Monday, May 6, 2024

Big Breaking | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది ప్రయాణికులు సజీవ దహనం

నాగ్​పూర్​–ముంబయి సూపర్​ ఎక్స్​ప్రెస్​వేపై ఇవ్వాల (శనివారం) జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 25 మంది ప్రయాణికులు చనిపోయినట్టు తెలుస్తోంది. బుల్దానా వద్ద ఈ యాక్సిడెంట్​ జరిగినట్టు సమాచారం. విదర్భ ట్రావెల్స్​కు చెందిన బస్సు నాగ్​పూర్​ నుంచి పుణేకు వెళ్తుండగా సింధ్​ఖేడ్​రాజా ప్రాంతంలో ఇవ్వాల మార్నింగ్​ ఈ యాక్సిడెంట్​ జరిగినట్టు పోలీసులు తెలిపారు.

యాక్సిడెంట్​ జరిగిన సమయంలో బస్సు వేగంగా వెళ్తోందని, ఈ క్రమంలో ఆ బస్సు ఎక్స్ ప్రెస్‌వే డివైడర్‌ను, ఆపై ఓ స్తంభాన్ని బలంగా ఢీకొట్టినట్టు పోలీసులు వెల్లడించారు.  అదేవిధంగా బస్సు మరికొంత దూరం వరకు ఈడ్యుకెళ్లి అదుపు తప్పి భారీ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బస్సుకు మంటల అంటుకోవడంతో అందులో ఉన్న వారు ప్రాణాలతోనే దహనమైయినట్టు పరిస్థితిని బట్టి వెల్లడవుతోంది.

కాగా, ఆ బస్సులో ఇద్దరు డ్రైవర్లు,  క్లీనర్‌తో సహా మొత్తం 33 మంది ఉన్నారు.  ఇప్పటివరకు 25 మంది ఈ ఘోర ప్రమాదంలో చనిపోయి ఉంటారని సమాచారం. మరో  ఐదుగురు తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స కోసం బుల్దానా సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి ఉచిత చికిత్స అందిస్తామన్నారు. ఈ ప్రమాదంలో ఒక డ్రైవర్‌ మృతి చెందగా, రెండో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement