Monday, May 6, 2024

యువకులు కుమ్మేశారు.. విజేతగా భారత్‌.. ఫైనల్లో శ్రీలంకపై 9వికెట్ల తేడాతో గెలుపు..

దుబాయ్‌: అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ను భారత యువజట్టు గెలుచుకుంది. దుబాయ్‌ వేదికగా శ్రీలంక యువజట్టుతో జరిగిన ఫైనల్లో భారతజట్టు 9వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా భారత జట్టు ఏడోసారి సొంతం చేసుకోవడం విశేషం. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 38ఓవర్లకు కుదించారు. అయితే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో మరోసారి వర్షం పడటంతో టార్గెట్‌ను డీఎల్‌ఎస్‌ పద్ధతిలో 102పరుగులుగా నిర్ణయించారు. తొలుత టాస్‌ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జట్టుకు ఓపెనింగ్‌ జోడీ విక్రమసింఘే (2), షివాన్‌ డానియేల్‌ (6) శుభారంభం అందించడంలో విఫలమయ్యారు.

వన్‌డన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్‌కీపర్‌ అంజల బండార (9) కూడా నిరాశ పరిచాడు. 31పరుగులుకే 3వికెట్లు కోల్పోయిన లంక జట్టు ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. 26బంతుల్లో 2ఫోర్లు సాయంతో 19పరుగులు చేసిన రోడ్రిగో టాప్‌స్కోరర్‌గా అజేయంగా నిలిచాడు. మొత్తంమీద శ్రీలంక జట్టు 38ఓవర్లలో 9వికెట్లు నష్టానికి 106పరుగులు చేసింది. సమష్టిగా సత్తా చాటిన భారత యువ బౌలర్లులో విక్కీ 3వికెట్లుతో మెరవగా, కౌశల్‌ 2వికెట్లు తీశాడు. రాజ్‌వర్ధన్‌, రవికుమార్‌, రాజ్‌ తలోవికెట్‌ తీశారు. అనంతరం భారత జట్టు 107పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ మధ్యలో వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం లక్ష్యాన్ని 102పరుగులుగా నిర్ణయించారు.

ఈ లక్ష్యాన్ని భారత జట్టు ఓపెనర్‌ హర్నూర్‌ సింగ్‌ (5) వికెట్‌ను కోల్పోయి ఛేదించింది. మరో ఓపెనర్‌ రఘువంశీ 67బంతుల్లో 7ఫోర్లు సాయంతో 56పరుగులు చేసి హాఫ్‌సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు. వన్‌డన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తెలుగు యువ క్రికెటర్‌ 49బంతుల్లో 2ఫోర్లుతో 31పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంమీద భారతజట్టు 21.3ఓవర్లలో 1వికెట్‌నష్టానికి 104పరుగులు చేసి ఛేదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement