Thursday, April 25, 2024

Movie review : నేను స్టూడెంట్ స‌ర్.. ఎలా ఉందంటే..

స‌తీశ్ వ‌ర్మ నిర్మాత‌గా..రాఖీ ఉప్ప‌ల‌పాటి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన చిత్రం నేను స్టూడెంట్ స‌ర్. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా హిట్టా ఫట్టా ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

కథ ఏంటంటే.. సుబ్బారావు అలియాస్ సుబ్బు (బెల్లంకొండ గణేష్) ఒక మామూలు మధ్య తరగతి కుర్రాడు. అతడికి ఐఫోన్ అంటే పిచ్చి. ప్రతి రోజూ మొబైల్ స్టోరుకి వెళ్లి తనకు నచ్చిన ఐఫోన్ మోడల్ చూసి.. ఎలాగైనా అది కొనాలని తాపత్రయ పడుతుంటాడు. కానీ అంత డబ్బు తన దగ్గరుండదు. అలా అని తల్లిదండ్రులను ఒత్తిడి చేయడు. ఓవైపు చదువుకుంటూనే చిన్న చిన్న పనులు చేసి డబ్బులు కూడబెడతాడు. సంవత్సరం పాటు కష్టపడ్డాక ఐఫోన్ కొనడానికి సరిపడా డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో వెళ్లి ఐఫోన్ కొంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరు కూడా పెట్టుకుంటాడు. సుబ్బు ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ఫోన్ ఒక గొడవ వల్ల పోలీసుల చేతికి చేరుతుంది. స్టేషన్ లోనే అది మిస్సవుతుంది. తన ఫోన్ కోసం ఏకంగా కమిషనర్ (సముద్రఖని) వరకు వెళ్లిపోతాడు సుబ్బు. ఆయన తన ఫోన్ బదులు వేరేది ఇస్తానని చెప్పినా సుబ్బు ఒప్పుకోడు. తన ఫోన్ కోసం సుబ్బు వేట కొనసాగుతుండగానే అతను ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. మరి ఆ కేసు వ్యవహారం ఏంటి.. ఇంతకీ సుబ్బు ఫోన్ తన చేతికి చిక్కిందా లేదా అన్నది మిగతా కథ.

- Advertisement -

నటీనటుల న‌ట‌న‌.. మొదటి సినిమా స్వాతిముత్యం కన్నా ఈ సినిమాలో కొంత పరిణితిచెందాడు బెల్లంకొండ గ‌ణేశ్ . రెండో సినిమానే చాలా టఫ్ సబ్జెక్ట్ ఎంచుకున్న గణేష్ తన శక్తిమేరకు ప్రయత్నించాడు. పక్కింటి స్టూడెంట్ కుర్రాడులా బాగానే చేసాడు. హీరోయిన్ అవంతిక గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆమె తెల్లగా ఉందే తప్ప అందంగా అనిపించదు. నటన కూడా పేలవం. సముద్రఖని ప్రతిభను ఈ సినిమాలో ఏమాత్రం ఉపయోగించుకోలేదు. పేరుకు కమిషనర్ అంటూ పెద్ద పాత్ర ఇచ్చారే తప్ప.. ఆ పాత్రలో ఏ ప్రత్యేకతా లేదు. సునీల్ క్యామియో తరహా పాత్ర చేశాడు. అతను ఓకే అనిపించాడు. శ్రీకాంత్ అయ్యంగార్ బాగానే చేశాడు. మిగతా నటీనటులంతా మామూలే.

టెక్నీక‌ల్స్.. నేను స్టూడెంట్ సర్’ సాంకేతికంగా సోసోగా అనిపిస్తుంది. మహతి స్వర సాగర్ గుర్తుంచుకోదగ్గ పాటలు ఇవ్వలేదు. సినిమాలో పాటలకు ప్రాధాన్యం తక్కువే. ఉన్న రెండు పాటలు కూడా మామూలుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఏదో అలా సాగిపోయింది. అనిత్ మదాడి ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి. కీలక పాత్రలకు సరైన నటులను ఎంచుకోలేదు. అన్ క్లైమ్డ్ అకౌంట్స్ క్రైమ్ చుట్టూ కథ అల్లాలన్న రైటర్ కృష్ణ చైతన్య ఐడియా ఓకే. దర్శకుడు కథ చెప్పే విధానంలో తడబడ్డాడు. ఇక ఈ సినిమాను 45 రోజుల్లో 3 కోట్ల బడ్జెట్ తో దర్శకుడు పూర్తి చేశారు.

ఇలా చేయడం వల్ల నిర్మాతకు అనవసర ఖర్చు లేకుండా ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు రాఖీ ఉప్పలపాటి మెచ్చుకోవచ్చు. అయితే ఒక థ్రిల్లర్ కథను పకడ్బందీగా డీల్ చేసే నైపుణ్యాన్ని అతను చూపించలేకపోయాడు. హీరో విలన్లకు చెక్ పెడుతూ రివర్స్ గేర్ లో వెళ్లే సీన్లు.. సినిమా మొత్తంలో కాస్త పర్వాలేదనిపిస్తాయి. అసలు విలన్లెవరో తెలిసే పతాక సన్నివేశాలను సాదాసీదాగా లాగించేశారు. విలన్ పాత్రల కోసం ఎంచుకున్న నటీనటులను చూస్తే కామెడీగా అనిపిస్తుంది తప్ప.. ఆ ఇంటెన్సిటీని ఫీలవ్వలేం. మొత్తంగా చూస్తే ‘నేను స్టూడెంట్ సర్’ ప్లాట్ పాయింట్ బాగున్నా.. ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడం వల్ల ఆశించిన ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైయింద‌నిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement