Wednesday, May 1, 2024

టెస్టు కెప్టెన్సీకీ గుడ్‌ బై చెప్పేసిన కోహ్లీ.. బెస్ట్ కెప్టెన్​ గా మన్ననలు..

టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఓటమి అనంతరం సారథిగా తప్పుకుంటుంటున్నట్లు కోహ్లీ ట్విటర్‌ వేదికగా శనివారం వెల్లడించాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఓ లేఖను విడుదల చేశాడు. ఏడేళ్లుగా ఎంతో కష్టపడి జట్టును సరైన దిశలో నడిపించేందుకు కృషి చేసినట్లు పేర్కొన్నాడు. ఎప్పుడు ఒకప్పుడు విరామం తీసుకోక తప్పదు. ఏడేళ్లపాటు కెప్టెన్‌గా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహించాను. తనకు సహకరించిన బీసీసీఐకి, మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి తనకు సహకరించిన సహచర క్రికెటర్లకు కోహ్లీ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా గత ఏడాది నవంబర్‌లో కెప్టెన్‌గా తొలి టీ20 ప్రపంచకప్‌ అనంతర కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అనంతరం విరాట్‌ను బీసీసీఐ వన్డే కెప్టెన్‌గానూ తప్పించి గత డిసెంబర్‌లో సారథ్య బాధ్యతలును రోహిత్‌శర్మకు అప్పగించింది. టెస్టు కెప్టెన్‌గా కొనసాగిన కోహ్లీ దక్షిణాఫ్రికాపై వారి సొంతగడ్డలో 1-2తేడాతో టెస్టు సిరీస్‌ ఓడిన నేపథ్యంలో సారథిగా వైదొలుగుతున్నట్టు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించాడు.

2015లో ధోనీ విరమణ తర్వాత అతడి నుంచి కోహ్లీ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. 33ఏళ్ల విరాట్‌కోహ్లీ సారథ్యంలో 68టెస్టులు ఆడిన టీమిండియా 40 టెస్టుల్లో విజయాలు సాధించింది. మరో 17 మ్యాచ్‌ల్లో పరాజయం పాలవగా 11టెస్టులు డ్రాగా ముగిశాయి. స్వదేశంలో జరిగిన ప్రతి సిరీస్‌లోనూ భారతజట్టు కోహ్లీ కెప్టెన్సీలో విజయం సాధించింది. స్వదేశంలో డిసెంబర్‌ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ భారతజట్టును విజయపథంలో నడిపించాడు. శ్రీలంక, వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డలో ఓడించడంతోపాటు ఆస్ట్రేలియాను వారిగడ్డపై రెండుసార్లు ఓడించి సిరీస్‌ విజేతగా జట్టును నిలిపాడు. కెప్టెన్‌గా కోహ్లీ 58.82శాతం విజయాలను నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌ల జాబితాలో కోహ్లీ మూడోస్థానంలో ఉన్నాడు. గ్రేమ్‌స్మిత్‌ 53 టెస్టు విజయాలు, రికీ పాంటింగ్‌ 48టెస్టు విజయాలతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ ప్రకటన అనంతరం స్పందించిన బీసీసీఐ అతడికి అభినందనలు తెలిపింది. కోహ్లీ గొప్ప నాయకత్వ పటిమతో భారత టెస్టు జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాడని ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీని గొప్ప సారథిగా పేర్కొంటూ అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికాను భారతజట్టు వారిసొంతగడ్డపై ఓడించడంలో ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. కెప్టెన్‌గా కోహ్లీ కూడా రెండుసార్లు ప్రయత్నించినా సక్సెస్‌ కాలేకపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement