Sunday, October 20, 2024

Gautam Gambhir : కెకెఆర్ విజ‌యంలో మాస్ట‌ర్ మైండ్

గత రెండు సీజన్లలో ఏడో స్థానంలో నిలిచిన జట్టు.. ఈ సారి ఫైనల్‌కి వస్తుందని, అది కూడా టాప్‌ ప్లేస్‌తో అని ఊహించగలరా? కానీ అది జరిగింది. ఇంకా చెప్పాలంటే అతను వచ్చేలా చేశాడు.ఆ జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కాగా, ఆ వ్యక్తి ఆ జట్టు మెంటార్‌ గౌతమ్‌ గంభీర్ . కోల్‌కతా మేనేజ్‌మెంట్ మళ్లీ ఏరికోరి మెంటార్‌గా తెచ్చుకున్న గంభీర్‌.. జట్టుకు మూడో ట్రోఫీ అందించి తనెందుకు స్పెషలో నిరూపించాడు.

- Advertisement -

సీజన్‌ ప్రారంభానికి ముందు చెన్నై, ముంబయి, బెంగళూరు, లఖ్‌నవూ టైటిల్‌కి హాట్‌ ఫేవరెట్లు. ఈ నాలుగు నుంచి రెండు టీమ్‌లు ఫైనల్‌కు వస్తాయని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనాలు వేశారు. అనూహ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదరగొడుతూ వచ్చింది. తొలి రోజుల్లో గాలి వాటం విజయాలు అన్నారు కానీ.. ఆ తర్వాత నైట్‌రైడర్స్‌ మామూలు జట్టు కాదు అని తేల్చేశారు. ఏకంగా 20 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌కు వచ్చింది. అక్కడా డేంజరస్ బ్యాటింగ్‌ ఉన్న సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. మళ్లీ అదే జట్టు ఫైనల్‌కి వస్తే.. అక్కడా అదే తీరును ప్రదర్శించి ఐపీఎల్‌ 17వ సీజన్‌ విజేతగా నిలిచింది.

ఆ టీమ్‌ ఇదంతా చేసింది అంటే.. దాని వెనుక మాస్టర్‌ మైండ్‌ గౌతమ్‌ గంభీర్‌. జట్టు బాధ్యతలు చేపట్టడంతోనే ట్రోఫీ సగం గెలిచినట్లు ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు అంటే అతని ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. గతంలో జట్టుకు నాయకుడిగా రెండుసార్లు కప్‌ అందించింది గంభీర్‌ అని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు జట్టులోకి అతను రావడం, జట్టుకు కప్‌ రావడంతో ‘నైట్‌రైడర్స్‌ను సన్‌రైజర్స్‌కి నైట్‌మేర్స్‌గా మార్చిన గంభీర్‌’ అంటూ ఫ్యాన్స్‌ తెగ పొగిడేస్తున్నారు. కోచ్ చంద్రకాంత్‌ పండిత్‌తో కలసి గంభీర్‌ తీసుకున్న నిర్ణయాలు, సభ్యులను ప్రోత్సహించిన విధానమే ఈ సక్సెస్‌కు కారణమని టీమ్‌ విజయాలను డీకోడ్‌ చేసినవాళ్లు చెబుతున్నారు.

మొదట విజయం అక్కడే..

విండీస్ స్టార్ బౌలర్‌గా గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో కనిపించిన సునీల్ నరైన్.. విధ్వంసకర బ్యాటింగ్‌ చేయగలడు అని ఐపీఎల్‌ ప్రేక్షకులు మరచిపోయారు. కానీ గతంలో ఆ దూకుడు చూసిన గంభీర్‌.. వచ్చీ రాగానే ఓపెనర్‌ అవతారం ఎత్తించాడు. ఇంకేముంది ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆ వెటరన్ క్రికెటర్ 15 మ్యాచుల్లో 488 పరుగులు చేసి హౌరా అనిపించాడు. ఓ ప్రధాన బౌలర్‌తో బ్యాటింగ్‌ చేయించడం, ఇన్ని పరుగులు బాదించడం అద్భుతమే. అక్కడే కోల్‌కతా ఆత్మవిశ్వాసం పెరిగిందంటారు విశ్లేషకులు. అగ్నికి వాయువు తోడైనట్లు నరైన్‌కు ఫిల్‌ సాల్ట్‌ భీకర ఓపెనర్‌గా కలిశాడు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. దీంతో ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడేశారు. ఇక గత సీజన్లలో పెద్దగా ఫామ్‌లో లేని ఆండ్రి రస్సెల్‌కు మరోసారి పూర్తి స్వేచ్ఛనివ్వడంలోనూ గంభీర్‌దే కీలక పాత్ర. ఈసారి రస్సెల్‌ ఏ రేంజిలో రెచ్చిపోయాడో మీరు చూసే ఉంటారు.

కెప్టెన్‌లో నమ్మకం పెంచి..

ఐపీఎల్‌ ప్రారంభానికి ముందే.. జాతీయ జట్టులో స్థానంతోపాటు సెంట్రల్ కాంట్రాక్ట్‌ నుంచి తొలగింపు కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ను మానసికంగా కుంగదీశాయి. ఆ ప్రభావం నుంచి బయటపడటంలో మెంటార్‌గా గౌతమ్‌ గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు. అతడిలో ఆత్మవిశ్వాసం నింపి మెరుగైన ప్రదర్శన చేసేలా ప్రోత్సహించాడు. డగౌట్‌లోనే ఉంటూ.. శ్రేయస్‌కు అవసరమైనప్పుడు యాక్టివ్‌ అయ్యేవాడు గంభీర్‌. మ్యాచ్‌ ముందు వరకు ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ కనిపించే గౌతీ.. ఒక్కసారి మ్యాచ్‌ ప్రారంభమైతే మ్యూట్‌లోకి వెళ్లిపోతాడు.

అయితే మైండ్‌ మాత్రం సూపర్‌ఫాస్ట్‌గా గేమ్‌ను చదివేస్తుంటుంది. అదే జట్టును ఈ సారి విజేతను చేసింది అని చెప్పొచ్చు. గత రెండు సీజన్లలో మెంటార్‌గా లఖ్‌నవూను ప్లేఆఫ్స్‌నకు తీసుకెళ్లిన గౌతీ.. ఈసారి తుది మెట్టుకు కోల్‌కతాను తీసుకొచ్చి గెలిపించాడు కూడా. గత సీజన్‌కు, ఈ సీజన్‌కు గంభీర్‌లో మార్పు ఏంటి అంటే.. అప్పుడు దూకుడుగా కనిపించాడు. కానీ ఈసారి గంభీరంగా మారిపోయాడు. అదే ఈసారి కప్‌ను అందించిది అని చెప్పాలి.

కెప్టెన్‌గా రెండు.. మెంటార్‌గా ఒకటి

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 2012, 2014లో గంభీర్ సారథ్యంలోనే ఛాంపియన్‌గా నిలిచింది. అప్పుడు కెప్టెన్‌గా జట్టుకు రెండు టైటిళ్లు అందించిన గౌతీ.. ఈ సారి మెంటార్‌గా వచ్చి మూడో కప్‌ను బహుమతిగా ఇచ్చాడు. 2012లో గంభీర్‌ ప్లేయర్‌గా పరుగుల వరద పారిస్తూనే ఇటు కెప్టెన్‌గానూ తన వ్యూహాలకు పదును పెట్టి జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. 590 రన్స్ చేసి ఆ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాాడు. 2014లో 335 రన్స్ చేసి రెండోసారి జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

వారి స్నేహం అద్భుతం..

మెంటార్‌ను ఎలా సపోర్టు చేయాలి అని అడిగితే.. ‘షారుక్‌ ఖాన్‌ చేసినట్లుగా’ అని ఒక్క ముక్కలో ఆన్సర్‌ చెప్పేయొచ్చు. ”గంభీర్‌ అలా డీలా పడొద్దు. కాస్త నవ్వుతూ ఉండు. జీవితంలో, ఆటల్లో గెలుపోటములు సహజం. రెండింటినీ సమానంగా స్వీకరించాలి. తప్పకుండా పుంజుకుంటాం” అని ఓ మ్యాచులో ఓడిపోయాక గౌతీతో షారుక్‌ అన్నాడు. ఓడితే కెమెరాలున్నాయని కూడా చూడకుండా విసుక్కునే యజమానులు ఉన్న ఈ ఐపీఎల్‌లో షారుక్‌ మాటలు ఎంతలా ఆ జట్టుకు ఉపయోగపడ్డాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. షారుక్‌, గౌతీ మంచి మిత్రులు. తమ మధ్య క్రికెట్‌కు సంబంధించి ఎక్కువ చర్చ కూడా ఉండదు. ఇది కూడా గంభీర్‌కు తద్వారా కోల్‌కతాకు కప్‌ సాధించిపెట్టింది అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement