Wednesday, May 1, 2024

CWC 2023 – పాకిస్థాన్ పై అప్ఘ‌న్ సంచ‌ల‌న విజ‌యం …

చెన్నై – పాకిస్థాన్ కు అఫ్గానిస్థాన్‌ షాకిచ్చింది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు చిత్తు చేసిన ఆ జట్టు.. ఇప్పుడు పాక్‌పై పంజా విసిరింది. పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్‌ రెండే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది. పాకిస్థాన్‌కిది హ్యాట్రిక్ ఓటమి. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో ఉన్న పాక్‌ సెమీస్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. ఇకపై ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గితేనే టాప్‌-4లోకి వచ్చే అవకాశం ఉంది.

లక్ష్యఛేదనకు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (65; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఇబ్రహీం జాద్రాన్‌ (74; 87 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వచ్చిన రహ్మత్‌ షా (77; 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), హష్మాతుల్లా షాహిది (48*; 45 బంతుల్లో 4 ఫోర్లు) నిలకడగా ఆడి అఫ్గాన్‌కు విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, హసన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.

పాక్‌ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ అజామ్ (74; 92 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ (58; 75 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సాద్ షకీల్ (25), ఇమామ్ ఉల్ హక్ (17), మహ్మద్ రిజ్వాన్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. చివర్లో షాదాబ్‌ ఖాన్‌ (40; 38 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌ నిలకడగా ఆడగా.. ఇఫ్తికార్ అహ్మద్‌ (40; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్‌ 3, నవీనుల్ హక్ 2, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబీకి ఒక్కో వికెట్ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement