Sunday, April 28, 2024

England : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న బెన్‌స్టోక్స్

వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు బెన్‌స్టోక్స్ త‌ప్పుకున్నాడు. ఫిట్‌నెస్‌, శారీర‌క సామ‌ర్థ్యం మెరుగుప‌ర‌చుకోవ‌డంపైనే తాను దృష్టి పెట్టిన‌ట్లు స్టోక్స్ వెల్ల‌డించాడు. ఆల్‌రౌండ‌ర్‌గా 100 శాతం ప్ర‌ద‌ర్శ‌న కోసమే ఐపీఎల్‌, టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపాడు. ఈ మేర‌కు స్టోక్స్ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాడు.

“క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా పూర్తి పాత్రను నెరవేర్చడానికి నా బౌలింగ్ ఫిట్‌నెస్‌ను తిరిగి పెంచుకోవడంపై నేను తీవ్రంగా కృషి చేస్తున్నాను” అని స్టోక్స్ తెలిపాడు. ఐపిఎల్, ప్రపంచ కప్ ఆడ‌క‌పోవ‌డంతో ల‌భించే విరామం ఫిట్‌నెస్ సాధించడానికి ఉప‌యోగప‌డుతుంద‌ని, త‌ద్వారా భవిష్యత్తులో ఆల్‌రౌండ‌ర్‌గా జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌న్నాడు.
మోకాలికి శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్న స్టోక్స్ గ‌త తొమ్మిది నెల‌లు బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవ‌ల ఇంగ్లాండ్ జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో స్టోక్స్ కేవ‌లం బ్యాట‌ర్‌గానే ఆడాడు. ఈ ప‌ర్య‌ట‌న ద్వారా తాను బౌలింగ్‌లో ఎంత వెనుక‌బ‌డి ఉన్నానో అర్థ‌మైంద‌ని చెప్పాడు. ఇక టెస్టు సీజ‌న్ ఆరంభానికి ముందు కౌంటీ ఛాంపియ‌న్ షిప్‌లో డ‌ర్హామ్ త‌రుపున ఆడేందుకు ఎదురుచూస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు.
ఆస్ట్రేలియా వేదిక‌గా 2022లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ఇంగ్లాండ్ గెల‌వ‌డంలో స్టోక్స్ కీల‌క పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో విన్నింగ్ నాక్ ఆడాడు. ఇంగ్లాండ్ త‌రుపున అదే అత‌డికి చివ‌రి టీ20 మ్యాచ్ అయ్యింది. వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన స్టోక్స్ టెస్టుల్లో ఆడేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement