Sunday, September 15, 2024

IND-ENG | రాంచీ టెస్ట్‌లో మార్పులు.. బుమ్రా, జైస్వాల్‌కు విశ్రాంతి!

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య రాంచీ వేదికగా ఈ నెల 23 (శుక్రవారం) నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు ఇంగ్లండ్‌ చేతిలో ఓటమిపాలైన టీమిండియా తర్వాత వరుసగా విశాఖ, రాజ్‌కోట్‌ వేదికలుగా జరిగిన రెండు, మూడో టెస్టుల్లో అద్భుత విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరికొన్ని రోజుల వ్యవధిలోనే నాలుగో టెస్టుకు సిద్దం కానుంది.

అయితే ఆ టెస్టులో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను పట్టేయాలని టీమిండియా భావిస్తోంది. తొలి టెస్టులో పోరాడి ఓడిన రోహిత్‌ సేన ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా బజ్‌బాల్‌ జట్టును మట్టి కరిపించింది. ఇప్పుడు అదే జోష్‌తో నాలుగో మ్యాచ్‌లోనూ విజయ ఢంకా మోగించాలని చూస్తోంది. కానీ ఆ మ్యాచ్‌కు టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు జస్ప్రీత్‌ బుమ్రా, యశస్వి జైస్వాల్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వర్క్‌లోడ్‌, ఇంజూరీ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వీరిద్దరికి రెస్ట్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలి మూడు మ్యాచ్‌లలో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన బుమ్రా ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు కూడా పడగొట్టాడు. ముఖ్యంగా విశాఖ వేదికగా జరిగిన టెస్ట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇతను రెండు ఇన్నింగ్స్‌లలో 9 వికెట్లు పడగొట్టి ఒంటి చేత్తో టీమిండియాకు గొప్ప విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌లో అద్భుతమైన స్వింగ్‌తో బజ్‌బాల్‌ బ్యాటర్లను హడలెత్తిస్తూన్నాడు. వైస్‌ కెప్టెన్‌ బుమ్రా ఇప్పటీవరకు భారత పేసర్లలో అత్యధికంగా దాదాపు 81 ఓవర్లు వేశాడు.

అందులో 17 వికెట్లతో టోర్నీ టాప్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 16 వికెట్లతో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా (12 వికెట్లు) మూడో స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యంలో దూసుకెళ్లడంతో నాలుగో టెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇస్తే బాగుంటుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ధర్మశాల వేదికగా జరిగే 5వ టెస్టు పేస్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో ప్రధాన పేసర్‌ బుమ్రాకు రాంచీ టెస్ట్‌ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే బుమ్రా స్థానంలో ముఖేశ్‌ కుమార్‌ లేక ఆకాశ్‌ దీప్‌లలో ఎవరికీ అవాశం లభిస్తుందో చూడాలి.

యశస్వి ఆడటం కూడా డౌటే..

- Advertisement -

వరుసగా రెండు టెస్టులో డబుల్‌ సెంచరీలు బాదేసి సంచలనం సృష్టించిన టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ కూడా రాంచీ టెస్ట్‌లో ఆడటం అనుమానమే. మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అనంతరం జైస్వాల్‌ వెన్ను నొప్పితో రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు. ఆ రోజు విశ్రాంతి తీసుకున్న జైస్వాల్‌ తర్వాతి రోజు మళ్లి బ్యాట్‌ ఝుళిపించి చారిత్రక ద్వి శతకాన్ని నమోదు చేశాడు. దాంతోపాటు ఎన్నో రికార్డులు తిరగరాశాడు. కాగా ఆ తర్వాత ఫీల్డింగ్‌ సమయంలో ఆసౌకర్యంగా కనిపించాడు. నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించాడు.

ఇంకా నొప్పి పూర్తిగా తగ్గకపోవడంతో జైస్వాల్‌కు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తోందని సమాచారం. కాగా ధర్మశాలలో జరిగే టోర్నీ చివరి టెస్టులో యువ ఓపెనర్‌ మళ్లి అందుబాటులో ఉంటాడని తెలిసింది. ఒకవేళ అలా జరిగితే యశస్వి స్థానంలో దేవదత్‌ పడిక్కల్‌ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అద్భుత బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న జైస్వాల్‌ 6 ఇన్నింగ్స్‌లలో 109 సగటుతో 545 పరుగులు చేశాడు. దాంతోపాటు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లు బెన్‌ డకెట్‌ 288 పరుగులతో రెండో స్థానంలో నిలవగా.. ఓలీ పోప్‌ (285) మూడో స్థానం ఉన్నాడు.

రాహుల్‌ వచ్చేస్తున్నాడు..

హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయపడిన టీమిండియా ప్రధాన బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ విశాఖ, రాజ్‌కోట్‌ టెస్టులకు దూరమయ్యాడు. మూడో టెస్టులో అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. కానీ రాహుల్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించక పోవడంతో అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు మరో మూడు రోజుల్లో రాంచీ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమింయాకు శుభవార్త వస్తోంది. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న రాహుల్‌ పూర్తిగా కోలకొని ఫిట్‌నెస్‌ కూడా సాధించడని సమచారం. రాంచీ టెస్టుతో పునరాగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసింది.

పటీదార్‌పై వేటు పడుతుందా?

మూడో టెస్టులో ఘోరంగా విఫలమైన రజత్‌ పటీదార్‌పై వేటు పడటం ఖాయమనిపిస్తోంది. ఈ టోర్నీ ద్వారా టెస్టులో అరంగేట్రం చేసిన పటీదార్‌ రెండు టెస్టుల్లోనూ సత్తా చాటుకోలేక పోయాడు. ఇతను నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 46 పరుగులే చేయగలిగాడు. ఇతను వరుసగా 32,9,5,0 స్కోర్లే చేశాడు. అదే అతని సహచరులు మాత్రం విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. సర్ఫరాజ్‌ వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలతో రాణించగా.. దృవ్‌ జురెల్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లోనే 46 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం లభించలేదు. మరోవైపు యువ ఆటగాళ్లు జైస్వాల్‌ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. మొత్తంగా రజత్‌ పూర్తిగా ఫ్లాప్‌ అవడంతో రాంచీ టెస్ట్‌లో అతనికి మళ్లిd చోటు లభించడం కష్టమనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement