Sunday, April 28, 2024

Slow Over Rate Penalty: రిష‌బ్ పంత్‌కు భారీ ఫైన్..

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు ఐపీఎల్‌ నిర్వాహకులు రూ.12లక్షల జరిమానా విధించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ మేరకు భారీగా ఫైన్‌ వేశారు. విశాఖపట్నంలో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంత్‌ సేన 191 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(43), డేవిడ్‌ వార్నర్‌(52) మెరుపులకు తోడు పంత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత తొలి అర్ధ శతకం (32 బంతుల్లో 51) నమోదు చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టును ఢిల్లీ క్యాపిటల్స్‌ 171 పరుగులకే పరిమితం చేసింది. తద్వారా 20 పరుగుల తేడాతో గెలుపొంది..

తాజా సీజన్‌లో తొలి విజయం అందుకుంది. ఇక ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఖలీల్‌ అహ్మద్‌ అద్భుతమైన స్పెల్‌(2/21)తో రాణించగా.. ముకేశ్‌ కుమార్‌ మూడు వికెట్లతో చెలరేగాడు. అక్షర్‌ పటేల్‌ సైతం ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. అయితే, స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేయడంతో ఢిల్లీ సారథి పంత్‌కు ఫైన్‌ పడింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్‌ నిర్వాహకులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్‌ చేసిన తొలి తప్పిదం కావున రూ. 12 లక్షల జరిమానాతో సరిపెట్టారు. ఇదే గనుక మరోసారి పునరావృతమైతే కెప్టెన్‌ రూ. 24 లక్షలు ఫైన్‌ వేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement