చేసుకున్నం. ఐటీ హబ్​ తీసుకొచ్చినం.. ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి చేసుకున్నం. ఎక్కడ చూసినా పొలాలు, 24 గంటల కరెంటు ఇస్తున్నం..

ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తం..

సిద్దిపేటలో అన్ని రకాల అభివృద్ధి చేసుకుంటున్నం. సంక్షేమం పరంగా కూడా ఇంకా ముందుకు పోతున్నం. ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు తప్పకుండా ఇస్తం. హరీశ్​రావును లక్షకు పైగా మెజారిటీతో గెలుపించుకోవాలి. త్వరలోనే సిద్దిపేట వజ్రపు తునకలా తయారవుతుంది.

కేసీఆర్​ బతికి ఉన్నంతకాలం దళిత బంధు ఆగదు..

నేను బతికి ఉన్నంత వరకు దళిత బంధు ఆగదు.. ప్రతి దళిత కుటుంబం తమ సొంతకాళ్లపై నిలబడడమే నా లక్ష్యం అంటూ సీఎం కేసీఆర్​ ఉద్ఘాటించారు. సిద్దిపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో తాను పుట్టి, పెరిగిన స్మృతులను యాది చేసుకుంటూనే.. తనతో పాటు కలిసి పెరిగిన దోస్తుల గురించి ప్రస్తావించారు. సిద్దిపేట తనకు ఎంతో ఇచ్చిందని.. ఏమిచ్చి ఈ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదన్నారు. తనకంటే హరీశ్​రావు సిద్దిపేటను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాడని కేసీఆర్​ కొనయాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement