Friday, May 17, 2024

43.5డిగ్రీల భానుడు.. తెలంగాణలో పెరుగుతున్న టెంపరేచర్లు​

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: రాష్ట్రంలో క్రమంగా భానుడి సెగలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులతో పగటి ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకు చేరువవుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నాడు నల్గొండ జిల్లాలో 43.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, మరోవైపు ఈ నెల 21వరకు వడగాల్పుల ప్రభావంకూడా ఉండనుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతల పెరుగుదలతో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదుఅవుతున్నాయి.

ఏప్రిల్‌ చివరి, మే మాసాల్లో నమోదుకావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పటినుంచే నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు, దీని ప్రభావం సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటున్నప్పటికీ పొల్యూషన్‌ ప్రభావంతో జనం తట్టుకోలేకపోతున్నారు. కాగా వేసవి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం ఈ నెల 21 ఉండనుంది వాతావరణ శాఖ పేర్కొంది. వడగాలుల ప్రభావం ప్రధానంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో పాటు నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement