Monday, June 17, 2024

RCB: కొంప ముంచిన ‘ఈ సాలా కప్ నమదే’ నినాదం

ఐపీఎల్ 17వ సీజన్‌ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుకు భంగపాటు తప్పలేదు. రాజస్థాన్‌ అద్భుత విజయంతో రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్లింది. ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ వచ్చిన ఆర్సీబీకి మళ్లీ చుక్కెదురైంది. వరుసగా ఆరు విజయాలు సాధించి అనూహ్యరీతిలో ప్లేఆఫ్స్‌కు చేరిన బెంగళూరు ఎలిమినేటర్‌లో ఓడిపోయింది. నాకౌట్‌కు చేరుకొనేందుకు తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నైపై గెలిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఆ సందర్భంగా సంబరాలు చేసుకుంటూ సీఎస్కే ఆటగాళ్లకు కరచాలనం చేసేందుకు ఆర్సీబీ ప్లేయర్లు సమయం తీసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు రేగాయి. ఇప్పుడు ఓడిపోవడంతో ఆ జట్టు నెట్టింట విపరీతంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక సూచన చేశాడు. ఒక మ్యాచ్‌ గెలవగానే అతిగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు.

”జీవితంలో మీరు ఏదైనా సాధిస్తే.. నోరును అదుపులో పెట్టుకొని ముందుకు సాగిపోవాలి. మీరు ఎప్పుడైతే అనవసరంగా గోల చేస్తారో ఇక అక్కడ నుంచి పైకి వెళ్లలేరు. సీఎస్కేపై విజయం సాధించిన తర్వాత ఆర్సీబీ అభిమానులు తమ జట్టు గొప్పదనాన్ని తెలిపేందుకు చాలా వీడియోలు పోస్టు చేశారు. ఇప్పుడు అవే వారికి తిరిగి వచ్చాయి. క్రికెట్‌లో అతిగా సంబరాలు చేసుకోవడం ఎప్పటికీ మంచిదికాదు. మీరు బాగా ఆడితే కంగ్రాట్స్‌ చెబుతారు. చెత్తగా ఆడితే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ఆ సమయంలో నోరు మూసుకొని దూకుడు తగ్గించుకోవాలి. అద్భుతంగా కమ్‌బ్యాక్‌ చేసి నాకౌట్‌కు చేరుకున్నందుకు వారిని వారు అభినందించుకోవడం మంచిదే. కానీ, సీఎస్కే, ముంబయి వంటి జట్లు ఇలా చాలాసార్లు చేసి చూపించాయి. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌లో మాత్రం ఓటమిని చవిచూసింది” అని వ్యాఖ్యానించాడు.

కోహ్లీ ఆర్సీబీని వదిలి ఢిల్లీకి వెళ్లాలి: పీటర్సెన్

”ఐపీఎల్ టైటిల్‌ను అందుకొనే అర్హత విరాట్ కోహ్లీకి ఉంది. బెంగళూరును గెలిపించేందుకు చాలా కష్టపడ్డాడు. ఈ ఏడాది ఆరెంజ్‌ క్యాప్‌ అతడిదే. జట్టులో మిగతావారి నుంచి కూడా మద్దతు వచ్చి ఉంటే తప్పకుండా ఆర్సీబీ టైటిల్‌ నెగ్గేదే. ఈ జట్టుకు విరాట్ బ్రాండ్‌ను తీసుకొచ్చాడు. కమర్షియల్‌గానూ ఆర్సీబీకి విలువ వచ్చింది. కప్‌ను అందుకోవాలని ఉంటే మాత్రం అతడు వేరే ఫ్రాంచైజీకి మారిపోవాలి. దిల్లీ క్యాపిటల్స్ అయితే బాగుంటుంది. దిల్లీలో కోహ్లీకి ఇల్లు కూడా ఉన్నట్లు తెలుసు. తన కుటుంబంతో గడిపేందుకు మరింత సమయం లభిస్తుంది” అని కెవిన్‌ పీటర్సెన్ వ్యాఖ్యానించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement