Monday, May 20, 2024

ఏపీలో ఈబీసీ నేస్తం పథకం.. పొందడం ఎలా?

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు చేయూత అందించే ఈబీసీ నేస్తం పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, వారిని ఏవిధంగా గుర్తించాలనే దానిపై బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులిచ్చారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న అగ్రవర్ణాల మహిళలకు ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు రూ.45 వేలు ఇవ్వనుంది. ఈ పథకం కింద 4,02,336 మంది లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదికి రూ.603.5 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.1,810.51 కోట్లు ఈ పథకం అమలుకు ఖర్చవుతుంది. ఇందుకు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది.

ఈ పథకం కింద కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలలోపు మాత్రమే ఉండాలి. మునిసిపల్‌ ఏరియాలో 750 చదరపు అడుగులలోపు ఇల్లు ఉన్న వాళ్లు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పథకానికి అనర్హులు. ఇందులో పారిశుధ్య ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. సొంత కారు ఉండకూడదు ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో ఉండవచ్చు అన్నా అర్హులుగా పరిగణిస్తారు. కుటుంబంలో ఒక్కరు కూడా ఆదాయపన్ను చెల్లించి ఉండకూడదు. ఈ పథకంలో అర్హులను గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వేచేసి అర్హతలున్న వారిని గుర్తిస్తారు. ఈ సమాచారాన్ని వివిధ దశల్లో అధికారులు పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ తుది జాబితా రూపొందిస్తారు. ఎంపిక పూర్తయ్యాక నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement