Wednesday, November 29, 2023

All Free – ఉచితాలు – అనుచితాలు…

(న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) వచ్చే ఏడాది లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు జరగ నున్నాయి. ఈ లోగా దాదాపు 11 రాష్ట్రాల అసెంబ్లిలకు కూడా ఎన్నికలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్నికల మేని ఫెస్టోలను సిద్ధం చేస్తున్నాయి. పలు ప్రజాకర్షణ పథ కాల్ని ఇందులో గుప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ఉచిత పథకాలవైపే మొగ్గుచూపుతోంది. ప్రజలకు ఉచితాల్ని ఆశచూపి వారి ఓట్లు కొల్లగొట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికలు ముగిశాయి. ఆ రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్‌ పెద్దెత్తున ఉచిత పథకా ల్ని తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అనూహ్య సంఖ్య లో అసెంబ్లిd సీట్లను కాంగ్రెస్‌ గెల్చుకోవడంతో ఈ ఉచిత పథకాలే అధికారానికి బాటలేస్తున్నాయన్న ఆలోచన పార్టీల్లో దృడపడింది. వాస్తవికతకు దగ్గరగా ఆలోచించే బీజేపీ కూడా కర్ణాటక ఎన్నికల్లో పలురకాల ఉచిత పథకాల్ని ప్రకటించింది.

- Advertisement -
   

దాదాపు అన్ని వర్గాల ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో పెద్దమొత్తంలో నగదు జమ చేస్తామని ఆశపెట్టింది. అయినా బీజేపీ హామీల్ని కర్ణాటక ప్రజలు విశ్వసించలేదు. దాదాపుగా అదే తరహా ఉచిత హామీల్నిచ్చిన కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపారు. ఈ పరిస్థితిని అధ్యయనం చేస్తే కర్ణాటక ప్రజలు ఉచితాలకంటే గత నాలుగేళ్ళుగా ఆ రాష్ట్రంలో బీజేపీ అవినీతి పాలనపై విసిగిపోయారని అర్థమౌతోంది. అక్కడ ప్రతిపనిలోనూ ప్రభుత్వ పెద్దలు, పాలకులు, అధికార పార్టీ నాయకులు 40శాతం వరకు కమీషన్లు పొందుతున్నారన్న ప్రచారం కర్ణాటక ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అవినీతికి వ్యతిరేకంగా కన్నడిగులు ఓట్లేశారు. అక్కడ కాంగ్రెస్‌ గెలుపు ఆ పార్టీ సానుకూల ఓటుగా పరిగణించలేం. కేవలం పాలక బీజేపీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు అనుగుణంగానే ఆ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షం వైపు మొగ్గుచూపారు.

అయితే కర్ణాటక ఫలితాలతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు ఉచిత పథకాలపైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టాయి. వీలైనన్ని ఉచిత పథకాల్ని తమ మేనిఫెస్టోలో ప్రకటించడం ద్వారా ప్రజల్ని తమవైపు ఆకర్షించేందుకు పోటీలు పడుతున్నాయి. అంతేతప్ప అసలు ఈ దేశ ప్రజలు పాలకుల నుంచి ఏం కోరుకుంటున్నారన్న అంశాల్ని ఏ రాజకీయ పార్టీ గుర్తించడం లేదు. ప్రజలకు ఉచితాలకంటే సగౌరవంగా జీవించాలన్న ఆకాంక్ష అధికంగా ఉంది. అందుకనువైన పరిస్థితుల్ని ప్రభుత్వం కల్పించాలని వారు కోరుతున్నారు. తాము సొంతంగానే సంపాదించుకుని తమ జీవన ప్రమాణాల్ని పెంచుకోవడం ద్వారా ఆత్మగౌరవంతో జీవించాలన్నదే వారి అభిమతం. ప్రభుత్వాలిచ్చే ఉచితాల కోసం చేయి చాచేందుకు ప్రస్తుతతరమెవరూ సిద్ధంగా లేరు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకు విద్య, వైద్యాల బాధ్యతను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో భుజానకెత్తుకోవాలి. నిత్యావసరాల ధరల్ని అదుపు చేయాలి. బ్లాక్‌మార్కెటీర్లను నిరోధించాలి. వ్యవస్థల్లో అవినీతిని నిర్మూలించాలి. తద్వారా ధరలు తగ్గుముఖం పడతాయి. సాధారణ వినియోగదార్లకు అందుబాటులోకొస్తాయి.

అలాంటి పరిస్థితులు ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పెంచుతాయి. తామెవరి ముందు చేతులు చాచి దేహీ అనడం లేదన్న ధైర్యాన్నిస్తాయి. భవిష్యత్‌పై భరోసా కల్పిస్తాయి. ఏటా మూడు సిలెండర్లను ఉచితంగా ఇస్తే అదనపు సిలెండర్లపై ధరల భారం అనూహ్యంగా పెరుగుతుంది. అలాగే ఉచిత సిలెండర్లు కేవలం ఓ వర్గానికి పరిమితమౌతాయి. ఈ భారాన్ని సమాజంలో అన్నివర్గాలు బలవంతంగానైనా భరించాల్సిన దుస్థితేర్పడుతుంది. అదే సిలెండర్ల ధరల్ని నియంత్రిస్తే పేదలు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు ఇబ్బందిపడరు. ఆత్మగౌరవంతో వారు జీవించే వీలేర్పడుతుంది. అలాగే వినియోగదార్లందరిపైన అదనపు భారం తగ్గుతుంది.

ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకొచ్చిన దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ను ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే కాక సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా పరిగణిస్తారు. నాలుగు దశాబ్దాల క్రితమే ఆయన అమలు చేసిన రెండ్రూపాయల కిలో బియ్యం పథకం ప్రజలకు ఆహార భద్రతను చేకూర్చింది. అప్పట్లో మార్కెట్లో కిలో బియ్యం నాలుగు నుంచి ఐదు రూపాయలు పలికేవి. ప్రజలకు బియ్యాన్ని ఉచితంగా ఇచ్చే సామర్ద్యం ఉన్నా ప్రజలకు ఉచితాన్ని అలవాటు చేయకూడదని ఎన్‌టీఆర్‌ భావించారు. ఉచితంగా తీసుకెళ్ళడం వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుందని గుర్తించారు. అలాగే ఉచితంగా అందిస్తే ప్రజల్లో బాధ్యత కొరవడుతుందని కూడా గుర్తించారు. ఈ కారణంగానే భారీ సబ్సిడీలు భరించి ఈ పథకం క్రింద కిలో బియ్యాన్ని రెండ్రూపాయలకు అందించారు

. అలాగే అప్పట్లో చేనేతల్ని ప్రోత్సహిస్తూ పేదలకు తక్కువ ధరలో చీరలివ్వాలని, పది రూపాయలకే చీర పథకాన్ని అమలు చేశారు. సగం ధరకే పేదలకు వస్త్రాల్ని అందుబాటులో పెట్టారు. ఇవన్నీ పూర్తిస్థాయి రాయితీల్ని ప్రభుత్వం భరించలేక కాదు.. వారెవరి ముందు చేయిచాచి ఉచితంగా తీసుకున్నామన్న ఆత్మన్యూనతకు లోనుకాకూడదన్న ఆలోచనతోనే. అప్పట్లో ప్రభుత్వం ఉచితంగా వండిన ఆహారాన్ని అందించే ఆర్థిక సామర్థ్యం కలిగున్నా ప్రజల్లో బాధ్యతను పెంచే లక్ష్యంతోనే అన ్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఇలాంటి పథకాల్ని అమలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నామమాత్రపు ధరపై ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement