Sunday, May 5, 2024

ఏపీ పరిషత్ ఫలితాలుపై సస్పెన్స్!

అంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఈ నెల 23న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం కోర్టు ప్రారంభమైన వెంటనే.. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫు న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ.. పరిషత్‌ వ్యాజ్యాలపై విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసిందని.. అయితే కోర్టు ఆదేశాల మేరకు వ్యాజ్యాలు లిస్ట్‌ కాలేదని తెలిపారు. పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు స్పందిస్తూ శుక్రవారం పిటిషన్లపై విచారణ జరుపుతామన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

ఏప్రిల్ 1న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 6న హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. హైకోర్టులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల ఎన్నికల కోడ్ విధించలేదని పిటిషనర్లు వివరించారు. 7 రోజుల్లో ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఎస్ఈసీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. దీంతో ఈ నెల 7న సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది.

అయితే, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఫలితాలను మాత్రం వెల్లడించొద్దని సూచించింది. దీంతో ఈ నెల 8న పోలింగ్ జరగ్గా.. ఫలితాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కౌంటింగ్‌పై హైకోర్టులో ఈ నెల 15న విచారణ జరగ్గా.. ఎస్ఈసీ మూడు పిటిషన్లలో రెండింటింకి మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది. మూడో పిటిషన్ కౌంటర్ దాఖలుకు సమయం కోరింది. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది. మళ్లీ కోర్టులో ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. అయితే, హైకోర్టు మళ్లీ శుక్రవారానికి వాయిదా వేసింది.

కాగా, ఏప్రిల్ 8న పరిషత్ ఎన్నికల పోలింగ్ జరిగింది. జడ్పీటీసీ స్థానాలకు 2,092 మంది.. ఎంపీటీసీ స్థానాలకు 19, 002 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement