Saturday, June 22, 2024

T20 World Cup : పొట్టి టోర్నిలో చిన్న టీమ్​లు

రెండు నెలల పాటు ఐపీఎల్‌ హంగామాను ఆస్వాదించిన క్రికెట్ అభిమానుల కోసం మరో మెగా టోర్నీ రెడీ అవుతోంది. ధనాధన్ పోరాటాలతో మరింతగా అలరించేందుకు టీ20 వరల్డ్ కప్‌ వచ్చేస్తోంది. వెస్టిండీస్‌, అమెరికా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీ మరో నాలుగు రోజుల్లోనే ఫ్యాన్స్‌ను పలుకరించనుంది. ఇండియా టైమ్ ప్రకారం జూన్‌ 2న మొదలయ్యే టోర్నీలో ఈ సారి రికార్డుస్థాయిలో 20 జట్లు పోటీ పడుతున్నాయి.

- Advertisement -

క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నంలో భాగంగా ఐసీసీ తొలిసారి అగ్రరాజ్యం అమెరికాకు టోర్నీ ఆతిథ్య హక్కులు కేటాయించింది. మరో 4 జట్లకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో పలు చిన్న జట్లు అర్హత సాధించాయి. యూఎస్‌ఏ, ఉగాండా, కెనడా టీ20 వరల్డ్ కప్‌లో అరంగేట్రం చేస్తుండగా నేపాల్, పపువా న్యూ గినియా రీఎంట్రీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిట్టి కప్పు బరిలో ఉన్న ఈ చిరు జట్ల గురించి తెలుసుకుందాం.

నేపాల్
పదేండ్ల తర్వాత నేపాల్‌ టీ20 వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయింది. ఇండియా మాదిరిగా నేపాల్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. స్వదేశంలో ఆ టీమ్‌ ఆడిన వన్డే వరల్డ్ కప్‌ క్వాలిఫయర్స్‌లో ప్రతీ మ్యాచ్‌కు ఫ్యాన్స్ పోటెత్తారు. ఆ టోర్నీలో12 మ్యాచ్‌ల్లో 11 విజయాలు సాధించి ఔరా అనిపించిన నేపాల్ అదే జోరుతో టీ20 వరల్డ్ కప్‌ ఆసియా క్వాలికేషన్‌లోనూ సత్తా చాటింది. గ్రూప్ దశలో సింగపూర్‌, మలేసియాను, సెమీఫైనల్లో యూఏఈని ఓడించి టీ20 కప్ బెర్తు సాధించింది. కెప్టెన్ రోహిత్ పాడెల్, దీపేంద్ర సింగ్, కుశాల్‌ మల్లా ఈ టీమ్‌లో కీలక ప్లేయర్లు. గతేడాది ఆడిన టీ20ల్లో 403 రన్స్‌తో రోహిత్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపేంద్ర గతేడాది మంగోలియాపై 9 బాల్స్‌లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టాడు. ఈ మధ్య ఖతార్‌పై ఆరు బాల్స్‌లో ఆరు సిక్సర్లు బాదిన అతను టీ20ల్లో 37 వికెట్లు కూడా తీశాడు. 20 ఏండ్ల కుశాల్‌ కూడా హిట్టర్‌, లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు.

పపువా న్యూ గినియా (పీఎన్‌జీ)
2023 ఈస్ట్- ఆసియా- పసిఫిక్ క్వాలిఫయర్‌లో అజేయంగా నిలిచి పీఎన్‌జీ ఈ వరల్డ్ కప్‌ బెర్తు సాధించింది. ఆ టీమ్ వరల్డ్ కప్‌ ఆడటం ఇది రెండోసారి. యూఏఈ, ఒమన్‌లో జరిగిన 2021 ఎడిషన్‌లో తొలిసారి పోటీ పడింది. కానీ, స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్‌, ఒమన్‌తో కూడిన గ్రూప్‌లో ఆడిన పీఎన్‌జీ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా నెగ్గలేకపోయింది. ఆ టోర్నీలో ఆడిన వారిలో పది మంది ప్రస్తుత టీమ్‌లోనూ ఉన్నారు. అసద్ వాలా కెప్టెన్‌గా కొనసాగుతుండగా, ఆల్‌రౌండర్ చార్లెస్ అమిని వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. పీఎన్‌జీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మీడియం-పేసర్ నార్మన్ వనువా, బ్యాటర్ టోనీ ఉరా, చార్లెస్‌ అమిని కీలక ఆటగాళ్లు.

అమెరికా
టోర్నీ ఆతిథ్య దేశంగా అమెరికా జట్టు క్వాలి ఫై అయింది. టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ టీమ్ ఆడటం ఇదే తొలిసారి. ఇండియాలో పుట్టిన కీపర్‌ మోనక్ పటేల్ కెప్టెన్‌గా ఉన్న జట్టుకు ఆరోన్ జోన్స్‌ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌ తో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన ఆతిథ్య జట్టు ఈ టోర్నీకి రెడీ అయింది. డల్లాస్‌లో జరిగే వరల్డ్ కప్‌ ఆరంభ మ్యాచ్‌లో కెనడాతో తలపడనున్న అమెరికా.. గ్రూప్‌-ఎలో ఇండియా, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌తో పోటీ పడనుంది. అమెరికా టీమ్‌లో కెప్టెన్‌ మోనక్ సహా చాలా మంది బయటి దేశాల వాళ్లే ఉన్నారు. న్యూజిలాండ్ క్రికెటర్‌ కోరె అండర్సన్‌ ఇప్పుడు యూఎస్‌కు ఆడుతున్నాడు. ఒకప్పుడు వన్డేల్లో ఫాసెస్ట్‌ సెంచరీ చేసిన అండర్సన్‌పై ఆతిథ్య జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన స్పీడ్ స్టర్‌ అలీ ఖాన్‌, ఇండియన్ లెగ్ స్పిన్నర్‌ హర్మీత్‌ సింగ్‌పైనా అంచనాలు ఉన్నాయి. టీమ్‌లోని మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీశ్ కుమార్, సౌరభ్ నరేశ్‌ కూడా ఇండియన్సే.

ఉగాండా
ఆఫ్రికాకు చెందిన ఉగాండా జట్టు ఐసీసీ వరల్డ్ కప్‌లో పోటీ పడటం ఇదే తొలిసారి. గతేడాది ఆఫ్రికా క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌లో ఉగాండా సత్తా చాటింది. ఏడు జట్లు బరిలో నిలిచిన ఈ టోర్నీలో బలమైన జింబాబ్వేను ఓడిస్తూ రెండో స్థానంలో నిలిచి వరల్డ్ కప్ బెర్తు సాధించింది. తమ దేశంలో సెటిలైన ఫారినర్స్‌ ద్వారా క్రికెట్‌ నేర్చుకున్న ఉగాండా చాన్నాళ్ల నుంచి ఆటపై ప్రేమను పెంచుకుంది. స్కూల్‌ లెవెల్ నుంచి దేశంలో క్రికెట్ డెవలప్ అవ్వడంతో చాలా మంది ప్రొఫెషనల్ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు.

ఈ క్రమంలో తొలిసారి క్రికెట్‌ వరల్డ్ కప్‌ ఆడే స్థాయికి ఉగాండా ఎదిగింది. 43 ఏండ్ల ఫ్రాంక్ ఎన్‌సుబుగ టీ20 వరల్డ్ కప్‌లో ఓల్డెస్ట్ ప్లేయర్‌ కానున్నాడు. పాక్‌కు చెందిన రైజత్ అలీ షా ఆ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతనితో పాటు బ్యాటర్లు రోజర్ ముకాస, సైమన్ సెసాజి, ఉగాండా తరఫున టీ20ల్లో వంద వికెట్లు తీసిన హెన్రీ సెన్యేండో ఈ టోర్నీలో తమదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.

కెనడా

అమెరికా రీజియన్ క్వాలిఫయర్‌లో టాప్ ప్లేస్ సాధించిన కెనడా ఫస్ట్ టైమ్ టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. బెర్ముడాను ఓడించి బెర్తు దక్కించుకుంది. స్పిన్‌ బౌలింగ్ ఆల్‌ రౌండర్‌ సాద్ బిన్ జాఫర్‌ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరి స్తున్నాడు. 15 మందితో కూడిన జట్టులో 12 మంది 30 ప్లస్ ఏజ్‌లో ఉండటం గమనార్హం. కెప్టెన్ సాద్ బిన్‌తో పాటు జమైకాలో పుట్టిన ఓపెనర్ ఆరోన్ జాన్సన్‌, పాకిస్తాన్‌ నుంచి వచ్చిన సీమర్ కలీమ్ సనాపై అంచనాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్‌నకు కొత్తే అయినా వన్డే వరల్డ్ కప్‌లో కెనడా ఇది వరకు నాలుగు సార్లు పోటీ పడింది. 1979, 2003, 2007, 2011 ఎడిషన్లలో ఆడింది. 2003లో బంగ్లా, 2011లో కెన్యాను ఓడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement