Friday, March 1, 2024

Brij vs Wrestlers – హ‌గ్ తో ఆగ‌లేదు.. ఒంట‌రిగా ర‌మ్మ‌న్నాడు.. రెజ్ల‌ర్స్

ఢిల్లీ – మహిళా అథ్లెట్లతో రెజ్ల‌ర్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ దారుణంగా ప్రవర్తించారని, ఛాతీపై తాకడం, రెజ్లర్లతో అసభ్య పదజాలాన్ని ఉపయోగించి సంభాషించడం వంటివి చేసేవారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ లో పొందుప‌రిచారు.. ఈ ఎఫ్ ఐ ఆర్ కాపీ ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. బ్రిజ్‌ భూషణ్ తమతో అత్యంత అనుచితమైన, దారుణమైన రీతిలో బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆయనకు భయపడి మహిళా అథ్లెట్లు ఎప్పుడూ తమ గదుల్లో నుంచి బయటకు వచ్చినా బృందాలుగానే ఉండేవారట. ”అయినప్పటికీ.. ఆయన మా బృందంలో నుంచి ఒకరిని వేరుగా తీసుకెళ్లి అభ్యంతరకర ప్రశ్నలు అడిగేవారు. వాటికి సమాధానాలు చెప్పలేకపోయేవాళ్లం” అని ఓ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

”ఓ రోజు ఆయన నన్ను పిలిచి నా టీ-షర్ట్‌ లాగారు. శ్వాస ప్రక్రియను చెక్‌ చేస్తున్నానంటూ నా ఛాతీపై, పొట్టపై అభ్యంతరకరంగా తాకారు. ఓసారి నాకు తెలియని ఓ పదార్థాన్ని తీసుకొచ్చి తినమని చెప్పారు. దాని వల్ల ఫిట్‌గా ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పేవారు” అని మరో బాధితురాలు ఆరోపించింది. కోచ్‌ లేని సమయంలో తమ వద్దకు వచ్చి ఇలాగే అభ్యంతరకరంగా ప్రవర్తించేవారని అవార్డు గెలుచుకున్న ఓ రెజ్లర్‌ ఆరోపణలు చేశారు. ”విదేశాల్లో జరిగిన పోటీల్లో నేను గాయపడ్డాను. అప్పుడు ఆయన నా వద్దకు వచ్చి.. తనతో సాన్నిహిత్యంగా ఉంటే ట్రీట్మెంట్ ఖర్చులన్నీ ఫెడరేషనే భరిస్తుందని చెప్పారు” అని మరో బాధితురాలు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది. ఫొటో తీసుకుందామంటూ తనను బలవంతంగా గట్టిగా హగ్‌ చేసుకున్నారని మరో రెజర్ల్‌ ఆరోపించింది.

ఇక, రెజ్లింగ్ సమాఖ్య సెక్రటరీ వినోద్‌ తోమర్‌పైనా ఓ రెజ్లర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఓ సారి తాను ఢిల్లీలోని డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయానికి వెళ్లినప్పుడు తోమర్‌ తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. గదిలో అందర్నీ బయటకు పంపించి.. తనను బలవంతంగా ఆయనవైపు లాక్కొన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, బ్రిజ్ భూషణ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారత అగ్రశ్రేణి రెజర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడుగురు మహిళా రెజర్లు ఆయనపై ఫిర్యాదులు చేయడంతో దిల్లీలోని కన్నౌట్‌ప్యాలెస్‌ పోలీసు స్టేషన్‌లో గత నెల రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆరుగురు మహిళా రెజర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్ , మరో మైనర్‌ రెజ్లర్‌ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్‌ను ఏప్రిల్‌ 28న నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపిన పోలీసులు ఈ ఆరోప‌ణ‌పై బ‌ల‌మైన సాక్ష్యాలు లేవంటూ బ్రిజ్ ను అరెస్ట్ చేయ‌డంలో చెతులేత్తాశారు.. ఇక నాలుగు రోజుల‌లో బ్రిజ్ త‌న ప‌ద‌వికి రాజీనామ చేయ‌కుంటే ఆందోళ‌న మ‌రింత ఉదృతం చేస్తామ‌ని రెజ్ల‌ర్లు హెచ్చ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement