Friday, March 29, 2024

తొలి డబ్ల్యూపీఎల్‌ విజేతగా ముంబయి జట్టు

డబ్ల్యూపీఎల్‌లో తొలి విజేతగా ముంబయి జట్టు అవతరించింది. ఉత్కంఠభరిత ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఢిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. 132 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఓపెనర్‌ యాస్తికా భాటియా (4)ను రాధా యాదవ్‌ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చింది. అనంతరం మరో ఓపెనర్‌ హెయిలీ మాథ్యూస్‌ (13) కూడా నిరాశ పరిచింది. జోనాసేన్‌ బౌలింగ్‌లో అరుంధతి రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో ఒక్కసారిగా ముంబయిపై ఒత్తిడి పెరిగింది. అయితే, తొలిడౌన్‌లో వచ్చిన బ్రంట్‌.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించింది. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జోరందుకున్న ఈ జట్టును కాప్సీ విడగొట్టింది. 37 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద హర్మన్‌ రనౌట్‌గా వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అమీలా కెర్‌ (14 నాటౌట్‌; 8 బంతుల్లో 2×4 ) చక్కని సహకారం అందించడంతో.. మరో మూడు బంతులు మిగిలుండగానే బ్రంట్‌ లక్ష్యాన్ని ఛేదించింది. నాట్‌సీవర్‌ బ్రంట్‌ 55 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలించింది.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ది ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (35; 29 బంతుల్లో 5×4), షిఖా పాండే (27 నాటౌట్‌; 17 బంతుల్లో 3×4,1×6), రాధా యాదవ్‌ (27 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4,2×6) మినహా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement