Friday, May 10, 2024

Cricket | రెండో మ్యాచ్‌లోనూ భార‌త్ ప‌రాజ‌యం.. టాప్ ఆర్డ‌ర్ అట్ట‌ర్ ఫ్లాప్‌!

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న టీ20 మ్యాచ్‌ల‌లో టీమిండియా వ‌రుస‌గా రెండోసారి ఓట‌మి చ‌విచూసింది. ఐపీఎల్ స్టారాధీస్టారులు చేతులెత్తేసిన చోట తెలంగాణ కుర్రాడు తిలక్‌ వర్మ మాత్రం అద్వితీయ అర్ధ శతకంతో చెలరేగాడు. ఈ క్ర‌మంలో భారత జట్టు మోస్తరు స్కోరు చేసింది.. టార్గెట్ చేజింగ్‌లో నికోలస్‌ పూరన్‌ దంచికొట్టడంతో టార్గెట్ చిన్నబోయింది. సర్వశక్తులు ఒడ్డిన భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేసే ప్రయత్నం చేసినా.. చివరి వరస బ్యాటర్లు రాణించడంతో కరీబియన్లనే విజయం వరించింది.

తొలి మ్యాచ్‌ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకోని భారత జట్టు వరుసగా రెండో టీ20లోనూ ఓడింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం విండీస్‌తో జరిగిన రెండో పోరులో హార్దిక్‌ సేన 2 వికెట్ల తేడాతో చిత్తైంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. తెలంగాణ కుర్రాడు (41 బంతుల్లో 51; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌సెంచరీతో కదంతొక్కగా.. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (24; 2 సిక్సర్లు) పర్వాలేదనిపించారు.

విండీస్‌ బౌలర్లలో అకీల్‌ హుసేన్‌, అల్జారీ జోసెఫ్‌, షెఫర్డ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్‌ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టగా.. పావెల్‌ (21; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌), హెట్‌మైర్‌ (22) రాణించారు. చివర్లో ఉత్కంఠ నెలకొనగా.. అకీల్‌ హుసేన్‌ (16 నాటౌట్‌), అల్జారీ జోసెఫ్‌ (10) జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా 3, యుజ్వేంద్ర చాహల్‌ రెండు వికెట్లు పడగొట్టారు. పూరన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం మూడో టీ20 జరుగనుంది.

తిలక్‌ తడాఖా..
అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న హైదరాబాదీ తిలక్‌ వర్మ.. రెండో మ్యాచ్‌లోనూ అదే నిలకడ కొనసాగించాడు. గత మ్యాచ్‌ మాదిరిగానే ఈ సారి కూడా భారత్‌కు శుభారంభం దక్కలేదు. శుభ్‌మన్‌ గిల్‌ (7) విఫలం కాగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (1) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో ఇషాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించిన 20 ఏండ్ల తిలక్‌ వర్మ.. క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత తనదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

- Advertisement -

ముఖ్యంగా రివర్స్‌ స్వీప్‌ ద్వారా అతడు రాబట్టిన బౌండ్రీ చూసి తీరాల్సిందే. మూడో వికెట్‌కు ఇషాన్‌తో కలిసి 42 పరుగులు జతచేసిన తిలక్‌.. ఐదో వికెట్‌కు పాండ్యాతో 38 పరుగులు జోడించాడు. సంజూ శాంసన్‌ (7) మరోసారి విఫలమయ్యాడుఉ. తన రెండో టీ20 మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన తిలక్‌ మరో భారీ షాట్‌కు యత్నించి మెక్‌కాయ్‌ చేతికి చిక్కగా.. హార్దిక్‌, అక్షర్‌ (14) విలువైన పరుగులు జోడించారు. చివర్లో రవి బిష్ణోయ్‌ (8 నాటౌట్‌ 1 సిక్సర్‌), అర్ష్‌దీప్‌ సింగ్‌ (6 నాటౌట్‌ ఒక ఫోర్‌) జట్టు స్కోరును 150 దాటించారు.

భారత్‌: 152/7 (తిలక్‌ 51, ఇషాన్‌ 27; జోసెఫ్‌ 2/28, షెఫర్డ్‌ 2/28),
వెస్టిండీస్‌: 18.5 ఓవర్లలో155/8 (పూరన్‌ 67; హార్దిక్‌ పాండ్యా 3/35, యూజువేంద్ర చాహల్‌ 2/19).

Advertisement

తాజా వార్తలు

Advertisement